తెగని ఉత్కంఠ.. ప్రత్యర్థులెవరో!

17 Mar, 2019 15:40 IST|Sakshi

ముచ్చటగా మూడోసారి ఎంపీ బరిలో బలరాంనాయక్‌

ఇప్పుడు అందరిచూపు టీఆర్‌ఎస్‌ అభ్యర్థి వైపే

నేడు తేలనున్న బీజేపీ ఎంపీ అభ్యర్థి

సాక్షి, మహబూబాబాద్‌: కాంగ్రెస్‌ పార్టీ తరుపున ఎంపీగా బలరాంనాయక్‌ పేరు ఖరారు కావడంతో అందరి చూపు టీఆర్‌ఎస్, బీజేపీ అభ్యర్థులెవరనేదానిపై జోరుగా చర్చలు కొనసాగుతున్నాయి. శాసనసభ ఎన్నికల సమయంలో అభ్యర్థుల ఎంపిక ఆలస్యం కావటంతో ప్రతికూల ఫలితాలు వచ్చాయనే భావనతో ఉన్న అధిష్టానం లోక్‌సభ అభ్యర్థుల ఎంపికలో దాన్ని పునరావృతం చేయకూడదని భావించింది. రాష్ట్రంలోని 17 ఎంపీ స్థానాల్లో  ఎనిమిది మంది అభ్యర్థులతో  తొలి జాబితాను ప్రకటించింది. 

అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థులను ముందే ప్రకటించగా, ఈసారి కాంగ్రెస్‌ పార్టీ ముందే అభ్యర్థులను ప్రకటించింది. మాజీ కేంద్రమంత్రి పోరిక బలరాంనాయక్‌ను మానుకోట కాంగ్రెస్‌ అభ్యర్థిగా ప్రకటించింది. దీంతో ముచ్చటగా మూడోసారి ఎంపీ ఎన్నికల బరిలో బలరాంనాయక్‌ పోటీచేయనున్నారు. కాంగ్రెస్‌ పార్టీ లోక్‌సభ ఎన్నికలకు ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ అధ్యక్షతన సోనియా గాంధీ నివాసంలో శుక్రవారం రాత్రి కేంద్ర ఎన్నికల కమిటీ (సీఈసీ) సమావేశమై అభ్యర్థులను ఖరారు చేసింది.

44 మంది దరఖాస్తు
లోక్‌సభలో గెలుపే లక్ష్యంగా, రాష్ట్రంలో శాసన సభ్యులు వరుసగా పార్టీని వీడుతున్న నేపథ్యంలో బలమైన అభ్యర్థులనే బరిలోకి దింపాలని పార్టీ నేతలు నిర్ణయించారు. ఈ క్రమంలో డీసీసీ, పీసీసీ స్థాయిల్లో ఆశావహుల నుంచి దరఖాస్తులు స్వీకరిచింది. మానుకోట ఎంపీ స్థానానికి రాష్ట్రంలోనే అత్యధికంగా 44 దరఖాస్తులు వచ్చాయి. దీంతో కాంగ్రెస్‌ అభ్యర్థి ఎవరనేదానిపై కాంగ్రెస్‌ శ్రేణులతో పాటు, విపక్ష పార్టీలు సైతం దృష్టిసారించాయి. రాష్ట్ర స్థాయిలో వడపోత పూర్తి చేసి మూడు రోజుల క్రితం ఏఐసీసీ స్థాయిలో స్క్రీనింగ్‌ కమిటీలో ఒక్కో నియోజకవర్గానికి రెండు, మూడు పేర్లతో జాబితా తయారు చేశారు. ఆ జాబితాపై సీఈసీలో చర్చించి తొలి జాబితాను ఖరారు చేశారు. గతంలో కేంద్రమంత్రిగా పనిచేసిన అనుభవం, పార్లమెంట్‌ పరిధిలోని కాంగ్రెస్‌ శ్రేణులతో ఉన్న అనుబంధం ఉండటంతో బలరాంనాయక్‌ వైపు అధిష్టానం మొగ్గుచూపినట్లు తెలిసింది.

ముగ్గురిలో ఎవరికో..
కాంగ్రెస్‌ అభ్యర్థి తేలడంతో పాటు, రేపు ఎన్నికల షెడ్యూల్‌ విడుదల కానుండటంతో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి ఎవరనే దానిపై జిల్లాలో జోరుగా రాజకీయ చర్చ కొనసాగుతోంది. కేసీఆర్‌ ఈ సారి ఇద్దరూ ముగ్గురు సిట్టింగ్‌లకు సీట్లు ఇవ్వలేమని ఇప్పటికే ప్రకటించారు. దీంతో ప్రస్తుత ఎంపీ సీతారాంనాయక్‌కు టికెట్‌ రాకపోవచ్చనే ఊహగానాలు టీఆర్‌ఎస్‌ శ్రేణుల్లో ఉన్నాయి.  మరో వైపు మాజీ ఎమ్మెల్యే మాలోతు కవిత, ఢిల్లీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాంచంద్రునాయక్‌లు టికెట్‌ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. 

నేడు తేలనున్న బీజేపీ అభ్యర్థి
లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయనున్న అభ్యర్థుల జాబితాను నేడు బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ ప్రకటించనుంది. టీఆర్‌ఎస్, కాంగ్రెస్‌ అభ్యర్థులకు ధీటుగా రాజకీయంగా, ఆర్థికంగా బలమైన అభ్యర్థులను పరిశీలిస్తోంది. మానుకోట స్థానం నుంచి జాటోతు హుస్సేన్‌నాయక్, యాప సీతయ్య, చందా లింగయ్య దొరల పేర్లను పరీశీలిస్తున్నారు.

మరిన్ని వార్తలు