లెక్క.. పక్కా !

23 May, 2014 02:55 IST|Sakshi

ప్రాజెక్టుల నుంచి నీటివిడుదలకు సంబంధించి అధికారుల నిర్ణయాలకు ఇక చెల్లు! ఇకనుంచి వాడుకునే ప్రతీ నీటిబొట్టుకు లెక్క చెప్పాల్సిందే..! ఆయకట్టుకు నీళ్లుకావాలంటే అనుమతి తప్పనిసరిగా తీసుకోవాల్సిందే. రాష్ట్ర విభజన నేపథ్యంలో జిల్లాలో సాగునీటి ప్రాజెక్టుల నిర్వాహణ, నీటి విడుదల, మరమ్మతులు.. తదితర అంశాలన్నీ కృష్ణానది బోర్డు పరిధిలోకి వెళ్లనున్నాయి. ఇందుకోసం విజయవాడ లేదా కర్నూలు జిల్లాలో ప్రత్యేకబోర్డు ఏర్పాటుకానుంది.
 
 గద్వాల, న్యూస్‌లైన్: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ఆవిర్భావం నేపథ్యంలో జిల్లాలో జలవనరుల వినియోగం, ప్రాజెక్టుల పూర్తికి ప్రత్యేకబోర్డు ఏర్పడనుంది. ఈ రెండు రాష్ట్రాలకు అనుసంధానంగా కృష్ణానది ఉండటంతో ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ లేదా కర్నూలు జిల్లాల్లో కృష్ణాబోర్డు ఏర్పాటయ్యే అవకాశం ఉందని సంబంధితశాఖ ఉన్నతాధికారుల ద్వారా తెలిసింది. కృష్ణానదిపై ఉన్న ఈ ప్రాజెక్టులన్నీ బోర్డులో ఉన్న సభ్యులు తీసుకునే నిర్ణయాలపైనే ఆధారపడి ఉంటాయి. బోర్డు సీడబ్ల్యూసీ ఆధీనంలో పనిచేస్తుంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులు సభ్యులుగా ఉంటారు.
 
  కర్నూలు జిల్లాలో ప్రస్తుతం ఉన్న తుంగభద్ర బోర్డు కూడా రద్దుకానుంది. ఇది కూడా కృష్ణానది బోర్డు పరిధిలోకి వెళ్లనుంది. ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు, తుంగభద్ర నదిపై ఉన్న రాజోలిబండ నీటిమళ్లింపు(ఆర్డీఎస్)పథకం ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో నీటిపారుదల శాఖ అధికారులు ఈ ప్రాజెక్టుల నిర్వహణ బాధ్యతలను నిర్వర్తించారు. అయితే ఇకనుంచి ప్రాజెక్టుల నీటి విడుదలతోపాటు, వేసవిలో చేయాల్సిన మరమ్మతు పనులకు సంబంధించి బోర్డు అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. జూరాల ప్రాజెక్టు నిర్వాహణను చూస్తున్న రేవులపల్లి డ్యాం డివిజన్ ఇక కృష్ణాబోర్డు ఆదేశాలతోనే పనిచేయాల్సి ఉంటుంది.
 
  కొత్తగా నిర్మాణమై 2012లో జాతికి అంకితమైన భారీ ఎత్తిపోతల పథకాలు కృష్ణానది బోర్డు పరిధిలోకి వెళ్లనున్నాయి. ఇందులో రెండు లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించే నెట్టెంపాడు ఎత్తిపోతల పథకం, మూడు లక్షల ఎకరాలకు సాగునీటిని అందించే ఎంజీఎల్‌ఐ, రెండు లక్షల ఎకరాలకు సాగునీరు అందించే భీమా ఎత్తిపోతల పథకాలతోపాటు కోయిల్‌సాగర్ ప్రాజెక్టుల నిర్వాహణ కూడా కృష్ణాబోర్డు పరిధిలోకి వెళ్లనున్నాయి.
 
 అధికారుల నిర్ణయాలకు చెల్లు!
 కృష్ణానది కర్ణాటక నుంచి జూరాల ప్రాజెక్టుకు జూన్, జూలై నెలల్లో వరద వచ్చిన రోజునే ప్రాజెక్టు కాల్వల పరిధిలో ఆయకట్టుకు నీటి విడుదల జరిగేది. బోర్డు ఏర్పాటుతో జూరాల అధికారులు కృష్ణాబోర్డుకు సమాచారం అందించి అక్కడి నుంచి సమాచారం వచ్చిన తర్వాతే ఆయకట్టుకు నీటి విడుదల చేయాల్సి ఉంటుంది. ఇలాగే ఆర్డీఎస్, కోయిల్‌సాగర్, మిగతా ఎత్తిపోతల పథకాల్లో కూడా నీటి విడుదల కూడా బోర్డు అనుమతి పరిధిలోనే ఉంటుంది. జూరాల, కృష్ణానది రిజర్వాయర్ల నుంచి పంపింగ్ చేసి రిజర్వాయర్లను వరదనీటితో నింపాల్సిన విషయంలోనూ బోర్డుసభ్యులు తీసుకునే అనుమతే తుది నిర్ణయంగా ఉంటుందని అధికారులు చెబుతున్నారు. మరో మూడు నెలల్లో బోర్డు పూర్తిస్థాయిలో ఏర్పాటై ప్రాజెక్టుల నిర్వహణ పరిశీలన ప్రారంభిస్తుందని తెలిసింది.
 

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు