నిర్లక్ష్యం..వైఫల్యం!

30 Mar, 2018 08:22 IST|Sakshi

జీహెచ్‌ఎంసీని కడిగి పారేసిన కాగ్‌

అన్ని రంగాల్లోనూ విఫలమైందని ఘాటుగా విమర్శలు

విశృంఖలంగా అక్రమ నిర్మాణాలు  

ఆస్తిపన్ను విధింపు, వసూళ్లలో నిర్లక్ష్యం  

చెరువుల పరిరక్షణలో వైఫల్యం  

బల్దియాను తీవ్రంగా తప్పుబట్టిన కాగ్‌ నివేదిక

ఆన్‌లైన్‌ అంశాలకు మాత్రం ప్రశంసలు

జీహెచ్‌ఎంసీలో భవన నిర్మాణాల్లో అక్రమాల నుంచి చెరువుల పరిరక్షణ, ఆస్తిపన్ను వసూళ్లు, ఘనవ్యర్థాల నిర్వహణల్లో జీహెచ్‌ంఎసీ విఫలమైందని ‘కాగ్‌’ కడిగి పారేసింది. ఈ అంశాల్లో వేటిల్లోనూ సమర్థంగా పనిచేయలేదని విమర్శించింది. అడ్డగోలు నిర్మాణాలను అడ్డుకోనందున విచ్చలవిడిగా అక్రమ నిర్మాణాలు చోటు చేసుకున్నాయని తూర్పారబట్టింది. క్షేత్రస్థాయి తనిఖీలు లేవని తప్పుబట్టింది. తడి పొడి చెత్త గురించి జీహెచ్‌ంఎసీ ఎంతగా ప్రచారం చేస్తున్నప్పటికీ, ఘనవ్యర్థాల నిర్వహణ అంతంత మాత్రంగానే ఉందని పేర్కొంది. స్వచ్ఛ కార్యక్రమాల్లో ప్రచార ఆర్భాటమే ఎక్కువగా ఉందని విమర్శించింది. జీహెచ్‌ఎంసీ పరిధిలో 2012 నుంచి 2017 వరకు జరిగిన పనులకు సంబంధించిన పూర్తి వివరాలను కాగ్‌ తన నివేదికలో పేర్కొంది. ఇక మై జీహెచ్‌ఎంసీ యాప్, ప్రజావాణి, ఎమర్జెన్సీ డయల్‌ 1100 తదితర కార్యక్రమాలను కాగ్‌ ప్రశంసించింది. ఆన్‌లైన్‌ లావాదేవీలను ప్రోత్సహించేందుకు ప్రజలపై భారం వేకుండా ట్రాన్సాక్షన్‌ రుసుంను మినహాయించడాన్ని కూడా కాగ్‌ అభినందించింది.

సాక్షి, సిటీబ్యూరో: జీహెచ్‌ఎంసీ పరిధిలో గత ఐదేళ్ల ఆస్తిపన్ను విధింపులో వ్యత్యాసాలున్నాయని కాగ్‌ తేటతెల్లం చేసింది. 75,387 ఆస్తులను తనిఖీ చేయగా, 41 శాతం (30,864) భవనాల్లో వ్యత్యాసం ఉందని వెల్లడించింది. వీటిలో 10,460 భవనాలు అక్రమ నిర్మాణాలేనని తప్పుబట్టింది. 2016–17లో భవన నిర్మాణాలకు 4,042 దరఖాస్తులు రాగా వాటిలో 33 శాతం(1,323) మందికి మాత్రమే ఓసీలు జారీ చేయగా, మిగతా వారి రికార్డులే లేవంది. ఓసీలు నిరాకరించినప్పుడు, అక్రమ కట్టడాలను గుర్తించినప్పుడు నోటీసులిస్తున్నామని పేర్కొంటూ 2016, 2017ల్లో మొత్తం 868 నిర్మాణాలను కూల్చివేసినట్లు తెలిపినప్పటికీ, పెండింగ్‌ కేసుల వివరాలు మాత్రం ఇవ్వలేదని బల్దియా తీరును తప్పుబట్టింది. అక్రమ నిర్మాణాలున్నాయని ఒప్పుకున్న జీహెచ్‌ఎంసీ.. కోర్టు కేసుల వల్ల, ప్రజా ప్రతినిధుల ఒత్తిళ్ల వల్ల తగిన చర్యలు చేపట్టడంలో అశక్తతను వెల్లడించారని కుండబద్దలు కొట్టింది. పర్యావరణ ప్రభావ రుసుమును వసూలు చేయలేకపోయారని పేర్కొంది. నివాసగృహాలను ఇతర అవసరాలకు వినియోగిస్తుండటాన్నీ ప్రస్తావించింది.  

