ప్రభుత్వ ఆస్పత్రుల్లోనూ 70శాతం సిజేరియన్లే..

5 Aug, 2019 11:08 IST|Sakshi

కాన్పుకొస్తే కోతలే..

సాక్షి, యాదాద్రి: జిల్లాలోని అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో 2018 ఏప్రిల్‌ నుంచి 2019 జూన్‌ వరకు 13,383 ప్రసవాలు జరిగాయి. ఇందులో సాధారణ ప్రసవాలు 3,623 కాగా సిజేరియన్‌ ద్వారా 9,760 కాన్పులు చేశారు. జిల్లాలో సాధారణ కాన్పుల కంటే శస్త్ర చికిత్సల ద్వారా అధికంగా జరుగుతున్నాయని చెప్పడానికి ఈ గణాంకాలే నిదర్శనం. తల్లీబిడ్డల ఆరోగ్యం కోసం సాధారణ ప్రసవాలను ప్రోత్సహించేందుకు వైద్యారోగ్యశాఖ చేస్తున్న ప్రయత్నాలు జిల్లాలో ఫలించడం లేదు. ఇందుకు వైద్యులు, సిబ్బంది పనితీరే కారణమన్న విమర్శలు లేకపోలేదు. ఇదే విషయాన్ని వైద్యారోగ్యశాఖ కమిషనర్‌ యోగితారాణి స్వయంగా ప్రస్తావించడం జిల్లాలోని ఆస్పత్రుల్లో పరిస్థితిని తేటతెల్లం చేస్తోంది.

‘‘స్థానికంగా ఉండరు.. సమయానికి రారు.. వైద్యం కోసం వచ్చే ప్రజలకు అందుబాటులో ఉండరు.. సాధారణ ప్రసవాలు చేయాలని ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోరు.. రాష్ట్రంలోనే అత్యధిక ఆపరేషన్లు ఈ జిల్లాలో జరుగుతున్నాయి.. అందులో సిజేరియన్లే అధికంగా ఉంటున్నాయి.. ఈ పద్ధతి మారాలి.. లేకుంటే చర్యలు తప్పవు’’  వైద్య ఆరోగ్యశాఖ కమిషనర్‌ యోగితారాణా ఇటీవల జిల్లా ఆస్పత్రులను సందర్శించి వైద్యాధికారులను ఘాటుగా హెచ్చరించడం వారి పనితీరును ప్రశ్నిస్తోంది. 
 
ప్రభుత్వ ఆస్పత్రుల బలోపేతం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఏటా కోట్లాది రూపాయలు వెచ్చిస్తున్నా ఆశించినస్థాయిలో ఫలితాలు రావడం లేదు. ప్రధానంగా కాన్పుల విషయంలో ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. సాధారణ కాన్పులు జరిగేలా చూడాలని అందుకు   పెద్ద ఎత్తున ఖర్చు చేస్తోంది. అయినా ప్రజలు తమ చేతినుంచి విదుల్చుకోక తప్పడం లేదు. జిల్లాలో ప్రభుత్వ ఆస్పత్రులు ఉన్నా ప్రసూతి కోసం మెజార్టీ ప్రజలు ప్రైవేట్‌ హాస్పిటల్స్‌ను  ఆశ్రయిస్తున్నారు. ప్రైవేటు, కార్పొరేట్‌ ఆస్పత్రుల్లో ప్రసూతి కోసం వెళ్తే సుమారుగా రూ.25వేల నుంచి రూ.60 వేల వరకు ఖర్చవుతుంది.  మండల కేంద్రాలు, మినీ పట్టణ కేంద్రాల్లో తక్కువలో తక్కువ రూ.15 వేల నుంచి రూ.30 వేలకు తగ్గడం లేదు. అందుకు ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఆశించిన స్థాయిలో సేవలందకపోవడమే కారణమని తెలుస్తోంది.

