‘మహా’ కుదుపు కూటమికి

15 Nov, 2018 09:03 IST|Sakshi

 నాలుగు సీట్లలో పోటీ చేస్తామని ప్రకటించిన టీజేఎస్‌ 

టీడీపీకి కేటాయించిన స్థానంలో తిరుగుబాటు చేసిన డీసీసీ అధ్యక్షుడు

జనగామ కోసం కాంగ్రెస్‌ సీనియర్‌ నేతతో పోటీ పడుతున్న టీజేఎస్‌ చీఫ్‌ 

సాక్షి, వరంగల్‌: జట్టు కట్టక ముందే కూటమిలో మహా కుదుపు మొదలైంది. సీట్ల పంపకాల్లో పొత్తులు పొసగక పోవడంతో ఎవరికి వారుగా వేరు కుంపటికి సిద్ధమవుతున్నారు. మూడు ప్రధాన పార్టీల నేతలు ఎవరికి వాళ్లుగా విడిపోయి  పోటీకి రెడీ అవుతున్నారు. పెద్ద భాగస్వామిగా ఉన్న కాంగ్రెస్‌ జిల్లాలో ఐదు సీట్లను త్యాగం చేయాల్సి వస్తుండడంతో ఆ పార్టీ నేతల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. 

‘పశ్చిమ’లో తిరుగుబాటు 
పొత్తులో భాగంగా టీడీపీకి కేటాయించిన వరంగల్‌ పశ్చిమ నియోజకవర్గంలో ఉమ్మడి వరంగల్‌ డీసీసీ అధ్యక్షుడు నాయిని రాజేందర్‌రెడ్డి తిరుగుబాటు ఎగురవేశారు. కూటమి ఒడంబడికను పక్కనపెట్టి  ఆయన తిరుగుబాటు అభ్యర్థిగా నామినేషన్‌ వేశారు. ఇక టీజేఎస్‌ 12 సీట్లలో పోటీ చేస్తామని ఏకపక్షంగా ప్రకటించింది.  అందులో నాలుగు సీట్లు ఉమ్మడి వరంగల్‌ జిల్లాలోనే ఉండడంతో ఇక్కడి మహా కూటమి నేతల్లో ఆందోళన మొదలైంది. టీజేఎస్‌ ప్రకటించిన వర్ధన్నపేట, స్టేషన్‌ ఘన్‌పూర్, వరంగల్‌ తూర్పు, జనగామ నియోజకవర్గాల్లో మూడు నియోజకవర్గాలు ప్రస్తుతానికి ఖాళీగానే ఉన్నాయి. కానీ.. కాంగ్రెస్‌  పార్టీ అభ్యర్ధిగా సింగపురం ఇందిరను ప్రకటించిన  స్టేషన్‌ ఘన్‌పూర్‌ నియోజకవర్గంలో కూడా పోటీ చేస్తామని చెప్పడం గందరగోళానికి దారితీసింది.
 
జనగామ మాదే.. కాదు మాదే..
ఇద్దరు ముఖ్య నాయకులు జనగామ కోసం పోటీ పడుతున్నారు. టీజేఎస్‌ చీఫ్‌ కోదండరాం ఇక్కడి నుంచే పోటీ చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఇప్పటికే కోదండరాం సమీప బంధువులు నియోజకవర్గంలో మకాం వేశారు. పార్టీ కార్యాలయం ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నారు. గ్రామాల్లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ సభ్యులు, ఇతర నాయకులను కలుస్తున్నారు.  మరోవైపు జనగామ సీటు తనదేనని పొన్నాల లక్ష్మయ్య విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. ఢిల్లీలో మకాం వేసి తన సీటును కాపాడుకునేందుకు ఆయన విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. పొన్నాలకు మొదటి, రెండో జాబితాల్లో సీటు ఇవ్వకపోవటాన్ని నిరసిస్తూ  కొందరు కౌన్సిలర్లు తమ పదవులకు రాజీనామాలు చేశారు.  ఒకటి రెండు రోజుల్లో మరి కొంత మంది  నేతలు కూడా రాజీనామాలు చేసే అవకాశం ఉంది. 

స్టేషన్‌ ఘన్‌పూర్‌లో గందరగోళం..
ఇప్పటికే  కాంగ్రెస్‌ అభ్యర్థిని ప్రకటించిన  స్టేషన్‌ఘన్‌పూర్‌లోనూ బరిలోకి దిగుతామని టీజేఎస్‌ ప్రకటించడంతో మళ్లీ గందరగోళం రేగింది. తొలి జాబితాలోనే కాంగ్రెస్‌ పార్టీ సింగపురం ఇందిరకు టికెట్‌ కేటాయించింది. ఈమేరకు ఆమె నామినేషన్‌కు సిద్ధమవుతున్నారు. తాజాగా తాము ఇక్కడి నుంచి కూడా పోటీ చేస్తామని ప్రకటించడం వివాదాస్పదమవుతోంది. మరో వైపు వర్ధన్నపేట టికెట్‌ తనకే ఇవ్వాలని కొండేటి శ్రీధర్‌ గాంధీ భవన్‌లో ధర్నా చేశారు. కొండేటి నామినేషన్‌కు సిద్ధమవుతున్నట్లు ఆయన అనుచరులు బుధవారం ప్రకటించారు.
 
 

 
   

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు