కాలిఫోర్నియా క్యాబేజీ కథేంటి?

1 May, 2016 02:28 IST|Sakshi

సాక్షిప్రతినిధి, నల్లగొండ : ఇంత పెద్ద గొర్రుతో ఏం చేస్తారు.. ఈ గొర్రు నిండా పైపులు అమర్చారెందుకు.. వర్షాలు తక్కువగా పడితే సాగులో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు... అసలు కాలిఫోర్నియా క్యాబేజీ కథేంటి.. ఈ ప్రశ్నలన్నీ ఏంటనుకుంటున్నారా..? అమెరికా పర్యటనలో ఉన్న జిల్లాకు చెందిన రాష్ట్ర మంత్రి జగదీశ్‌రెడ్డికి వచ్చిన సందేహాలివి. తెలంగాణ తెలుగు సంఘం ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన తెలంగాణ సాంస్కృతిక పండుగ కార్యక్రమంలో పాల్గొనేందుకు రెండు రోజుల ముందే అమెరికా వెళ్లిన జగదీశ్‌రెడ్డి కాలిఫోర్నియా రాష్ట్రంలో వ్యవసాయ క్షేత్రాలను పరిశీలించారు. ముఖ్యంగా అక్కడ సాగు చేస్తున్న క్యాబేజీ తోటల్లోకి వెళ్లి పంటల సాగు గురించి తెలుసుకున్నారు. బహుళ ప్రయోజనంతో రూపొందించిన గొర్రు ఎలా పనిచేస్తుందనే దాని గురించి కూడా ఆయన ఆసక్తిగా ఆరా తీశారు.
 
   ఏ పైపు నుంచి విత్తనాలు వేస్తారు.. ఏ పైపు నుంచి యూరియా చల్లుతారు.. ఏ పైపు నుంచి మందు పిచికారీ అవుతుంది.. భూమి లోపల యూరియా పడుతుందా.. చెట్టు మీద పడుతుందా.. మందు పిచికారీ ఎక్కడ జరుపుతారు.. అనే అంశాలపై అక్కడి శాస్త్రవేత్తలతో చర్చించారు. ప్రస్తుతం మనకు కరువు పరిస్థితులున్న నేపథ్యంలో అసలు వర్షాభావ పరిస్థితులున్నప్పుడు అమెరికాలో వ్యవసాయం ఏ విధంగా చేస్తారు.. ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు... తక్కువ నీటిని వినియోగించుకుని ఏయే పంటలను సాగు చేస్తారన్న దాని గురించి ఆరా తీశారు.
 
  తన అమెరికా పర్యటనలో శుక్రవారమంతా వ్యవసాయ పరిస్థితులను అధ్యయనానికే గడి పిన మంత్రి జగదీశ్‌రెడ్డి అమెరికా నుంచి ‘సాక్షి’ తో ఫోన్‌లో మాట్లాడుతూ తక్కువ ఖర్చుతో ఎక్కువ రాబడి వచ్చేలా అమెరికాలో వ్యవసాయం చేస్తున్నారని, ఇక్కడి రైతులు అవలంబిస్తున్న పద్ధతులు మన దగ్గర పాటిస్తే ముఖ్యమంత్రి కేసీఆర్ కోరుకున్న బంగారు తెలంగాణ సులభతరమవుతుందని వ్యాఖ్యానించారు. అమెరికాలో వ్యవసాయ పద్ధతులను మన రాష్ట్రంలోనికి కూడా తీసుకువచ్చే అంశంపై ముఖ్యమంత్రితో చర్చిస్తానని తెలిపారు. మంత్రి వెంట జిల్లాకు చెందిన నంద్యాల దయాకర్‌రెడ్డి, అమెరికా తెలంగాణ తెలుగు సంఘం ప్రతినిధి ఏనుగు శ్రీనివాసరెడ్డి తదితరులున్నారు.
 
 బంగారు తెలంగాణలో భాగస్వాములు కండి
 తెలంగాణ తెలుగు సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న తెలంగాణ సాంస్కృతిక పండుగ కార్యక్రమానికి హాజరయ్యేందుకు కాలిఫోర్నియా రాష్ట్రానికి వెళ్లిన మంత్రి జగదీశ్‌రెడ్డి అక్కడ టీఆర్‌ఎస్ ఎన్‌ఆర్‌ఐ సెల్ ఆధ్వర్యంలో నిర్వహించిన తెలంగాణ ఆవిర్భావ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తెలంగాణలో విద్యా ఉపాధి అవకాశాలను మెరుగుపర్చేందుకు గాను ఎన్‌ఆర్‌ఐలు ఇతోధికంగా కృషి చేయాలని, బంగారు తెలంగాణ నిర్మాణంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్ ఎన్‌ఆర్‌ఐ విభాగం నేతలు పూర్ణచందర్, నవీన్ జలగం, రంగినేని అభిలాష్, పొన్నాల శ్రీని, రజనీకాంత్, భాస్కర్, యశ్వంత్‌లతో పాటు పలువురు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు