సచివాలయం నిర్మాణంపై మంత్రివర్గ ఉపసంఘం

26 Jun, 2019 01:51 IST|Sakshi

కొత్త సచివాలయం, అసెంబ్లీ భవనాల నిర్మాణంపై అధ్యయనం

ఎర్రమంజిల్‌ ప్యాలెస్, సచివాలయ భవనాల కూల్చివేతపై పరిశీలన

కమిటీ సిఫారసుల ఆధారంగా నిర్ణయాలు

కొత్త భవనాల శంకుస్థాపనలకు ఏర్పాట్లు ముమ్మరం  

సాక్షి, హైదరాబాద్‌: కొత్త సచివాలయం, అసెంబ్లీ భవన సముదాయాల నిర్మాణంపై అధ్యయనం కోసం రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి నేృత్వత్వంలో మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటైంది. ఈ కమిటీలో సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్, ఎక్సైజ్‌ శాఖ మంత్రి వి. శ్రీనివాస్‌గౌడ్‌ సభ్యులుగా వ్యవహరించనున్నారు. రోడ్లు, భవనాల శాఖ ముఖ్య కార్యదర్శి సునీల్‌శర్మ మంత్రివర్గ ఉపసంఘానికి సహాయ, సహకారాలు అందించనున్నారు. సచివాలయం, ఎర్రమంజిల్‌ భవనాల కూల్చివేత, సచివాలయంలోని ప్రభుత్వ శాఖల కార్యాలయాల తరలింపు, కొత్త సచివాలయం, అసెంబ్లీ భవన సముదాయాల నిర్మాణం, ఈ భవనాలకు సంబంధించిన డిజైన్ల ఖరారు తదితర అంశాలపై మంత్రివర్గ ఉపసంఘం అధ్యయనం జరిపి రాష్ట్ర ప్రభుత్వానికి నివేదికను సమర్పించనుంది. ఈ నివేదిక ఆధారంగా సచివాలయం, ఎర్రమంజిల్‌ భవనాల కూల్చివేత, కొత్త భవనాల నిర్మాణంపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ నిర్ణయం తీసుకోనున్నారు. సాధ్యమైనంత త్వరగా నివేదిక సమర్పించాలని ప్రభుత్వం మంత్రివర్గ ఉపసంఘాన్ని కోరింది. 

శంకుస్థాపనలకు ఏర్పాట్లు... 
కొత్త సచివాలయం, అసెంబ్లీ భవనాల శంకుస్థాపన కార్యక్రమాలకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 27న ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు కొత్త సచివాలయం, అసెంబ్లీ భవనాల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేయనున్న విషయం తెలిసిందే. సచివాలయంలోని డీ–బ్లాక్‌ భవనం వెనుక భాగంలోని పోర్టికో ఎదురుగా ఉన్న గార్డెన్‌లో కొత్త సచివాలయం నిర్మాణానికి ముఖ్యమంత్రి శంకుస్థాపన చేయనున్నారు. అదేవిధంగా ఎర్రమంజిల్‌ ప్యాలెస్, ఆర్‌ అండ్‌ బీ కార్యాలయ భవన సముదాయం మధ్యలోని ఖాళీ స్థలంలో కొత్త అసెంబ్లీ భవన నిర్మాణానికి శంకుస్థాపన నిర్వహించనున్నారు. శంకుస్థాపన కార్యక్రమాల ఏర్పాట్లలో భాగంగా ఈ రెండు చోట్లా శిలాఫలకాలను సిద్ధం చేస్తున్నారు. మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి మంగళవారం సాయంత్రం సచివాలయం, ఎర్రమంజిల్‌ను సందర్శించి ఏర్పాట్లను పరిశీలించారు.  

మరిన్ని వార్తలు