మహిళా సంఘాల కరుణ ఎవరిపైనో..!

26 Nov, 2018 15:17 IST|Sakshi
మహిళా సంఘాల సభ్యులు 

జయాపజయాలపై ప్రభావం చూపనున్న ఎస్‌హెచ్‌జీలు

నియోజకవర్గంలో మొత్తం 40 వేల మంది సభ్యులు 

నెన్నెల(బెల్లంపల్లి): ముందస్తు ఎన్నికల్లో స్వయం సహాయక మహిళా సంఘాల సభ్యులు ప్రభావం చూపే అవకాశం కనిపిస్తోంది. బెల్లంపల్లి నియోజకవర్గంలో 40 వేల మంది మహిళా ఓటర్లు ఉన్నా రు. బెల్లంపల్లి గ్రామీణ ప్రాంతాల్లో 5,870 మంది ఉన్నారు. భీమినిలో 3,234, కన్నెపల్లిలో 4,117, కాసిపేటలో 6,846, తాండూర్‌లో 6,579, వేమనపల్లిలో 4,227, బెల్లంపల్లి మున్సిపాలిటీలో 9,096 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. వారి ఓట్లకు గాలం వేసేందుకు అన్ని పార్టీలు వ్యూహ ప్రతి వ్యూహాలతో ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే గ్రామాల వారీగా పార్టీల నాయకులు దృష్టి సారించారు. అభ్యర్థులు నేరుగా కాకుండా ఆయా ప్రాంతాల్లోని క్షేత్ర స్థాయి నేతలతో మాట్లాడిస్తున్నారు. వారికి ఉన్న ఇబ్బందులను తెలుసుకుంటున్నారు. మహిళా సంఘాలకు పార్టీల ఎన్నికల ప్రణాళికలో పేర్కొన్న అంశాలపై కాకుండా స్థాని కంగా ఏం అవసరమో గుర్తించి నివారించే ప్రయత్నాలు చేస్తున్నారు. గ్రామ స్థాయిలో మహిళా భవనాలు, వాటిలో సౌకర్యాలతోపాటు తమకు అనుకూలంగా ఓటేసేందుకు ఏం కావాలో అడుగుతున్నారు.
ఈ విషయంలో గ్రామ, మండల స్థాయి సంఘాల నాయకులతో మంతనాలు చేస్తున్నారు. అభ్యర్థులు మహిళా సంఘాల సభ్యులను సంప్రదింపులు చేస్తున్నారనే సమాచారం ఉంది. మహిళా సంఘాలను మచ్చిక చేసుకొని తమ వైపు ఓట్లు వేసుకునేలా ఎవరికి వారే ప్రయత్నాలు చేస్తున్నారు. మహిళా సంఘాల సభ్యులకు ఏం కావాలనే విషయంలో ఆచి తూచి వ్యవహరిస్తున్నారు. వీఓలు, మండల సమాఖ్యలను సంప్రదించి ఓట్లు తమకు వేసి గెలిపించాలని అభ్యర్థిస్తున్నారు. సంఘాలకు డబ్బులు ఇచ్చే ప్రణాళికలు సైతం నాయకులు తయారు చేసుకున్నట్లు సమాచారం. సంఘాలకు డబ్బులు ఇస్తే గంపగుత్తగా ఓట్లన్ని ఒకే వైపు పడే అవకాశం ఉన్నాయని డబ్బులు ఇవ్వడానికి అభ్యర్థులు రహస్యంగా మంతనాలు చేస్తున్నట్లు తెలిసింది. అభ్యర్థుల భవిష్యత్‌ను తేల్చేంత శక్తి మహిళా సంఘాలకు ఉందని చెప్పకనే చెబుతున్నారు. మొత్తం నియోజకవర్గంలో 1,49,688 ఓట్లు ఉండగా, ఒక బెల్లంపల్లి మండలంలోనే 55,077 ఓట్లు ఉన్నాయి. దీంతోపాటు మహిళా సంఘాల ఓట్లు 40 వేలు ఉన్నాయి. వీటిపై ప్రత్యేక శ్రద్ధ చూపి ఈ ఓట్లకు ఎలాగైనా గాలం వేయాలని అభ్యర్థులు లెక్కలు వేసుకుంటున్నారు. ఈ ఓట్లు ఎవరికి పోల్‌ అయితే వారి గెలుపు ఖాయమని విశ్లేషకులు భావిస్తున్నారు. 

మరిన్ని వార్తలు