వెంటాడుతున్న నగదు కొరత

28 Nov, 2018 08:25 IST|Sakshi

మోర్తాడ్‌(బాల్కొండ): పెద్ద నోట్ల రద్దు తరువాత ఏర్పడిన నగదు కొరత ఇంకా ప్రజలను వెంటాడుతూనే ఉంది. రూ.1000, రూ.500ల నోట్లు రద్దు అయ్యి రెండేళ్లు గడచినా బ్యాంకుల్లో ఖాతాదారులకు సరిపడేంత నగదు దొరకక ఇబ్బందులు కలుగుతున్నాయి. మధ్యమధ్యలో నగదు కొరత తీరినట్లు అనిపించినా నగదు కొరత ప్రభావం సామాన్యులను వెంటాడుతుండటంతో ప్రజలు సతమతం అవుతున్నారు. పక్షం రోజుల నుంచి బ్యాంకుల్లో నగదు నిలువలు తగ్గిపోవడంతో ఖాతాదారులకు పరిమితంగానే నగదు విత్‌డ్రాకు బ్యాంకర్లు అనుమతి ఇస్తున్నారు. ఆన్‌లైన్‌ లావాదేవీలు నిర్వహించుకోవాలని బ్యాంకర్లు సూచిస్తున్నా అవగాహన లేమితో ఆన్‌లైన్‌ లావాదేవీలు నామమాత్రంగానే సాగుతున్నాయి.

గతంలో బ్యాంకుల్లో ఒక్కో ఖాతాదారుకు రోజుకు రూ.40వేల వరకు నగదు అందించిన బ్యాంకర్లు ఇప్పుడు రూ.10వేలకు మించి ఇవ్వడం లేదు. జిల్లాలో సహకార, వాణిజ్య, ప్రైవేటు బ్యాంకుల శాఖలు 268 వరకు ఉన్నాయి. గతంలో వివిధ బ్యాంకుల శాఖలకు ప్రధాన బ్రాంచీల నుంచి నుంచి నగదు సరఫరా అయ్యేది. అలా సరఫరా అయిన నగదును ఖాతాదారులకు బ్యాంకర్లు అందించేవారు. అయితే కొన్నిరోజుల నుంచి బ్యాంకు శాఖలకు నగదు సరఫరా కావడం లేదు. వివిధ బ్యాంకుల పరిధిలోని విద్యుత్, టెలికం, గ్రామ పంచాయతీలు, పెట్రోల్‌ బంక్‌లు, మద్యం దుకాణాలు, ఇతర వ్యాపారులు బ్యాంకుల్లో నగదును జమచేస్తేనే ఆ నగదును ఖాతాదారులకు బ్యాంకర్లు అందించే పరిస్థితి ఏర్పడింది. పెట్రోల్‌ బంక్‌లలో ఎక్కువ మంది స్వైపింగ్‌ మిషన్‌ ద్వారానే పెట్రోల్, డీజిల్‌ కొనుగోలు చేస్తుండటంతో నగదు తగ్గిపోయింది.

కొంతమంది ఖాతాదారులు బ్యాంకుల నుంచి నగదును విత్‌డ్రా చేసుకోవడమే తప్ప బ్యాంకుల్లో నగదును జమచేయకపోవడంతో నగదుకు కొరత ఏర్పడటానికి కారణం అయ్యింది. ఇది ఇలా ఉండగా కొన్ని నెలల నుంచి బ్యాంకుల్లో రూ.2వేల నోటు కనిపించడం లేదు. ఎన్నికల కారణంగా పోటీలో ఉన్న అభ్యర్థులు ఎన్నికల ఖర్చు కోసం పెద్ద మొత్తంలో నగదును బ్లాక్‌ చేయడం వల్లనే నగదు కొరత ఏర్పడటానికి కారణం అయ్యిందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. బ్యాంకుల్లో నగదును జమ చేస్తే మళ్లీ నగదు తమ చేతికి లభించదనే ఉద్దేశంతో అనేక మంది నగదును ఇండ్లలోనే దాచుకుంటుండటంతో నగదు కొరత తీవ్రం అయ్యిందని కూడా తెలుస్తుంది. ఇప్పటికైనా ప్రభుత్వం, బ్యాంకర్లు స్పందించి నగదు కొరత తీర్చడంతో పాటు ఆన్‌లైన్‌ లావాదేవీలపై ఖాతాదారులకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

నగదు కొరత తీర్చాలి 
బ్యాంకుల్లో ఖాతాదారులకు సరిపడేంత నగదు ఇవ్వకపోవడంతో వ్యవసాయ పనులు సాగడం లేదు. నగదు కొరతను తీర్చాల్సిన అవసరం ఉంది. పెద్ద నోట్లు ఇవ్వకపోయినా చిన్న నోట్లనైనా ఖాతాదారులకు అందించాలి. నగదు కొరతను తీర్చాలి. సల్ల రాజేశ్వర్, రైతు, తొర్తి

కూలి ఇవ్వాలంటే దొరకడం లేదు 
వ్యవసాయ పనులకు వచ్చే కూలీలకు నగదు రూపంలోనే కూలి ఇవ్వాల్సి ఉంది. అయితే నగదు కొరత వల్ల కూలీలకు కూలి ఇవ్వాలంటే ఇబ్బందిగా ఉంది. నగదు కోసం బ్యాంకుల చుట్టూ తిరుగతూ పని నష్టపోతున్నాం. ప్రభుత్వం స్పందించి నగదు కొరతను తీర్చాలి. కౌడ పెద్ద భూమేశ్వర్, రైతు, తొర్తి 

మరిన్ని వార్తలు