ఆస్తిపన్ను వసూళ్లపై..
ఆస్తిపన్ను వసూళ్లు, పెనాల్టీల వసూళ్లలో తగిన విధంగా వ్యవహరించలేదని కాగ్‌ పేర్కొంది. 2017 మార్చి వరకు రావాల్సిన బకాయిలు రూ.1403.43 కోట్లలో.. రూ.900.33 కోట్లు మూడేళ్లుగా వసూలు చేయలేదని, ఇలాంటి భవనాలు 1,78,701 ఉన్నాయని వెల్లడించింది. టౌన్‌ ప్లానింగ్, రెవెన్యూ విభాగాల మధ్య సమన్వయం లేకపోవడాన్ని ప్రస్తావించింది. తద్వారా ఆరు సర్కిళ్లలో జరిపిన తనిఖీల్లో 708 భవనాలకు వెరసి రూ.5.25 కోట్లు ఆస్తిపన్ను తక్కువగా అసెస్‌ చేశారంది.   
విభాగం ఎప్పటికప్పుడు నిర్మాణ అనుమతుల వివరాలను రెవెన్యూ విభాగానికి అందజేయలేదని వెల్లడించింది. తనిఖీ చేసిన ఆరు సర్కిళ్లలో ఆస్తిపన్ను అసెస్‌మెంట్ల డేటాబేస్‌లో ఉండాల్సిన పన్ను చెల్లించేవారి వివరాలు లోపభూయిష్టంగా ఉన్నాయని స్పష్టం చేసింది.  
జీఐఎస్‌ ఆధారంగా ఆస్తిపన్ను మదింపు కోసం సర్వే వంటి వాటి కోసం రూ.20.81 లక్షలు ఖర్చు చేయగా, క్షేత్రస్థాయిలో జీహెచ్‌ంఎసీ పరిశీలించిన వివరాలకు పొంతనలేదని విరమించుకున్నప్పటికీ, రెండు రకాల సమాచారాన్ని పోల్చి సమన్వయపరిచే ప్రయత్నం చేయలేదంది.  
ఇక పన్ను పరిధిలోని నిర్మాణాలకు సంబంధించి జియో ట్యాగింగ్‌ ఏర్పాట్లలో 72 స్థానిక సంస్థల సాఫల్యతను జీహెచ్‌ఎంసీ సమీక్షించాలని సూచించింది. అనుమతి పొందిన ప్లాన్‌ కంటే అదనంగా నిర్మించిన వాటికి విధించాల్సిన జరిమానాల్లోనూ తక్కువ జరిమానా విధించినట్లు గుర్తించింది.  
టౌన్‌ప్లానింగ్‌ సమాచారంతో జియో ట్యాగింగ్‌ వంటి సాంకేతిక పద్ధతుల్ని వినియోగించుకొని అన్ని నిర్మాణాలనూ పన్ను పరిధిలోకి తేవాల్సి ఉందని సూచించింది.  
నివాసేతర భవనాల వయసును బట్టి వార్షిక అద్దె మీద ఇవ్వాల్సిన రిబేటు 10–30 శాతం కాగా, కొన్ని చోట్లా 40 శాతం ఇచ్చినట్లు పేర్కొంది.  
వసూలయ్యే ఆస్తిపన్నులో గ్రంథాలయ సెస్సును జిల్లా గ్రంథాలయ సంస్థకు సకాలంలో ఇవ్వకపోవడాన్ని తప్పుబట్టింది.   
ఇంటి నెంబర్లు ఇంకా పజిలే..
ఏళ్ల తరబడి ప్రయత్నాలు చేస్తున్నా ఇంకా ఇంటి నెంబర్ల నమోదు కొలిక్కి రాకపోవడాన్ని, లోటుపాట్లను బట్టబయలు చేసింది. ఏర్పాటు చేసిన చోటా డూప్లికేషన్‌ జరగడాన్ని ఎత్తిచూపింది.   

