వైరల్‌ : కాళ్లు మొక్కినా కనికరించలే.. 

2 Sep, 2019 10:43 IST|Sakshi

భూ సమస్యను పరిష్కరించని తహసీల్దార్‌  

నెలలుగా కార్యాలయం చుట్టూ తిరుగుతున్న బాధిత రైతులు  

రైతులు కాళ్లు మొక్కుతున్న వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌

సాక్షి, చేవెళ్ల: భూ సమస్యను పరిష్కరించాలని కలెక్టర్‌ సూచించినా, బాధిత రైతులు కాళ్లు మొక్కి ప్రాధేయపడినా ఆ తహసీల్దార్‌ కనికరించలేదు. కొన్ని నెలలుగా బాధిత రైతులను తన కార్యాలయం చుట్టూ తిప్పించుకుంటున్నారు. వారంరోజుల క్రితం రైతులు చేవెళ్ల తహసీల్దార్‌ పురుషోత్తం కాళ్లు మొక్కుతున్న వీడియో ఆదివారం ఆలస్యంగా సోషల్‌ మీడియాలో వైరల్‌ అయింది. రెవెన్యూ అధికారుల తీరుపై నెటిజన్లు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే ..

చేవెళ్ల మండలం ఆలూరు గ్రామానికి చెందిన అన్నదమ్ములు జంగిలి లింగయ్య, జంగలి సత్తయ్యల తండ్రి చిన్న మల్లయ్యకు సర్వే నెం 326లో 2 ఎకరాల 4 గుంటల భూమికి 2001లో ఓఆర్‌సీ వచి్చంది. వీరితోపాటు ఈ సర్వే నెంబర్‌లో మరో ఐదు మందికి కూడా గతంలోనే ఓఆర్‌సీలు రావడంతో సాగు చేసుకుంటున్నారు. బాధిత రైతులు లింగయ్య, సత్తకు సంబంధించిన భూమికి పాత పాస్‌పుస్తకాలు ఉన్నాయి. భూ ప్రక్షాళన సమయంలో 1బీ రికార్డు కూడా సక్రమంగానే వచి్చంది. అనంతరం కొత్త పాస్‌బుక్‌లో వీరికి 2 ఎకరాల 4 గుంటలకు బదులుగా కేవలం 1 ఎకరం భూమి మాత్రమే నమోదైంది. రైతులు అధికారుల చుట్టూ తిరుగుతున్నారు.

వీరితోపాటుగా మండలంలోని మీర్జాగూడ(ఆలూరు రెవెన్యూ)కు చెందిన పర్వేద మల్లయ్యకు సైతం ఇదే సర్వే నంబర్‌లో ఉండాల్సిన 34 గుంటల భూమికి బదులుగా కేవలం 13 గుంటలు మాత్రమే కొత్తపాస్‌బుక్‌లో నమోదైంది. పక్కపక్కన భూమి కావడంతో పాటు ఒకేసర్వే నంబర్‌ భూమి కావడంతో ముగ్గురు రైతులు రికార్డు సరిచేయించుకునేందుకు తహసీల్దార్‌ కార్యాలయం చుట్టూ దాదాపు ఏడాది నుంచి తిరుగుతున్నారు. సమస్య పరిష్కరిస్తామని వీఆర్‌ఓలు, తహసీల్దార్‌  చెప్పుకుంటూ కాలం వెల్లదీస్తున్నారు.  

కొత్త పాస్‌బుక్‌లో తక్కువ భూమి నమోదైందని చూపిస్తున్న రైతు

కలెక్టర్‌కు విన్నవించిన రైతులు  
ఇటీవల కలెక్టర్‌ లోకేష్‌కుమార్‌ చేవెళ్లలో ప్రజావాణి  నిర్వహించగా బాధితులు ఆయనకు మొరపెట్టుకున్నారు. సమస్య పరిష్కరించాలని కలెక్టర్‌ అధికారులను అదేశించారు. నెలరోజులు దాటినా అధికారులు పట్టించుకోలేదు. నెల తర్వాత రెండోసారి ప్రజావాణికి కలెక్టర్, జేసీ హజరవగా బాధితులు మరోమారు కలిశారు. కలెక్టర్‌ అర్డీఓను ఆదేశించగా ఆయన తహసీల్దార్‌ పురుషోత్తంకు సూచించారు. అయినా సమస్య పరిష్కారం కాలేదు. అనంతరం కలెక్టర్‌ ఆలూరు గ్రామంలో ప్రత్యేకంగా వారంపాటు రెవెన్యూ సదస్సును ఏర్పాటు చేసినా సమస్యను పరిష్కరించలేదు.

