సామాజిక మాధ్యమాల జోరు 

1 Dec, 2018 17:04 IST|Sakshi
సామాజిక మాధ్యమాల్లో వస్తున్న రాజకీయ నాయకుల కార్టున్‌ చిత్రాలు   

నెన్నెల: సామాజిక మాధ్యమాలు ఎన్నికల యుద్దానికి వేదికగా మారుతున్నాయి. ఒకప్పుడు గల్లీ లొల్లిలతో సాగిన రాజకీయ పోరు ఇప్పుడు సామాజిక మాధ్యమాల సందేశాలతో కొత్త రూపును సంతరించుకుంది. వాట్సఫ్, ఫేస్‌బుక్, ట్విట్టర్‌ ఎన్నికల ప్రచారానికి వేదికగా నిలుస్తున్నాయి. ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో వివిధ పార్టీలకు చెందిన అభిమానులు పంపుతున్న సందేశాలు కొన్ని సందర్భాల్లో శృతి మించుతున్నాయి. రంగంలో ఉన్న అసలు అభ్యర్థులకన్న మిన్నగా సామాజిక మాధ్యమాల్లో ఎన్నికల పోరు జోరందుకుంది. ఎన్నికల అధికారులు వీరిపై నిఘా వేసి ఉంచారన్న సంగతి సైతం మర్చి తమ అభ్యర్థుల గెలుపే ధ్యేయంగా అభిమానులు, అనుచరులు సామాజిక మాధ్యమాల్లో ప్రచారపర్వం వేగం పెంచారు.  
మిక్సింగ్‌ వీడియోల్లో విసుర్లు.. 
గతంలో పోల్చితే ఈసారి ఎన్నికల్లో సామాజిక మాధ్యమాల్లో ఒక పార్టీపై మరో పార్టీ వారు చేస్తున్న ఆరోపణలు మిక్సీంగ్‌ వీడియోలు, కార్టూన్‌ బొమ్మలు ఎక్కువగా కనబడుతున్నాయి. సినిమాలోని సన్నివేశాల్లోని హీరోలు విలన్‌లకు తమకు నచ్చిన నేతల ముఖాలకు మార్ఫింగ్‌ చేసి  తమ నేతల ముఖాలను పెడుతున్నారు. నేతలు ఇదివరకు ఏం చెప్పారు ఇప్పుడు ఏం మాట్లాడుతున్నారన్న అంశాలను కళ్లకు కట్టేలా వీ డియోలను మిక్సింగ్‌ చేసి మరీ సామాజిక మాధ్యమాల ద్వారా అందరికీ చేరవేస్తున్నారు. మొత్తం మీద నేతలు మాట దొర్లి పొరపాటున మాట్లాడినా ప్రత్యర్థులు వాటిని అందిపుచ్చుకొని సామాజిక మాధ్యమాల్లో విచ్చలవిడిగా ప్రచారం చేస్తూ, తమకు అనుకూలంగా మలుచుకునేందుకు తంటాలు పడుతున్నారు.  

మరిన్ని వార్తలు