అభ్యర్థులు వారే.. కూటములే మారాయి

26 Nov, 2018 12:47 IST|Sakshi
పాయం వెంకటేశ్వర్లు, రేగా కాంతారావు

సాక్షి, బూర్గంపాడు: పినపాక నియోజకవర్గం ఎన్నికల ముఖచిత్రం రివర్సయింది. 2009లో మహాకూటమి అభ్యర్థిగా సీపీఐ నుంచి పాయం వెంకటేశ్వర్లు బరిలో నిలిచారు. పోటీగా కాంగ్రెస్‌ నుంచి రేగా కాంతారావు బరిలో దిగి విజయం సాధించారు.  ప్రస్తుత ఎన్నికల్లో ప్రజాకూటమి అభ్యర్థిగా రేగా కాంతారావు బరిలో నిలిచారు. ఆయనకు ప్రత్యర్థిగా అధికార టీఆర్‌ఎస్‌ నుంచి పాయం వెంకటేశ్వర్లు పోటీలో ఉన్నారు. వీరిద్దరూ రెండోసారి తలపడుతున్నారు.   

2009
2009లో అప్పటి అధికార కాంగ్రెస్‌ పార్టీని ఓడించేందుకు టీడీపీ, టీఆర్‌ఎస్, సీపీఐ, సీపీఎంలు మహాకూటమిగా జట్టు కట్టాయి. నాటి ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి సారథ్యంలో కాం గ్రెస్‌ ఒంటరిగా పోటీలో నిలిచింది. ఆ ఎన్నికల్లో గెలిచిన, ఓడిన పూర్తి బాధ్యత తనదేనని వైఎస్‌ ప్రకటించారు. 2009లో నియోజకవర్గాల పునర్విజనలో భాగంగా బూర్గంపాడు నియోజవర్గాన్ని రద్దుపరిచి కొత్తగా పినపాక నియోజకవర్గాన్ని ఏర్పాటు చేశారు. 2009లో అనూహ్య పరిస్థితుల మధ్య కాంగ్రెస్‌ టిక్కెట్‌ దక్కించుకున్న రేగా కాం తారావు మహాకూటమి అభ్యర్థి పాయంపై 350 పైచిలుకు ఓట్లతో విజయం సాధించారు. కొత్తగా రాజకీయాలలోకి వచ్చిన రేగా కాంతారావు విజయానికి వైఎస్‌ చరిష్మా ఎంతగానో ఉపయోగపడింది.   

2014
2014లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ సీపీఐతో జట్టు కట్టగా, టీడీపీ, బీజేపీలు జట్టుగా నిలిచాయి. ఈ రెండు కూటములకు వైఎస్సార్‌సీపీ, సీపీఎం కూటమి పోటీగా నిలిచాయి. టీఆర్‌ఎస్‌ పార్టీ ఒంటరిగా బరిలో నిలిచింది. 2014 ఎన్నికల్లో సీపీఐతో పొత్తు పెట్టుకున్న నేపథ్యంలో కాంగ్రెస్‌పార్టీ సిట్టింగ్‌ సీటును సీపీఐకి కేటాయించింది. దీంతో ఈ ఎన్నికల్లో రేగా కాంతారావు పోటీలో నిలిచే అవకాశం లేకుండా పోయింది. అప్పటికే సీపీఐ నుంచి వైఎస్సార్‌ సీపీలో చేరిన పాయం వెంకటేశ్వర్లు వైసీపీ అభ్యర్థిగా పోటీలో నిలిచి విజయం సాధించారు.  ఆ తరువాత పరిణామాలలో ఆయన అధికార టీఆర్‌ఎస్‌లో చేరారు.  

2018
ప్రస్తుత ఎన్నికల్లో పాత ప్రత్యర్థులు మళ్లీ తలపడుతున్నారు. ప్రజాకూటమి అభ్యర్థిగా రేగా, టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా పాయం మధ్య రసవత్తర పోరు నడుస్తోంది. 2004 ఎన్నికల్లో కాంగ్రెస్‌ కూటమితో జట్టు కట్టిన సీపీఐ అభ్యర్థిగా పాయం వెంకటేశ్వర్లు పోటీలో నిలిచి.. టీడీపీ అభ్యర్థి తాటి వెంకటేశ్వర్లుపై విజయం సాధించారు. ప్రస్తుతం ప్రధానపోటీదారులైన పాయం వెంకటేశ్వర్లు సీపీఐ నుంచి ఒకసారి, వైఎస్సార్‌సీపీ నుంచి ఒకసారి గెలిచారు. ప్రస్తుతం టీఆర్‌ఎస్‌ నుంచి బరిలో ఉన్నారు. పోటీచేసిన తొలిసారే కాంగ్రెస్‌ తరఫున విజయం సాధించిన రేగా కాంతారావు మరోసారి గెలుపు కోసం శాయశక్తులా కృషి  చేస్తున్నారు.  

మరిన్ని వార్తలు