ఐఏఎస్‌ దాస్‌పై సీబీఐ కేసు కొట్టివేత

5 Feb, 2019 01:00 IST|Sakshi

తీర్పు వెలువరించిన హైకోర్టు

సాక్షి, హైదరాబాద్‌: వై.ఎస్‌.జగన్‌ కంపెనీల్లో పెట్టుబడుల వ్యవహారంలో సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి ఆదిత్యనాథ్‌ దాస్‌పై సీబీఐ నమోదు చేసిన కేసును హైకోర్టు కొట్టేసింది. ఇప్పటికే దాస్‌పై అవినీతి నిరోధక చట్టం కింద నమోదైన కేసును కొట్టేసిన హైకోర్టు... తాజాగా ఐపీసీ సెక్షన్‌ కింద నమోదైన కేసును కూడా కొట్టేసింది. ఆదిత్యనాథ్‌ దాస్‌ ప్రాసిక్యూషన్‌కు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుమతి నిరాకరించిన నేపథ్యంలో ఆయనపై కేసును కొట్టేస్తున్నట్లు హైకోర్టు స్పష్టం చేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్‌ బి. శివశంకరరావు సోమవారం తీర్పు వెలువరించారు. దాస్‌పై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) నమోదు చేసిన కేసును హైకోర్టు ఇటీవల కొట్టేసిన సంగతి తెలిసిందే. ఇండియా సిమెంట్స్‌కు నీటి కేటాయింపుల్లో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ సీబీఐ దాస్‌పై కేసు నమోదు చేసింది. ఐపీసీ కింద సీబీఐ నమోదు చేసిన కేసులను కొట్టేయాలని కోరుతూ ఆదిత్యనాథ్‌దాస్‌ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై న్యాయమూర్తి జస్టిస్‌ బి. శివశంకరరావు విచారణ జరిపారు. పిటిషనర్‌ తరఫున సీనియర్‌ న్యాయవాది టి. నిరంజన్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ దాస్‌ ప్రాసిక్యూషన్‌కు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుమతినివ్వలేదని తెలిపారు.

అంతేగాక నీటి కేటాయింపులు సక్ర మమే నంటూ అప్పటి నీటిపారుదలశాఖ మంత్రి పొన్నాల లక్ష్మయ్య సుప్రీంకోర్టులో అఫిడవిట్‌ దాఖలు చేశారన్నారు. అక్రమాలు జరిగాయన్న సీబీఐ... అందుకు ఏ ఒక్క ఆధారాన్ని కూడా చూపలేకపోయిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను పిటిషనర్‌ అమలు చేశారే తప్ప ఆ నిర్ణయాలను పిటిషనర్‌ తీసుకోలేదని వివరించారు. పిటిషనర్‌ ఎటువంటి ఆర్థిక ప్రయోజనాలు పొందలేదని, ఈ విషయాన్ని సీబీఐ కూడా విభేదించడం లేదన్నారు. ఈ వాదనలతో ఏకీభవించిన న్యాయమూర్తి... దాస్‌ ప్రాసిక్యూషన్‌కు అనుమతి తీసుకోకుండానే సీబీఐ దాఖలు చేసిన చార్జిషీట్‌ను విచారణ నిమిత్తం సీబీఐ ప్రత్యేక కోర్టు పరిగణనలోకి తీసుకోవడాన్ని తన తీర్పులో తప్పుబట్టారు. నీటి కేటాయింపులు, పెట్టుబడులు పెట్టిన తేదీల ఆధారంగా పిటిషనర్‌ తప్పు చేశారన్న నిర్ణయానికి రావడం ఎంతమాత్రం సరికాదంటూ దాస్‌పై ఐపీసీ కింద సీబీఐ నమోదు చేసిన కేసును కొట్టేశారు.   

>
మరిన్ని వార్తలు