అసెంబ్లీ రద్దుకు నిరసనగా ఓయూలో ఆందోళనలు

7 Sep, 2018 01:29 IST|Sakshi

నేడు విద్యా సంస్థల బంద్‌కు పిలుపు

హైదరాబాద్‌: కేసీఆర్‌ ఏకపక్ష నిర్ణయాలతో అసెంబ్లీ రద్దు చేయడాన్ని నిరసిస్తూ ఉస్మానియా వర్సిటీలో విద్యార్థులు గురువారం నిరసనలు చేపట్టారు. ఒక వైపు నల్ల జెండాలతో నిరసన ర్యాలీలు నిర్వహించగా, నాలుగున్నరేళ్లుగా రాష్ట్రానికి పట్టిన శని విరగడైందంటూ మరోవైపు స్వీట్లు పంచి, కేక్‌లు కట్‌ చేసి సంబరాలు చేసుకున్నారు. ఐక్య విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఓయూ ప్రధాన లైబ్రరీ నుంచి ఆర్ట్స్‌ కళాశాల మీదుగా భారీ ర్యాలీ జరిపారు. 

నిరుద్యోగ జేఏసీ చైర్మన్‌ మానవతారాయ్,టీజేఎస్‌ నేతలు రమేష్, కాంగ్రెస్‌ నేతలు దయాకర్‌ మాట్లాడుతూ ఉద్యమ ఆకాంక్షలను నెరవేర్చకుండా అసెంబ్లీని రద్దు చేయడం వల్ల తెలంగాణకు పట్టిన దరిద్రం వదిలిందని, కేసీఆర్‌ నియంత పాలననుంచి ప్రజలకు విముక్తి కలిగిందన్నారు. నాలుగున్నరేళ్లుగా ఖాళీగా ఉన్న లక్షలాది ఉద్యోగాలను భర్తీ చేయకుండా మానిఫెస్టో హామీలను అమలు చేయకుండానే అసెంబ్లీ రద్దు చేయడం సిగ్గు చేటన్నారు.

ప్రజల ఆకాంక్షను వ్యక్తిగత స్వార్థాల కోసం, తన వ్యక్తిగత కోరికలతో కాలాన్ని వృథా చేశారన్నారు. దీంతో ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తోందన్నారు. ఏదేమైనా తెలంగాణ రాష్ట్రానికి ఇదొక శుభపరిణామమని, రానున్న ఎన్నికల్లో యువత, నిరుద్యోగుల తీర్పు కీలకంగా మారుతుందన్నారు. ప్రజా తీర్పుతోనే కేసీఆర్‌ చెంపచెల్లుమనేలా విద్యార్థి లోకం సిద్ధం కావాలన్నారు.

నేడు విద్యాసంస్థల బంద్‌: అసెంబ్లీ రద్దును నిరసిస్తూ విద్యార్థులు ఓయూలో ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. రాష్ట్ర అసెంబ్లీ రద్దును నిరసిస్తూ శుక్రవారం విద్యా సంస్థలు, యూనివర్సిటీల బంద్‌కు ఐక్య విద్యార్థి సంఘాలు పిలుపునిచ్చాయి.బంద్‌లో ప్రభుత్వ, ప్రైవేటు విద్యా సంస్థలతో పాటు యూనివర్సిటీలు విధిగా పాల్గొనాలని విద్యార్థి సంఘాల నేతలు కోరారు.

మరిన్ని వార్తలు