అంతా ప్రచార ఆర్భాటమే..
తడి– పొడి చెత్త గురించి జీహెచ్‌ంఎసీ ఎంతగా ప్రచారం చేస్తున్నా ఘనవ్యర్థాల నిర్వహణ అంతంత మాత్రంగానే ఉందని కాగ్‌ నివేదికలో పేర్కొంది. చెత్త ఉత్పత్తి స్థానంలో తడి–పొడి వేరవుతున్నది 27 శాతమేనంది. వ్యర్థాల నుంచి ఇంధన తయారీ ప్లాంట్లు ఏర్పాటు చేయలేకపోయారని, అందుబాటులోని డంపింగ్‌ ప్రాంతాలను పునరుద్ధరించలేదని పేర్కొంది. ఐదేళ్ల వ్యవధిలో రోజువారీ వ్యర్థాలు రెట్టింపు అయినట్లు పేర్కొన్నప్పటికీ, వ్యర్థాల పరిమాణాన్ని అంచనా వేసే యంత్రాంగం లేకపోవడాన్ని తప్పుబట్టింది.  

ముంపు సమస్యలు తప్పేదెప్పుడు..?
వరదనీటి కాలువల ఆధునికీకరణకు రూపొందించిన ప్రణాళిక ఏడేళ్లయినా అమలు చేయలేకపోయారని విమర్శించింది. వరదొస్తే నగరం చెరువుగా మారే దుస్థితి తప్పలేదని ప్రస్తావించింది. వరదనీరు నిలిచిపోయే 461 ప్రాంతాల్లో 52 ప్రదేశాలు అత్యంత ప్రమాదకరమైనవని, మరో 67 కూడళ్లలో జనసమ్మర్ధం ఎక్కువని హెచ్చరించింది.  
వర్షం వస్తే ఇవి ముంపుబారిన పడతాయని హెచ్చరించింది. వరదకాలువల విస్తరణకు 26 నాలాలపై రూ.350.13 కోట్లతో 71 పనులు చేపట్టినా ఆక్రమణలను తొలగించడంలో వైఫల్యం వల్ల 16 పనులు ఆగిపోయాయని కాగ్‌ పేర్కొంది.  
2012 నుంచి 2017 వరకు ఐదేళ్ల కాలంలో వరదకాలువల ఆధునికీకరణకు రూ.1306 కోట్లు బడ్జెట్‌లో కేటాయించినా, రూ.707 కోట్లు మాత్రమే ఖర్చు చేశారంది. సకాలంలో పనులు చేయనందున కేంద్రం నుంచి రావాల్సిన ఆర్థికసాయం రాలేదని ప్రస్తావించింది.  
నాలాల విస్తరణకు సంబంధించి పరిశీలించిన 24 పనుల్లో (అంచనా వ్యయం రూ.227.82 కోట్లు)13 పనులు అర్ధాతరంగా ఆగిపోయాయని గుర్తించింది. ఐదేళ్లలో మొత్తం రూ.78.34 కోట్లతో డీసిల్టింగ్‌ పనులు చేసినట్లు పేర్కొన్నప్పటికీ, చెత్తను కాలువల్లో వేయడాన్ని నిలువరించలేకపోయారని ఎత్తిచూపింది.  

చెరువులు మాయమవుతున్నా పట్టదా..?
చెరువుల పరిరక్షణలో పూర్తిగా విఫలమైనట్లు స్పష్టం చేసింది. చెరువులు, నాలాల వెంబడి 12,182 ఆక్రమణలకు గతేడాది జూలై వరకు కేవలం 7 శాతం(847) మాత్రమే తొలగించారని, 17 సరస్సులు ఎక్కడున్నాయో కూడా తెలుసుకోలేకపోయారని తప్పు పట్టింది. 9 సరస్సులు పూర్తిగా దురాక్రమణ పాలయ్యాయని నిగ్గు తేల్చింది.  

కొన్ని పద్ధతులకు ప్రశంసలు
వివిధ అంశాల్లో జీహెచ్‌ఎంసీని తప్పుపట్టిన కాగ్‌.. కొన్ని అంశాల్లో మంచి పద్ధతులు ప్రవేశపెట్టారని కితాబిచ్చింది. ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రారంభించిన ‘మై జీహెచ్‌ఎంసీ’ యాప్, ‘ప్రజావాణి’ కాల్‌సెంటర్,
ఎమర్జెన్సీ డయల్‌ 1100, ఆన్‌లైన్‌ సేవల(జీహెచ్‌ఎంసీ ఆన్‌లైన్, ట్విట్టర్‌)ను ప్రస్తావించింది. ఐదేళ్లలో వివిధ వేదికల ద్వారా జీహెచ్‌ఎంసీకి రూ.3.14 లక్షల ఫిర్యాదులు అందగా, 3.11 పరిష్కరించినట్లు పేర్కొంది. నగదురహిత లావాదేవీలను ప్రోత్సహించేందుకు ప్రజలపై ట్రాన్సాక్షన్‌ ఫీజు పడకుండా చేయడాన్ని అభినందించింది.  

మరిన్ని వార్తలు