‘కాగ్నా’కు జలకళ

28 Aug, 2014 23:39 IST|Sakshi

 తాండూరు: తాండూరు శివారులోని కాగ్నా నది పరవళ్లు తొక్కుతుంది. సోమ, మంగళవారాలతోపాటు బుధ, గురువారాల్లో ఏకధాటిగా కురిసిన వర్షంతో కాగ్నాకు జలకళ వచ్చింది. కాగ్నాతోపాటు డివిజన్ పరిధిలోని చిన్న వాగులు, వంకలు వరదనీరుతో పొంగిపొర్లాయి. దాంతో నదీపరీవాహక ప్రాంతంలోని బోర్లు, బావుల్లోని నీటిమట్టాలు పెరిగాయి.

 తాండూరు పట్టణానికి తాగునీటిని అందించే పంప్‌హౌస్‌తోపాటు, మహబూబ్‌నగర్ జిల్లా కొడంగల్, యాలాల మండలంలోని పలు గ్రామాలకు తాగునీరు సరఫరా చేసే మరో పంప్‌హౌస్‌లో నీటి మట్టం పెరిగింది. ఆగస్టులో సాధారణ వర్షపాతం 232.7 మిల్లీమీటర్లకుగానూ ఇప్పటివరకు 122 మిల్లీమీటర్లు(12.2సెంటీమీటర్లు) వర్షపాతం నమోదైందని స్థానిక వ్యవసాయ పరిశోధన స్థానం సీనియర్ శాస్త్రవేత్త డా.సి.సుధాకర్ పేర్కొన్నారు.
 తాజాగా కురిసిన వర్షాలతో భూమి బాగా తడవడం వల్ల రబీ పంటల సాగుకు ఎంతో మేలు జరుగుతుందని ఆయన అన్నారు.

 పెరిగిన నీటి మట్టం
 కాగ్నా నది సమీపంలోని పంప్‌హౌస్‌లో సుమారు నాలుగు అడుగుల నుంచి 12అడుగులకు, పాతతాండూరులోని మరో పంప్‌హౌస్ వద్ద మూడు అడుగుల నుంచి 10 అడుగులకు, కోడంగల్ తాగునీటి పథకానికి సంబంధించిన పంప్‌హౌస్‌లో నాలుగు అడుగుల నుంచి ఎనిమిది అడుగులకు నీటిమట్టం పెరిగింది. కాగ్నా నదిలోని ఇన్‌ఫిల్టరేషన్ బావుల్లోకి వరద చేరడం పంప్‌హౌస్‌లో నీటి మట్టం పెరగడానికి కారణమని పంప్‌హౌస్ సిబ్బంది పేర్కొన్నారు.

ఇన్‌ఫిల్టరేషన్ బావులు వరదనీటిలో మునిగిపోయాయి. పంప్‌హౌస్‌ల్లో నీటి మట్టం పెరగడం వల్ల వచ్చే వేసవి వరకు కూడా తాగునీటికి ఎలాంటి సమస్య ఉండదని మున్సిపల్ ఏఈ శ్రీను చెబుతున్నారు. ఈ భారీ వర్షం కారణంగా తాండూరు డివిజన్‌లోని సంగంకలాన్, కోకట్, అగ్గనూర్, బెన్నూర్,  తదితర గ్రామాలకు చెందిన రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

మరిన్ని వార్తలు