హైటెక్ ప్రచారం

17 Mar, 2014 23:50 IST|Sakshi

ఎన్నికల ప్రచారం గతానికి భిన్నంగా సాగుతోంది. జెండాలు, వాల్‌పోస్టర్లు, వాల్ రైటింగ్, కరపత్రాలు, భారీ కటౌట్ల స్థానంలో తాజాగా కంప్యూటర్లు, సెల్‌ఫోన్లు హల్‌చల్ చేస్తున్నాయి. కనీస కంప్యూటర్ పరిజ్ఞానం లేని నేతలు సైతం ఇప్పటి వరకూ చేసిన అభివృద్ధి, ప్రజలకు ఇచ్చిన హామీలు, ప్రసంగ పాఠాలతో సోషల్ మీడియా (సెల్‌ఫోన్, ఇంటర్నెట్) ద్వారా విస్త్రృత ప్రచారం చేస్తున్నారు. ఇప్పటికే నియోజకవర్గాల పరిధిలోని కాలనీ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు, ఉద్యోగులు, వ్యాపారులు, యువజన, కుల, ఉద్యోగ సంఘాల నేతల పేర్లు, ఫోన్ నెంబర్లను సేకరించి అభ్యర్థులే స్వయంగా ఓటర్లతో మాట్లాడుతున్నారు. ఇందుకోసం అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుంటున్నారు. ఓటు ఎందుకు వేయాలో, ఎవరికి వేయాలో సూచిస్తూ ప్రతి రోజూ ఓటర్ల ఫోన్‌లకు ఎస్‌ఎంఎస్‌లు పంపుతున్నారు. కంప్యూటర్, సెల్‌ఫోన్ వంటి ఎలక్ట్రానిక్ రంగాల్లో విశేష అనుభవం ఉన్న వారిని ఉద్యోగులుగా నియమించుకుని వారి సేవలను  వినియోగించుకుంటున్నారు.     
 
 హైటెక్ హంగులతో ఎంఐఎం ప్రచారం ..
 కాంగ్రెస్, టీఆర్‌ఎస్, బీజేపీ, టీడీపీకి దీటుగా గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ సారి ఎంఐఎం ప్రచారంలో హైటెక్ హంగులు చోటు చేసుకున్నాయి. ఓటర్లను ఆకట్టుకునేందుకు గుర్తింపు, పనితనంపై కూడళ్లలో భారీ హోర్డింగులతో ప్రచారాస్త్రాన్ని సందిస్తోంది. హోర్డింగ్‌లపై చారిత్రక ప్రదేశాలతో పాటు ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ, ఆయన తమ్ముడు అక్బరుద్దీన్ ఓవైసీల ఫొటోలను ముద్రించారు.  
 
 సాంస్కృతిక బృందాలు..  
 కంప్యూటర్ పరిజ్ఞానం లేని, చదువు రాని ఓటర్లను ఆకర్షించేందకు వారికి అర్థమయ్యే రీతిలో అభ్యర్థి గురించి ప్రచారం చేసేందుకు అభ్యర్థులు ఎవరికి వారే స్వతహాగా ప్రత్యేక సాంస్కృతిక బృందాలను ఏర్పాటు చేసుకున్నారు. అభ్యర్థి గొప్పతనం, ఆయన జీవన శైలి, ఇప్పటి వరకు ఆయన చేసిన సేవ, తదితర అంశాలే ఇతివృత్తంగా చేసుకుని సుప్రసిద్ధ రచయితలతో పాటలు రాయించి, ప్రముఖ గాయకులతో పాడిస్తున్నారు. స్టూడియోల్లో వీటిని రికార్డ్ చేయిస్తున్నారు. మైక్‌ల ద్వారా ప్రచారాన్ని ఊదరగొడుతుండటం విశేషం. ఓటరు దృష్టిని ఆకర్షించేందుకు పార్టీగుర్తు, జెండా రంగులో ప్రత్యేకంగా టీ-షర్టులు, చీరలు తయారు చేయించి కార్యకర్తలకు పంచుతున్నారు.
 
