అభ్యర్థుల ప్రచార హోరు.. ..

24 Nov, 2018 14:30 IST|Sakshi

గ్రామాల్లో దూసుకుపోతున్నఅభ్యర్థులు 

చండ్రుగొండలో తాటికి నిరసనల  సెగ 

ఇల్లెందు, భద్రాచలంలో బహుముఖ పోరు  

సాక్షి, కొత్తగూడెం: నామినేషన్ల సమర్పణ, ఉపసంహరణ ప్రక్రియ ముగియడంతో ప్రచార పర్వం ముమ్మరంగా సాగుతోంది. జిల్లాలోని ఐదు నియోజకవర్గాల్లో నాలుగు ఎస్టీ రిజర్వ్‌డ్‌ కాగా, కొత్తగూడెం మాత్రమే జనరల్‌ స్థానం. అన్ని చోట్లా ప్రధాన పోటీదారులుగా నాలుగు పార్టీల అభ్యర్థులు ఉన్నారు. టీఆర్‌ఎస్, మహాకూటమి అభ్యర్థులు ప్రధానంగా రేసులో ఉన్నారు. జిల్లాలో వామపక్ష పార్టీల ప్రాబల్యం  ఉన్న నేపథ్యంలో సీపీఎం ఆధ్వర్యంలోని బీఎల్‌ఎఫ్‌ సైతం బరిలోకి దిగింది. బీజేపీ అభ్యర్థులు సైతం పోటీలో ఉన్నారు. టీఆర్‌ఎస్‌ జాబితా రెండున్నర నెలల క్రితమే ఖరారు కావడంతో ఆయా అభ్యర్థులు ఇప్పటికే రెండుసార్లు నియోజకవర్గాల్లో ప్రచారం చేశారు. కాంగ్రెస్‌ కూటమిలో పినపాక మినహా ఇతర నియోజకవర్గాల్లో టికెట్ల కోసం ఎవరికి వారు ఢిల్లీ, హైదరాబాద్‌ స్థాయిల్లో ప్రయత్నాలు చేసుకోవాల్సి వచ్చింది. నామినేషన్ల చివరి రోజు వరకు కూడా టికెట్ల కోసం ఉరుకులు, పరుగులు పెట్టాల్సి వచ్చింది.  
తాటికి నిరసన సెగ..  
అశ్వారావుపేట టీఆర్‌ఎస్‌ అభ్యర్థి తాటి వెంకటేశ్వర్లు రెండు నెలలుగా ప్రచారానికి వెళ్లిన సమయంలో పలుసార్లు వివిధ గ్రామాల ప్రజల నుంచి నిరసనలు ఎదురయ్యాయి. ఈ నిరసనల పరంపర ఇప్పటికీ కొనసాగుతోంది. ములకలపల్లి, దమ్మపేట, అన్నపురెడ్డిపల్లి, చంద్రుగొండ మండలాల్లో అనేక గ్రామాల్లో ఆయన ప్రచారానికి వెళ్లినప్పుడు వ్యతిరేకత ఎదురైంది. తాజాగా శుక్రవారం చంద్రుగొండ మండలంలో మరింత సెగ తగిలింది. మండలంలోని పోకలగూడెం గ్రామంలో స్థానికులు తాటిపై చెప్పులు, రాళ్లు విసిరేశారు. తమ గ్రామానికి ఏమి చేశావని నిలదీశారు. దీంతో గత్యంతరం లేక వెనుదిరిగి వెళ్లారు. 


ఇక పినపాక నియోజకవర్గంలో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి పాయం వెంకటేశ్వర్లు, కాంగ్రెస్‌ అభ్యర్థి రేగా కాంతారావు మధ్య హోరాహోరీ పోరు కొనసాగుతోంది. రెండు పార్టీల మధ్య సోషల్‌ మీడియా పోరు సైతం పోటాపోటీగానే ఉంది. ఇల్లెందు నియోజకవర్గంలో టీఆర్‌ఎస్‌ సిట్టింగ్‌ ఎమ్మెల్యే కోరం కనకయ్య పట్ల వ్యతిరేకత ఉన్నప్పటికీ కొంతమేరకు అధిగమిస్తూ వస్తున్నారు. ఇక్కడ కాంగ్రెస్‌ అభ్యర్థిగా హరిప్రియ బరిలోకి దిగడంతో ప్రచార పర్వం హోరెత్తింది. ఇల్లెందు, టేకులపల్లి మండలాల్లో కనకయ్యకు, కామేపల్లి, గార్ల, బయ్యారం మండలాల్లో హరిప్రియకు పట్టు ఉంది. మరోవైపు గతంలో ఐదు సార్లు ఎమ్మెల్యేగా పనిచేసి నిజాయితీపరుడిగా పేరున్న సీపీఐ(ఎంఎల్‌)న్యూడెమోక్రసీ అభ్యర్థి గుమ్మడి నర్సయ్య సైతం బరిలో ఉన్నారు. ఆయనకు సీపీఎం ఆధ్వర్యంలోని బీఎల్‌ఎఫ్‌ మద్దతు ప్రకటించింది. బీజేపీ నుంచి మోకాళ్ల నాగస్రవంతి పోటీలో ఉన్నారు. బీజేపీకి ఇల్లెందు పట్టణంలో కొన్ని వర్గాల నుంచి మద్దతు లభిస్తోంది. దీంతో ఇక్కడ బహుముఖ పోటీ నెలకొంది. భద్రాచలం నియోజకవర్గం సీపీఎం సిట్టింగ్‌ స్థానం. ఇక్కడ ఆ పార్టీ అభ్యర్థి మిడియం బాబూరావు గట్టి పోటీదారుగా ఉన్నారు. అధికార టీఆర్‌ఎస్‌ నుంచి తెల్లం వెంకట్రావు గత రెండున్నర నెలలుగా విస్తృత ప్రచారం చేస్తున్నారు. ఆయనకు నియోజకవర్గ వ్యాప్తంగా మంచి పట్టు ఉంది. ఇక మాజీ ఎమ్మెల్యే కుంజా సత్యవతి బీజేపీ అభ్యర్థిగా బరిలో ఉన్నారు. కాంగ్రెస్‌ పార్టీ నుంచి ములుగు మాజీ ఎమ్మెల్యే పొదెం వీరయ్య పోటీలో నిలిచారు. దీంతో ఇక్కడ కూడా బహుముఖ పోటీ నెలకొంది.    

మరిన్ని వార్తలు