తులసితో కేన్సర్‌కు చెక్‌

7 Jul, 2018 14:10 IST|Sakshi
 పరిశోధన చేస్తున్న పీహెచ్‌డీ స్కాలర్లు మాధురి, చంద్రసాయి 

నిట్‌ విద్యార్థులచే  యాంటీ కేన్సర్‌ డ్రగ్‌ రూపకల్పన

సహజ సిద్ధమైన ఔషధం

తక్కువ ధరలో  అందుబాటులోకి..

సైడ్‌ ఎఫెక్ట్స్‌ కూడా తక్కువే..

నాలుగు సంవత్సరాల  కష్టానికి ఫలితం

పేటెంట్‌ సాధించుకున్న నిట్‌

కాజీపేట అర్బన్‌: నిట్‌.. ఈ పేరు వింటే ముందుగా గుర్తుకు వచ్చేది పరిశోధనలకు కేంద్రబిందువు అని. ఎన్నో ఆలోచనలు, ఆశలతో కళాశాలలో విద్యార్థులు అడుగు మోపుతారు. వారి కలలను సాకారం చేసుకోవడానికి నిట్‌ ఒక చక్కటి వేదిక.  దీనిలో భాగంగానే  ప్రాణాంతకమైన కేన్సర్‌ వ్యాధికి తలసి ఆకులతో మందును కనుగొన్నారు. కేన్సర్‌ వ్యాధి నివారణకు బాధితులు అనేక కంపెనీలకు చెందిన మందులను వాడుతున్నారు.

అయితే చాలా మంది కేన్సర్‌ వ్యాధిగ్రస్తులు సైడ్‌ ఎఫెక్ట్స్‌ ద్వారా మరణిస్తున్నారని పలు పరిశోధనల్లో వెల్లడైంది. కాగా ఎలాంటి సైడ్‌ ఎఫెక్ట్స్‌ లేకుండా, తక్కువ ధరలో సహజ సిద్ధంగా యాంటీకేన్సర్‌ మందును తయారు చేశారు నిట్‌ విద్యార్థులు.  డ్రగ్‌తో పాటు ఆహారంతో వచ్చే కేన్సర్‌ను రూపుమాపడానికి జౌషధాన్ని కనుగొన్నారు.సర్వ రోగ నివారిణి..తులసిని శాస్త్రీయంగా  ఆసీమం టెన్యూఫ్లోరం అని పిలుస్తారు.

తులసికి అనేక ఔషధ గుణాలు ఉన్నట్లు నిర్ధారించి వివిధ రకాల మందుల తయారీలో వాడుతున్నారు. జలుబు, దగ్గు, చర్మ సమస్యలు, శ్వాస, జీర్ణ సంబంధిత వ్యాధులను తులసితో నివారించవచ్చు. ప్రతి రోజు ఉదయం స్నానం చేయగానే తులసి చెట్టు చుట్టు ప్రదక్షిణలు చేస్తే శుభం కలుగుతుందనే నానుడి ఉంది.  కాగా మనిషి పుట్టుక  మొదలుకుని చివరి శ్వాస విడిచే సమయంలో సైతం తులసి నీరు అందించడం భారతీయుల అనవాయితీ.  

తులసి ఆకుల రసంతో.. తులసి ఆకుల రసంతో యాంటీ కేన్సర్‌ డ్రగ్‌కు రూపకల్పన చేశారు. నిట్‌ బయోటెక్నాలజీ విభాగ ప్రొఫెసర్‌ సతీష్‌బాబు పర్యవేక్షణలో పీహెచ్‌డీ స్కాలర్స్‌ చంద్రసాయి, మాధురి పరిశోధన చేపట్టారు. విభిన్న ఔషధ గుణాలు కలిగిన తులసి ఆకులు లక్షలాది సూక్ష్మజీవులకు నిలయంగా ఉండగా 40రకాల సూక్ష్మజీవు(బ్యాక్టీరియా)లపై 2014లో పరిశోధనలు ప్రారంభించారు.

తొలుత తులసి ఆకురసంతో బ్యాసిల్లస్‌ స్టాటోస్పెరికస్‌ ఔషధ గుణాన్ని కనుగొన్నారు. సూక్ష్మజీవులకు న్యూట్రియెంట్‌ అగార్‌ అనే మిడియా(ఫుడ్‌)ను అందించి వివిధ రకాల ప్రయోగాల అనంతరం ఎల్‌-ఆస్పిరెన్, ఎల్‌-గ్లుటామిజెన్‌ అనే ఎంజైమ్‌లను కనుగొన్నారు. వివిధ దశల్లో ఎంజైమ్‌లను అభివృద్ధి చేసి అక్యూట్‌ లింపోసిటిక్‌ లుకేమియా అనే కేన్సర్‌ను(బ్లడ్‌ కేన్సర్‌) నివారించే ఔషధం(యాంటీ కేన్సర్‌ డ్రగ్‌)ను ఆవిష్కరించారు.

నాలుగు సంవత్సరాల పరిశోధనల అనంతరం వారి కల ఫలించింది.  త్వరలో వివిధ ప్రాణుల మీద ప్రయోగం చేసి మానవాళిని కేన్సర్‌ వ్యాధి బారినుంచి కాపాడే ఔషధాన్ని అందించనున్నారు.

నిట్‌ ఖాతాలో మరో పేటెంట్‌...

 నిట్‌  ఖాతాలో మరో పేటెంట్‌ చేరే అవకాశం ఉంది. ఇటీవల మెకానికల్‌ విభాగంలో రిటైర్డ్‌ ప్రొఫెసర్‌ రాపూర్‌ వెంకటాచలం రూపొందించిన పర్‌ఫెక్ట్‌ స్టీరింగ్‌ మెకానిజం పేటెంట్‌ సాధించింది. బయోటెక్నాలజీ విభాగానికి చెందిన సతీష్‌బాబు, పీహెచ్‌డీ స్కాలర్లు  తులసి ఆకుల రసంతో రూపొందించిన యాంటీ కేన్సర్‌ మందునుసైతం పేటెంట్‌ అనుమతులకు పంపించారు.

మరిన్ని వార్తలు