మొదటి కాన్పులోనే సాధారణంగా చేయాలన్నది లక్ష్యం
మొదటి కాన్పులోనే సాధారణ ప్రసవం చేయాలన్నది వైద్యారోగ్య శాఖ లక్ష్యం. కానీ ప్రసవాలు అలా జరగడం లేదు. పీహెచ్‌సీల్లో డాక్టర్‌తోపాటు ఏఎన్‌ఎం, ఆశ వర్కర్, స్టాప్‌నర్సు, ఫార్మాసిస్టు అందుబాటులో ఉండాలి. చాలా పీహెచ్‌సీల్లో వీరెవరూ అందుబాటులో ఉండటం లేదు. 24గంటల ఆస్పత్రుల పనితీరు కూడా అధ్వాన్నంగా ఉంది. ఇదే విషయాన్ని కలెక్టర్‌ సైతం పలుమార్లు హెచ్చరించారు. అయితే ప్రసవం కోసం వచ్చిన గర్భిణిలను సాధారణ కాన్పు చేయడానికి 24గంటల వరకు వేచి చూడాల్సి ఉండగా అలా జరగడం లేదు. దీంతో సిజేరియన్లు అధిక మొత్తంలో జరుగుతున్నాయి. 

జిల్లాలో ఆస్పత్రులు ఇలా..
జిల్లాలో 19 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఉన్నా యి. ఇందులో 24గంటలు పని చేసే పీహెచ్‌సీలు 10 ఉన్నాయి. వీటిలో రాజాపేట, బీబీనగర్, మో త్కూర్, ఆత్మకూరు, యాదగిరిగుట్ట, బొమ్మలరామారం, భూదాన్‌పోచంపల్లి, తుర్కపల్లి, వలిగొండ, నారాయణపురంలో  ఉన్నాయి. అలాగే 12గంటలు పని చేసే పీహెచ్‌సీలు 9  అడ్డగూడూరు, కొండమడుగు, వర్కట్‌పల్లి, తంగడపల్లి, మోటకొండూర్, శారాజీపేట, వేములకొండ, బొల్లేపల్లి, మునిపంపులలో పని చేస్తున్నాయి. ఆలేరు, రామన్నపేట, చౌటుప్పల్‌లో కమ్యూనిటీ హెల్త్‌సెంటర్లు ఉండగా భువనగిరిలో జిల్లా కేంద్ర ఆస్పత్రి ఉంది. 

ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో అధిక ఫీజులు
పురిటినొప్పులతో ఆస్పత్రికి వచ్చే గర్భిణులను పరీక్షిస్తున్న కొందరు వైద్యులు శస్త్రచికిత్స తప్పనిసరి చేస్తున్నారు. లాభార్జనే ధ్యేయంగా ప్రసూతి కోసం వచ్చే వారిని అబ్జర్వేషన్‌ పేరుతో ఒకటికి రెండు రోజులు ఆస్పత్రిలో ఉంచి శస్త్రచికిత్స తప్పనిసరి అని చెబుతున్నారు. ఇందుకోసం తల్లీ, బిడ్డల ఆరోగ్యాన్ని ప్రమాదంగా చూపుతూ శస్త్రచికిత్స చేయాలని కుటుంబ సభ్యులపై వత్తిడి తెస్తూ వారిని ఒప్పిస్తున్నారు. ఇందుకోసం ప్రైవేటు ఆస్పత్రులు వేసే అన్ని రకాల ఫీజులను తప్పకుండా చెల్లించాల్సిన పరిస్థితి వస్తుంది.   

