వైరా: అభ్యర్థుల లీలలు

4 Dec, 2018 13:19 IST|Sakshi

ఓటర్ల ప్రసన్నానికి నానా తంటాలు 

మద్యం, విందులతో ప్రలోభపెడుతున్న వైనం 

గెలుపునకు అభ్యర్థుల ఎత్తుగడలు  

రహస్య సమావేశాలతో పాచికలు వేస్తున్న ద్వితీయ శ్రేణి నాయకులు  

ఎక్కడ చూసినా అభ్యర్థుల గెలుపుపైనే చర్చ జరుగుతోంది. ఏ నలుగురు కలిసినా రాజకీయాలే మాట్లాడుకుంటున్నారు. ఓటర్ల ప్రసన్నానికి అభ్యర్థులు నానా తంటాలు పడుతున్నారు. పది ఓట్లు ఎవరి చేతిలో ఉంటాయో వారిని ఆకట్టుకుంటున్నారు. విందులతో హల్‌ చల్‌ సృష్టిస్తున్నారు. మేమున్నాం.. ముందుకు పదండని డబ్బులు ఎరవేస్తున్నారు. తాగినంత మద్యం.. జేబు నిండా డబ్బు పెట్టి ఓటర్ల వేటకు పంపుతున్నారు. దీంతో ఒకే ఓటరును వివిధ అభ్యర్థులకు చెందిన అనుచరులు కలుసుకొని మొహమాటం పెడుతున్నారు. కానీ ఓటర్లు మాత్రం అందరితో సరేనని పంపుతున్నారు. ఇదండీ నియోజకవర్గంలో జరుగుతున్న ఎన్నికల తంతు..  

సాక్షి, వైరా: ముందస్తు ఎన్నికలు ముంచుకొస్తున్న నేపథ్యంలో ఓటర్లను ఆకర్షించడానికి వారి అవసరాలను ఆసరగా చేసుకుంటున్నారు. తమ పార్టీకి ఓటు వేసి గెలిపిస్తే పింఛన్లతోపాటు డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు ఇప్పిస్తామంటూ హామీల వర్షం కురిపిస్తున్నారు. ఇంతకాలం తమ అవసరాల కోసం అధికారులు, నాయకుల చుట్టూ తిరిగినా పట్టించుకోని వారు.. ఇప్పుడు ఓట్లకోసం నోటికొచ్చిన హామీలను ఇస్తున్నారని ప్రజలు చర్చించుకుంటున్నారు. టీఆర్‌ఎస్‌ అభ్యర్థి ఆ పార్టీ సంక్షేమ పథకాలను వివరిస్తున్నారు. ఓ పక్క స్వతంత్ర అభ్యర్థి లావూడ్య రాములు నాయక్‌ ఎన్నికల అధికారులు కేటాయించిన రైతు నాగలి గుర్తును ఆశించిన స్థాయిలో ఓటర్లకు గుర్తుండిపోయేలా ప్రచారం చేస్తున్నారు. మరోవైపు  ప్రజాకూటమి అధికారంలోకి వస్తే టీఆర్‌ఎస్‌ పాలన కంటే నాలుగురెట్లు అభివృద్ధి చేసి చూపుతానని చెబుతున్నారు. తమ పార్టీ అభ్యర్థిని ఎమ్మెల్యేగా గెలిపిస్తే సమస్యల పరిష్కారానికి కృషిచేస్తామంటు సీపీఎం నాయకులు ఓట్లు అడుగుతున్నారు. అన్ని పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు ఇంటింటి ప్రచారం చేస్తున్నారు. ఈ ఎన్నికల్లో డబ్బు, మద్యం ప్రధాన అంశాలు కానున్నాయి. మరో నాలుగు రోజుల్లో ఎన్నికలు జరగనున్నందున ఆయా పార్టీల నాయకులు ఎన్నికలను సవాల్‌గా తీసుకున్నారు. ఉదయం నుంచి అర్థరాత్రి వరకు రహస్యంగా గ్రామాల వారీగా సమావేశాలు నిర్వహిస్తూ.. కుల సంఘాల నాయకులతో బేరసారాలాడుతున్నట్లు వినికిడి. ప్రచారం చివరి దశకు చేరుకోవడంతో డబ్బులు, మద్యం బాటిళ్లు వెదజల్లి ఓటర్లను తమ వైపు తిప్పుకునేలా ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నట్లు ప్రచారం. ఇక ఈ శిబిరాల్లో ప్రచారం నిర్వహించే యువకులకు నిత్యం విందులు ఏర్పాటు చేస్తున్నారు. బూత్‌ల వారిగా విభజించి డబ్బుల పంపిణీకి  ఏర్పాట్లు జరుగుతున్నాయి. 
గెలుపుపై అభ్యర్థుల ధీమా.. 
నియోజకవర్గంలో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి బాణోత్‌ మదన్‌లాల్, స్వతంత్ర అభ్యర్థి లావూడ్య రాములు నాయక్, ప్రజాకూటమి అభ్యర్థి విజయాబాయి మధ్య పోటీ రసవత్తరంగా మారింది. ఈ అభ్యర్థుల గెలుపుపై ప్రజల్లో తీవ్ర చర్చ కొనసాగుతోంది. ఆయా పార్టీలకు చెందిన నాయకులు ఎవరికి వారు తమ పార్టీ గెలుస్తుందన్న ధీమా వ్యక్తం చేస్తున్నారు. గ్రామాల వారీగా ఓట్లను లెక్కగడుతున్నారు. నియోజకవర్గంలో 1,76, 820 ఓట్లు ఉన్నాయి. అభివృద్ధి పనులే టీఆర్‌ఎస్‌కి పట్టం కడతాయని ఆ పార్టీ నాయకులుండగా, ప్రజల్లో ఉన్న సానుభూతితోపాటు టీఆర్‌ఎస్‌ అభ్యర్థిపై ఉన్న వ్యతిరేకత తనకు కలిసి వస్తుందంటూ స్వతంత్ర అభ్యర్థి రాములు నాయక్‌ ధైర్యంతో ప్రచారంలో దూసుకెళుతున్నారు. మరోవైపు ప్రజాకూటమి అభ్యర్థి బాణోత్‌ విజయ ఓటర్లను ఆ«శించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోతోందనే విమర్శలు ఉన్నప్పటికీ ప్రచారంలో ప్రత్యుర్థులతోపాటు ముందంజలో ఉన్నారని చెప్పవచ్చు. ప్రచారానికి మరో రెండు రోజులే ఉండటంతో అభ్యర్థులు ప్రతి గ్రామంలో ప్రచారాన్ని ముమ్మరం చేస్తున్నారు.   

మరిన్ని వార్తలు