ఐఏఎస్‌.. ఐపీఎస్‌.. ఇప్పుడు ఐఎంఎస్‌ 

22 Jun, 2020 03:45 IST|Sakshi

ఇండియన్‌ మెడికల్‌ సర్వీస్‌ ఆవశ్యకతపై అంతటా చర్చ

జాతీయస్థాయిలో ప్రజారోగ్య రంగాన్ని సంస్కరించాలి

కరోనా నేర్పిన పాఠాలతో ‘కేడర్‌’ అవసరమే: నిపుణులు

సాక్షి, హైదరాబాద్‌: కరోనా మహమ్మారి నేపథ్యంలో వైద్యరంగం ప్రాధాన్యం అందరికీ తెలిసివచ్చింది. ఈ రంగానికి విలువ, గౌరవం కూడా పెరిగాయి. యావత్‌ ప్రపంచానికి సవాల్‌ విసిరిన ఈ మహమ్మారిని సమర్థవంతంగా ఎదుర్కునేందుకు, కనీసం కాపాడుకు నేందుకు ఇంకా ఎలాంటి ఔషధాలు, సాధనాలు లేకపోవడం సమస్య తీవ్రతను తెలియ జేస్తోంది. ప్రపంచంలోని వివిధ దేశాలతో పాటు మన దేశంలో, దాని పరిధిలోని రాష్ట్రాల్లో మరింత మెరుగైన, సమర్థవంతమైన ప్రజారోగ్య వ్యవస్థ ఆవశ్యకత ఏర్పడింది.

ఇలాంటి ప్రతికూల, అతిపెద్ద సవాళ్లతో కూడిన వాతావరణంలోనూ కరోనా కాటును కాచుకుంటూనే డాక్టర్లు, వైద్యసిబ్బంది బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఇప్పటివరకు ఈ సంక్షోభాన్ని భారత్‌ బాగానే ఎదుర్కోగలిగినా భవిష్యత్‌ సవాళ్లను మరింత దృఢంగా ఎదుర్కొనేందుకు, మంచి ఫలితాల సాధనకు అడుగులు పడాలనే అభిప్రాయం వైద్యవర్గాల్లో వ్యక్తమవుతోంది. దేశ సరిహద్దుల రక్షణ ప్రణాళికల విషయంలో చీఫ్‌ ఆఫ్‌ డిఫెన్స్‌ స్టాఫ్‌ ఎలాంటి పాత్ర పోషిస్తుందో అలాగే ప్రజారోగ్య రంగాన్ని కూడా పూర్తిగా సంస్కరించి ఒక వ్యవస్థను నిర్మించాలని పలువురు వైద్య నిపుణులు సూచిస్తున్నారు. (24 గంటల్లో 14,821 కొత్త కేసులు)

గతంలో రద్దయిన ‘కేడర్‌’
ఐఏఎస్‌/ఐఆర్‌ఎస్‌/ఐపీఎస్‌ అంటి అఖిల భారత సర్వీసుల మాదిరిగానే ఆల్‌ ఇండియా మెడికల్‌ సర్వీసెస్‌ కేడర్‌ను పునఃప్రవేశపెట్టాలనే అంశం కరోనా నేపథ్యంలో చర్చనీయాంశమైంది. దేశానికి స్వాతంత్య్రం రావడానికి కొన్నేళ్ల ముందే ఇండియన్‌ మెడికల్‌ సర్వీస్‌ (ఐఎంఎస్‌) సెంట్రల్‌ కేడర్‌ ఉండేది. దేశంలోని కీలకమైన పరిపాలన బాధ్యతలు, ప్రత్యేక పోస్టులను ఐఎంఎస్‌లే నిర్వహించే వారు. కొన్ని అంశాల్లో కేంద్ర–రాష్ట్రాల మధ్య వీరే సమన్వయం చేసేవారు. అయితే 1947 ఆగస్టులో దీనిని రద్దుచేశారు. మొదలియార్‌ కమిటీగా ప్రసిద్ధిచెందిన ‘ద హెల్త్‌ సర్వే అండ్‌ ప్లానింగ్‌ కమిటీ’ 1961లో సమర్పించిన నివేదికలో.. కేంద్ర, రాష్ట్ర మంత్రిత్వ శాఖల్లో సీనియర్‌ పోస్టులతో ‘సెంట్రల్‌ హెల్త్‌ కేడర్‌’ను ఏర్పాటు చేయాలని సూచించింది.

