యాభై ఎకరాలు దాటితే రైతుబంధు నిలిపివేత

28 Nov, 2018 03:42 IST|Sakshi

     రబీలో సీలింగ్‌ చట్టాన్ని అమలుచేస్తున్న వ్యవసాయశాఖ

      ఇప్పటివరకు 43 లక్షల మంది రైతులకు రూ. 4,581 కోట్లు బదిలీ

సాక్షి, హైదరాబాద్‌: ఖరీఫ్‌లో వ్యవసాయ భూమి ఎంతున్నా పెట్టుబడి సొమ్ము అందజేసిన వ్యవసాయ శాఖ, రబీలో సీలింగ్‌ అమలు చేస్తుండటం సంచలనం రేపుతోంది. ప్రభుత్వం నుంచి వచ్చిన అనుమతి మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారా లేక స్వతహాగా అమలు చేస్తున్నారా అన్నది తెలియడం లేదు. సీలింగ్‌పై సర్కారు ఎలాంటి మార్గదర్శకాలు జారీ చేయకున్నా అంతర్గతంగా నిర్ణయం తీసుకొని అమలు చేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. తక్షణం పేద, మధ్యతరగతి రైతులకు ముందు ఇచ్చి మిగిలిన వారికి తర్వాత ఇవ్వాలని అనుకుంటున్నామని, 50 ఎకరాలకు మించి రైతులకు లక్షలకు లక్షలు ఒకేసారి ఇచ్చే బదులు, ఆ సొమ్మును ఇతర రైతులకు ఇవ్వాలని భావిస్తున్నామని వ్యవసాయ శాఖ వర్గాలు అంటున్నాయి. సీలింగ్‌ చట్టం ప్రకారం 56 ఎకరాలకు మించి ఎవరికీ వ్యవసాయ భూమి ఉండకూడదనీ, అలా ఉన్న వారికి రైతుబంధు సొమ్ము ఇస్తే ఎన్నికల సమయంలో సమస్య వస్తుందన్న భావనతో ఇలా చేస్తున్నామని మరికొందరు అధికారులు అంటున్నారు. ఖరీఫ్‌లో వంద ఎకరాలకు మించి ఉన్న వారికీ పథకం అమలు చేసిన సంగతి విదితమే. 

ఖాతాలున్న వారందరికీ పంపిణీ పూర్తి... 
ఖరీఫ్‌లో గ్రామసభల్లో రైతులకు పెట్టుబడి చెక్కులను పంపిణీ చేసిన సర్కారు, ఎన్నికల కమిషన్‌ ఆదేశంతో రబీలో రైతుల బ్యాంకు ఖాతాల్లోకి పెట్టుబడి సొమ్మును బదిలీ చేస్తున్న సంగతి తెలిసిందే. పెట్టుబడి నిధుల మంజూరు కోసం ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 43 లక్షల మంది రైతుల బ్యాంకు ఖాతాలను సేకరించగా, వాటన్నిటికీ కలిపి రూ. 4,581 కోట్లు పెట్టుబడి సొమ్ము బదిలీ చేసినట్లు వ్యవసాయ వర్గాలు తెలిపాయి. ఇంకా ఏడు లక్షల మంది ఖాతాలను సేకరించాల్సి ఉందని, వాటిని ఎన్నికల లోపుగానే సేకరించి సొమ్ము బదిలీ చేస్తామని అంటున్నారు. ఖరీఫ్‌లో దాదాపు 52 లక్షల మంది రైతులకు ఈ మొత్తం అందింది. రబీలో 50 లక్షల మంది వరకే ఉంటారంటున్నారు. వీటిలో ఎన్‌ఆర్‌ఐ ఖాతాలుండటం, కొందరు చనిపోవడం వల్ల ఈసారి తగ్గిందంటున్నారు.  

‘గివ్‌ ఇట్‌ అప్‌’కు స్పందనేది?  
ధనిక రైతులు ఎవరైనా పెట్టుబడి సొమ్ము వద్దనుకుంటే తిరిగి ఇచ్చేయాలని ప్రభుత్వం గతంలో స్వచ్ఛంద ‘గివ్‌ ఇట్‌ అప్‌’కార్యక్రమాన్ని చేపట్టిన సంగతి తెలిసిందే. దీనికి ఖరీఫ్‌లో సీఎం సహా కొందరు మంత్రులు, ఎమ్మెల్యేలు తమ సమ్మతి ఇచ్చారు. ఒకరిద్దరు సీనియర్‌ ఐఏఎస్‌లు వీరిలో ఉన్నారు. ఇప్పుడు రబీలో ఎవరూ ముందుకు రావడంలేదని వ్యవసాయాధికారులు చెబుతున్నారు. ఎన్నికల సీజన్‌ కారణంగా నేతలు, ధనిక రైతులు, ప్రజాప్రతినిధులు ఎవరూ ‘గివ్‌ ఇట్‌ అప్‌’కు స్పందించడంలేదని చెబుతున్నారు. మరో వైపు సీలింగ్‌ దాటి భూములున్న ఐఏఎస్, ఐపీఎస్‌ వంటి ఉన్నతాధికారులు తమ ఔదార్యాన్ని చాటుకోక పోగా రైతుబంధు సొమ్ము ఇంకా తమ బ్యాంకులో ఎందుకు జమ కాలేదంటూ వ్యవసాయశాఖకు ఫోన్ల మీద ఫోన్లు చేస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో కిందిస్థాయి అధికారులు ముక్కున వేలేసుకుంటున్నారు. 

మరిన్ని వార్తలు