దీంతో బాధిత రైతులు వారం రోజుల క్రితం తహసీల్దార్‌ కార్యాలయానికి వెళ్లి తహసీల్దార్‌ పురుషోత్తం కాళ్లమీద పడి ‘మా పని చేయండి సార్‌’ అని వేడుకున్నారు. అక్కడే ఉన్న వారి గ్రామస్తులు దీనిని వీడియో తీయగా గమనించిన తహసీల్దార్‌ వారిని లోపలికి పిలిచి మూడు రోజుల్లో సమస్య పరిష్కరిస్తాను.. వీడియో మాత్రం బయటకు రానివ్వవద్దని చెప్పారు. అయితే, ఇటీవల ఆలూరుకు వచి్చన చేవెళ్ల ఎంపీ రంజిత్‌రెడ్డికి ఈ వీడియోను బాధితులు చూపించారు. దీంతో ఆయన తహసీల్దార్‌తో ఫోన్‌లో మాట్లాడి హెచ్చరించినా ఫలితం లేదు.

దీంతో గ్రామస్తులు వీడియోను సోషల్‌మీడియాలో పోస్టు చేయడంతో ఆదివారం వైరల్‌గా మారింది. తహసీల్దార్‌ తీరుపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గతంలో బాధితులు కేశంపేట తహసీల్దార్‌ కాళ్లు మొక్కిన వీడియో బయటకు వచ్చింది.  అనంతరం ఆమె ఏసీబీ అధికారులకు పట్టుబడింది. ఉద్దేశపూర్వకంగా రెవెన్యూ అ«ధికారులు తమ సమస్యను పరిష్కరించడం లేదని బాధితులు ఆరోపించారు. కలెక్టర్‌ చెప్పినా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తమవద్ద కట్‌ అయిన ఎకరం 25 గుంటల భూమి ఆన్‌లైన్‌లో మరో వ్యక్తి పేరుమీద కనిపిస్తుందని రైతులు తెలిపారు.  
 

ఇలాంటి తహసీల్దార్‌ను ఎక్కడా చూడలేదు 
బాధిత రైతులు లింగమయ్య, సత్యయ్య, పర్వేద మల్లయ్య తమ సమస్యను కలెక్టర్‌ దృష్టికి తీసుకెళ్లడంతో సరిచేయాలని తహసీల్దార్‌ను అదేశించినా ఆయన పనిచేయడం లేదు. ఉన్నతాధికారులు సూచించిన తర్వాత కూడా మళ్లీ నాకు ఫైల్‌ పంపించి ఓఆర్‌సీ సరైనదా కాదా చెప్పాలని పంపాడు. పలు సమస్యల్లో కూడా ఆయన తీరు ఇలాగే ఉంది. గతంలో బాధిత రైతుల రికార్డులు ఎందుకు మారాయనే విషయం తహసీల్దార్‌ పరిశీలించాలి. అది వదిలేసి ఓఆర్‌సీలు సరైనవా కాదా అని తహసీల్దార్‌ ఫైల్‌ తిరిగి నాకు పంపుతున్నాడు. ఇలాంటి తహసీల్దార్‌ను నేను ఎక్కడా చూడలేదు. మంగళవారం కలెక్టర్‌ చేవెళ్లకు వస్తున్నారు. అక్కడే ఈ సమస్యను పరిష్కరిస్తాం.. రైతులు కూడా రావాలని సూచించాను.    
– హన్మంత్‌రెడ్డి, ఆర్డీఓ చేవెళ్ల 

ఆర్డీఓకు ఫైల్‌ పంపాను   
బాధిత రైతులు కావాలనే కాళ్లు మొక్కి వీడియో తీయించి ప్రచారం చేస్తున్నారు. సంబంధిత ఓఆర్‌సీ ముందుగానే వచి్చంది. అ తరువాత అదే గ్రామానికి చెందిన మరో రైతుకు కూడా ఓఆర్‌సీ ఇవ్వడంతో వారి భూమి కొత్త పాస్‌ పుస్తకంలో రాలేదు. ఈవిషయాన్ని నేను పరిశీలించగా బాధిత రైతుల వైపే న్యాయం ఉంది. అయితే, ఓఆర్‌సీని రద్దు చేసే అధికారం నాకు లేదు. ఓఆర్‌సీలను పరిశీలించాలని అర్డీఓకు ఫైల్‌ పంపాను. అనంతరం ఆర్డీఓ సూచన మేరకు చర్యలు తీసుకుంటాను. ఇందులో నా తప్పిదం ఏమి లేదు.   
– పురుషోత్తం, తహసీల్దార్, చేవెళ్ల 

మరిన్ని వార్తలు