 బిజీగా ఫ్లెక్సీ సెంటర్లు..
 ఇంటింటికీ తిరిగి కరపత్రాలు పంచుతుండటంతో వాటిని ముద్రించే ఫ్లెక్సీ సెంటర్లు, ప్రింటింగ్ ప్రెస్‌లకు ఒక్కసారిగా డిమాండ్ పెరిగింది. నిన్నమొన్నటి వరకూ పనిలేక ఖాళీగా కనిపించిన  ఆర్టిస్టులు, పెయింటర్లు ప్రచార రథాలు, బ్యానర్లు, జెండాల తయారీలో బిజీగా మారిపోయారు. ప్రచారానికి భారీ కాన్వాయ్‌తో బయలు దేరుతున్నారు. ఇందు కోసం వాహనాలను అద్దెకు తీసుకుంటున్నారు. వివాహాలు, పుట్టిన రోజు వేడుకలకు నెలవైన ఫంక్షన్ హాళ్లు తాజాగా ఎన్నికల ప్రచారానికి వేదికలవుతున్నాయి.
 
 సోషల్ మీడియాదే హవా ...
 ఐరిస్ నాలెడ్జ్ ఫౌండేషన్, ఇంటర్నెట్ అండ్ మొబైల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఇటీవల సంయుక్తంగా సోషల్ మీడియాపై ఓ సర్వే నిర్వహించింది. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో పార్లమెంట్ స్థానాల్లో 160 సీట్లను ఫేస్‌బుక్, ఆర్కూట్, ట్విట్టర్ల వంటి సోషల్ మీడియా డామినేట్ చేయబోతున్నాయని తేల్చింది. యువతరం మొత్తం సోషల్ మీడియాకే అతుక్కుపోయినట్ట పేర్కొంది. దేశవ్యాప్తంగా దాదాపు 7.5 కోట్లున్న ఈ సంఖ్య, ఎన్నికల సమయంలో 11 కోట్లు దాటిపోతుందనేది అంచనా. వీరిలో దాదాపు 97 శాతం ఫేస్‌బుక్ ఖాతాదారులే. సమయం దొరికితే చాలు ఫేస్‌బుక్, ట్విట్టర్, యూట్యూబ్, బ్లాగ్స్, వెబ్‌సైట్స్, వెబ్‌టీవీ...ఏదో ఒకదానికి కనెక్ట్ అవ్వడం సర్వసాధారణమని వెల్లడించింది.
 
 రంగంలోకి పీఆర్ ఏజెన్సీలు ..
 ఎన్నికల సమయం దగ్గర పడుతుండటంతో అభ్యర్థులు తమ ప్రచార బాధ్యతలను పీఆర్ ఏజెన్సీలకు అప్పగిస్తున్నారు. గెలుపోటములపై ముందే ఓ అభిప్రాయానికి వచ్చేందుకు అంతర్గత సర్వేలు చేయిస్తున్నారు. ఓటరు నాడి తెలుసుకుని వారికి ఏం కావాలో వాటినే ఎన్నికల ఎజెండాలో రూపొందిస్తున్నారు. అంతేకాకుండా ఏ బస్తీలో ఎలాంటి సమస్యలు ఉన్నాయి. ఏ రోజు ఏ కాలనీలో ప్రచారం చేయాలి. ఏ ఏ అంశాలపై మాట్లాడాలి. ప్రజలకు ఎలాంటి హామీలు ఇవ్వాలి. తదితర అంశాలపై ముందే ఓ అవగాహనకు వచ్చి కాలనీల వారిగా ఎన్నికల ఎజెండాలను రూపొందించి అభ్యర్థులకు అందిస్తున్నాయి.

మరిన్ని వార్తలు