ప్రైవేటు విద్యార్థులకు కాల్‌సెంటర్‌

11 Mar, 2019 04:10 IST|Sakshi

అన్ని పాఠశాలల్లో ప్రత్యేక ఫోన్ల ఏర్పాటుకు ఆదేశాలు

సాక్షి, హైదరాబాద్‌: ప్రైవేటు పాఠశాలల్లో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం కాల్‌సెంటర్‌ను అందుబాటులోకి తెచ్చేలా విద్యాశాఖ చర్యలు చేపట్టింది. ప్రభుత్వ పాఠశాలలతోపాటు ప్రైవేటు పాఠశాలల్లోని విద్యార్థులు కూడా తమ సమస్యలను అ«ధికారుల దృష్టికి తీసుకెళ్లేలా ఈ కాల్‌సెంటర్‌ సేవలను విస్తరించాలని విద్యాశాఖ నిర్ణయించింది. ఇప్పటికే ఈ సేవలను ప్రయోగాత్మకంగా కస్తూర్బాగాంధీ బాలికా విద్యాలయాల్లో (కేజీబీవీ) అందుబాటులోకి తెచ్చింది. ఈ సేవలను రాష్ట్రవ్యాప్తంగా అన్ని పాఠశాలలకు విస్తరింపజేయడం వల్ల విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను తాము తెలుసుకోవడంతోపాటు వాటిని త్వరగా పరిష్కరించేందుకు వీలు కలుగుతుందని విద్యాశాఖ అధికారులు పేర్కొంటున్నారు. ఈ మేరకు పాఠశాల విద్య డైరెక్టర్‌ విజయ్‌కుమార్‌ డీఈవోలకు ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యంగా గురుకుల పాఠశాలల్లో విద్యార్థులకు ఏ సమయంలో సమస్యలు వచ్చినా తెలియపరిచేలా ఈ సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చింది.

గురుకులాల్లోనూ ఫోన్‌ సదుపాయాన్ని కల్పించింది. పోలీసు, వైద్య సహాయం అందించేలా ఏర్పాటు చేసిన 100, 108 నంబర్లతోపాటు పాఠశాల విద్యా డైరెక్టరేట్‌కు మాత్రమే (ఈ మూడు రకాల సేవలు మాత్రమే అందించేలా) ఫోన్‌ వచ్చేలా రాష్ట్రంలోని 485 కేజీబీవీల్లో ఫ్రీ వైర్‌లెస్‌ ఫోన్‌ సెట్‌లను ఏర్పాటు చేసింది. విద్యార్థులు ఆ ఫోన్లలోని బటన్‌ను నొక్కితే అది నేరుగా పాఠశాల విద్య డైరెక్టరేట్‌లోని కాల్‌సెంటర్‌కు కనెక్ట్‌ అవుతుంది. కాల్‌సెంటర్‌ సిబ్బంది వీటిని రిసీవ్‌ చేసుకొని సమస్యలను నమోదు చేస్తారు. వాటి పరిష్కారం కోసం సంబంధిత అధికారులకు పంపిస్తున్నారు. దీంతో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలు త్వరగా పరిష్కారం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో అన్ని ప్రైవేటు పాఠశాలల్లోనూ ఆ ఫోన్లను ఏర్పాటు చేసేలా చర్యలు చేపట్టాలని పాఠశాల విద్యాశాఖ నిర్ణయించింది. దీనిపై ప్రైవేటు పాఠశాలల యాజమాన్య సంఘాలతోనూ సమావేశమై చర్చించామని, అందుకు యాజమాన్యాలు ఒప్పుకున్నాయని విద్యాశాఖ అధికారులు వెల్లడించారు.

మరిన్ని వార్తలు