వసతుల లేమి!
ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసూతి కోసం వచ్చే వారికి వసతులు, వైద్యుల గైర్హాజరు, నిర్లక్ష్యం, మత్తు డాక్టర్లు లేకపోవడం, సరైన వైద్య పరికరాలు లేకపోవడంతో పాటు సిబ్బంది, విద్యుత్, మంచినీరు కొరత ప్రభుత్వ ఆస్పత్రిలో కాన్పులు చేయడానికి ప్రధాన అవరోధంగా మారింది. ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాల్లో మౌళిక సదుపాయాలు ఉన్నప్పటికీ వాటిలో ప్రసూతి సమయంలో అవసరమైన సౌకర్యాలు లేవు. కొన్ని చోట్ల ఉన్నా వాటిని వినియోగించే నాథుడే లేడు. ఒక వేళ ఆస్పత్రిలో అన్ని పరికరాలు ఉన్నా వైద్యులు, సిబ్బంది స్థానికంగా ఉండకపోవడం ప్రధాన సమస్య. రోజుల తరబడి ప్రాథమిక కేంద్రాలకు రాని వైద్యలు ఉన్నారంటే అతిశయోక్తికాదు. సరైన పర్యవేక్షణ లేకుండా పోయింది.  ఒకవేళ అన్ని సవ్యంగా ఉండి డాక్టర్‌ ఉన్నా సరైన వసతులు లేవని మండల కేంద్రాల నుంచి డివిజన్‌ కేంద్రాలకు, అక్కడి నుంచి ప్రైవేటు ఆస్పత్రులకు పంపించడం జరుగుతుంది. దీంతో ప్రసూతి సమయంలో ఆస్పత్రుల చుట్టూ తిరగలేక ప్రజలు నాలుగు డబ్బులు ఖర్చైనా పర్వాలేదంటూ అప్పులు చేసి ప్రైవేటు ఆస్పత్రులను ఆశ్రయిస్తున్నారు. 

శస్త్రచికిత్స లేని ప్రసవాలేవీ..?
ఆపరేషన్‌తో సంబంధం లేకుండా ప్రసవాలు చేయాలని కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు చెబుతున్నా యి. తల్లీబిడ్డల ఆరోగ్యం కోసం సాధారణ ప్రసవాలను ప్రోత్సహించాలని ఎంతగానో చెబుతు న్నా ఆచరణలో  అమలు కావడంలేదు. వైద్యారోగ్య శాఖ చేస్తున్న ప్రయత్నాలు యాదాద్రి భువనగిరి జిల్లాలో అమలు కావడం లేదు. జిల్లాలో ప్రసవాలను పెద్ద ఎత్తున శస్త్ర చికిత్సల ద్వారా చేయడం పట్ల కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్‌ యోగితారాణా, కలెక్టర్‌ అనితారామచంద్రన్‌ వైద్యాధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. జిల్లాలో శస్త్ర చికిత్సల ద్వారా 70.8శాతం ప్రసవాలు జరుగుతండగా సాధారణ ప్రసవాలు 29.2శాతం ఉంటున్నాయి. ఇదే విషయమై తీవ్రస్థాయిలో పోస్ట్‌మార్టం జరుగుతోంది.

కేసీఆర్‌ కిట్, నగదు ద్వారా ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాల సంఖ్య పెరుగుతున్నప్పటికీ వీటిలో కూడా శస్త్ర చికిత్సలే అధికంగా జరగడాన్ని తప్పుపడుతున్నారు. అలాగే ప్రైవేట్‌ ఆస్పత్రిలో కూడా శస్త్ర చికిత్సలే పెరగడం పట్ల అధికారులు అసహనం, ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఏప్రిల్‌ 2018 ఏప్రిల్‌ నుంచి 2019 జూన్‌ వరకు 13,383 కాన్పులు జరిగాయి.  ఇందులో సాధారణ కాన్పులు కేవలం 3, 623 కాగా   9,760 ప్రసవాలను సిజేరియన్‌ ద్వారా నిర్వహించడం పరిస్థితికి అద్దం పడుతోంది. మరో వైపు పీహెచ్‌సీల్లో ప్రసవాల సంఖ్య గణనీయంగా తగ్గుతుంది. ఇతర జిల్లాల్లో ప్రసవాలు జరుగుతున్నాయి. 

ప్రసవాలు.. 

సాధారణ సిజేరియన్‌ మొత్తం
3,623 9,760 13,383

మరిన్ని వార్తలు