2005 నాటి ‘నేషనల్‌ కమిషన్‌ ఆన్‌ మైక్రో ఎకనామిక్స్‌ అండ్‌ హెల్త్‌’ నివేదికలోనూ ఐఏఎస్‌/ఐపీఎస్‌ల మాదిరిగా ఆల్‌ ఇండియా కేడర్‌ ఆఫ్‌ పబ్లిక్‌ హెల్త్‌ సర్వీసెస్‌ కేడర్‌ ఏర్పాటుపై గట్టి నిర్ణయం తీసుకోవాలని సూచించింది. మూడేళ్ల క్రితం ఎన్డీఏ ప్రభుత్వం కూడా కేంద్ర, రాష్ట్ర స్థాయిల్లో వైద్యరంగ నిర్వహణ, సాంకేతిక అంశాల్లో నైపుణ్యాల మెరుగు వంటి అంశాల్లో ప్రస్తుతం నెలకొన్న అంతరాలను దూరం చేసేందుకు ‘ఆల్‌ ఇండియా మెడికల్‌ సర్వీస్‌’ కల్పన ఆవశ్యకత ఏర్పడిందని, దీనిపై తమ అభిప్రాయాలు తెలపాలని రాష్ట్రాల సీఎస్‌లకు కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శిసీకే మిశ్రా లేఖ రాశారు. దీనిపై 2018 డిసెంబర్‌ కల్లా కేవలం ఆరు రాష్ట్రాలే అభిప్రాయాలను తెలిపాయి. ప్రధానంగా వైద్య, ఆరోగ్యరంగమనేది రాష్ట్రాల జాబితాలో ఉండడం వల్ల ఈ విషయంలో కేంద్రం పెత్తనం లేదా ఆజమాయిషీకి అవకాశం లేకపోయింది. ఈ పరిణామాల నేపథ్యంలో ఐఎంఎస్‌ ఏర్పాటు ఆవశ్యకతపై వైద్య ప్రముఖులు తమ అభిప్రాయాలను వెలిబుచ్చారు. (టాప్లో బ్రెజిల్.. మూడో స్థానంలో భారత్)

వైద్య విద్య మారాలి
ప్రపంచంలో మార్పులు వేగంగా చోటుచేసుకుంటున్నాయి. కానీ, వైద్యవిద్యలో మేం చదువుకున్నపుడు ఉన్న సిలబస్, కరిక్యులమే ఇప్పటికీ ఉన్నాయి. వైద్యరంగం లేదా ఆసుపత్రుల అడ్మినిస్ట్రేషన్, నిర్వహణ, బృందానికి నాయకత్వం వహించడం వంటి వాటిలో వైద్యవర్గాలకు తగిన శిక్షణ, అవగాహన అవసరం. వైద్యసేవల రంగంలో ఇప్పుడు ‘టీం వర్క్‌’కు ప్రాధాన్యత ఏర్పడింది. ఏ విషయంలోనైనా మెరుగైన ఫలితాలకు ప్రజా భాగస్వామ్యంతో పాటు సమష్టి భాగస్వామ్యం అవసరం. –డాక్టర్‌ సోమరాజు, వైద్య ప్రముఖుడు

ఉమ్మడి జాబితాలోకి మార్చాలి
దేశంలోని వైద్య, ఆరోగ్యరంగంలో రాష్ట్రాల మధ్య అంతరాలున్నాయి. భారతీయ వైద్యం ఇండియనైజ్‌ కావాలి. నీట్‌ పరీక్షను జాతీయస్థాయిలో నిర్వహించడం ద్వారా తొలి అడుగుపడింది. ఐఎంఎస్‌ కేడర్‌ ఏర్పాటైతే అది మలి అడుగవుతుంది. వైద్య, ఆరోగ్య రంగాన్ని కేంద్ర, రాష్ట్రాల ఉమ్మడి జాబితాలోకి తెస్తేనే ఐఎంఎస్‌ పునః ప్రారంభానికి, వైద్యరంగంలో కీలక మార్పునకు బీజం పడుతుంది. – డాక్టర్‌ కిరణ్‌ మాదల, గవర్నమెంట్‌ మెడికల్‌ కళాశాల, నిజామాబాద్‌

‘వైద్యా’నికి గౌరవం
ఈ ప్రతిపాదన ఆసక్తి కలిగిస్తోంది. ఐఏఎస్‌/ఐపీఎస్‌ మాదిరి ఐఎంఎస్‌ ఏర్పాటు చేస్తే వైద్య రంగంలో మంచి ఫలితాలొస్తాయి. కేంద్ర కేడర్‌ కావడం వల్ల ఈ రంగానికి గౌరవం, హోదా, హుందాతనం పెరగడంతో పాటు ఒక వ్యవస్థ నిర్మితమవుతుంది. అయితే వైద్యమనేది స్టేట్‌ సబ్జెక్ట్‌ కాబట్టి రాష్ట్రాలు ఏ మేరకు దీనిపై సానుకూలంగా స్పందిస్తాయో చూడాలి. – డాక్టర్‌ ఏవీ గురవారెడ్డి, ప్రముఖ ఆర్థోపెడిక్‌ వైద్యుడు

కేడర్‌ ఉంటే మంచిదే..
ఆల్‌ ఇండియా మెడికల్‌ సర్వీసెస్‌తో వైద్యరంగానికి ఎంతో ప్రయోజనం. ఈ రంగంలోని సమస్యలపై అవగాహన ఉండడం వల్ల ఎక్కడెక్కడ ఏయే చర్యలు తీసుకుంటే మంచిదనే దానిపై ఈ కేడర్‌ అధికారులు నిర్ణయించగలుగుతారు.  వైద్యవిద్య నిర్వహణ, పర్యవేక్షణ విషయం లోనూ ఆయా స్థాయిలు, పరిధుల్లో వైద్యరంగం నుంచి వచ్చిన వారికే సారథ్య బాధ్యతలు అప్పగించాలి. – డాక్టర్‌ బొల్లినేని భాస్కరరావు, ప్రముఖ కార్డియో థోరసిక్‌ వైద్యుడు

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు