బుజ్జి కుక్కకు బోలెడు కష్టం

29 Apr, 2019 02:03 IST|Sakshi

నగరంలో పెంపుడు శునకాలపై కెనైన్‌ డిస్టెంపర్‌ వైరస్‌ పంజా

సకాలంలో వ్యాక్సినేషన్లు ఇవ్వకపోవడం వల్లే విజృంభణ

పక్షం రోజుల్లో 30కిపైగా శునకాల మృత్యువాత

నారాయణగూడ సూపర్‌ స్పెషాలిటీ వెటర్నరీ ఆస్పత్రికి భారీగా కేసులు  

రాష్ట్ర రాజధానిలో పెంపుడు శునకాలకు ప్రత్యేకించి పప్పీలకు ఆపదొచ్చింది. ఇంటిల్లిపాదీ అల్లారుముద్దుగా పెంచుకునే శునకాలపై మాయదారి కెనైన్‌ డిస్టెంపర్‌ వైరస్‌ పంజా విసురుతోంది. దీని బారినపడి పక్షం రోజులుగా హైదరాబాద్‌లో 30కిపైగా పెంపుడు కుక్కలు మరణించాయి. ఈ పరిణామం శునకాల యజమానులను ఆందోళనకు గురిచేస్తోంది. ఈ వైరస్‌ వేగంగా ఇతర పెంపుడు జంతువులకు వ్యాపిస్తుండటంతో వెటర్నరీ వైద్యులు హైఅలర్ట్‌ ప్రకటించారు.
– హైదరాబాద్‌ 

ఎలా వ్యాపిస్తుంది?
ఈ వైరస్‌ లాలాజలం, రక్తం లేదా మూత్రం ద్వారా ఒక శునకం నుంచి మరో శునకానికి వ్యాపిస్తుంది. అలాగే దగ్గు, జలుబుతోపాటు ఆహారం, మంచినీరును ఒకే గిన్నెలో పంచుకోవడం ద్వారా వైరస్‌ ఇతర శునకాలకు విస్తరిస్తుంది.

లక్షణాలు ఏమిటి?
పెంపుడు శునకాల శ్వాశకోస, జీర్ణకోశ, కేంద్ర నాడీ వ్యవస్థలను కెనైన్‌ డిస్టెంపర్‌ వైరస్‌ దెబ్బతీస్తుంది. జ్వరం, విరేచనాలు, వాంతులు, ఆకలి మందగించడం, దగ్గు, తుమ్ములతోపాటు కళ్లు పుసులు కట్టడం, ముక్కు నుంచి పసుపుపచ్చ ద్రవం కారడం ఈ వ్యాధి లక్షణాలు.

రోగ నిరోధక శక్తి లేకే...
రోగనిరోధక శక్తి తక్కువగా ఉండే పెంపుడు కుక్కల్లో కెనైన్‌ డిస్టెంపర్‌ వైరస్‌ ఎక్కువగా వ్యాపిస్తుంటుందని వైద్యులు చెబుతున్నారు. శునకాలకు టీకాలను సకాలంలో వేయని కారణంగా ఈ వైరస్‌ వచ్చే ప్రమాదం ఉందని, పెంపుడు కుక్కలకు వైరస్‌ రాకుండా ఉండాలంటే టీకాలు వేయించాలని సూచిస్తున్నారు.

వైరస్‌ను గుర్తించాలిలా
ఈ వైరస్‌కు గురైన శునకాలను గుర్తించేందుకు యజమానులు అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. కొన్ని శునకాలకు పొట్టపై పొక్కుల వంటివి వస్తే వాటికి తప్పకుండా ‘కెనైన్‌ డిస్టెంపర్‌’ వైరస్‌ వచ్చినట్లేనని చెబుతున్నారు. ప్రధానంగా కేంద్ర నాడీ వ్యవస్థ దెబ్బతినే శునకాలు బతకడం కష్టం అంటున్నారు. ఇలాంటి శునకాలకు దవడలు, కాళ్లు పదేపదే కొట్టుకోవడం, తలపై ఫ్లూయిడ్‌ బంప్స్‌ అవ్వడం, వైబ్రేషన్‌కు గురవుతాయంటున్నారు.

వైరస్‌ గుర్తింపునకు ప్రత్యేక కిట్‌..
పెంపుడు శునకాలు కెనైన్‌ డిస్టెంపర్‌ వైరస్‌ బారిన పడ్డాయా లేదా అని నిర్ధారించేందుకు వైద్యులు ‘డయాగ్నోస్టిక్‌ కిట్‌’తో చెకప్‌ చేస్తారు. ఈ టెస్ట్‌లో పాజిటివ్‌ వస్తే ట్రీట్‌మెంట్‌ను అదే రోజు నుంచి ప్రారంభిస్తారు. మొదటి వ్యాక్సినేషన్‌ ఆరు వారాల వయసు నుంచి పెంపుడు కుక్కకు ఇప్పించాలి. ఆరు వారాల అనంతరం ప్రతి నెల రెండు పర్యాయాలు, ఆ తరువాత నుంచి ప్రతి సంవత్సరం ఈ వ్యాక్సినేషన్‌ను వేయాల్సి ఉంటుంది. ఈ వ్యాక్సినేషన్‌ను ‘సెవెన్‌ ఇన్‌ వన్‌ లేదా నైన్‌ ఇన్‌ వన్‌’ అని పిలుస్తారు.

ఒకటి నుంచి 20కి పెరిగిన కేసులు..
రాంనగర్‌కు చెందిన ఓ శునకం ఈ వైరస్‌బారిన పడటంతో యజమాని దాన్ని నారాయణగూడ సూపర్‌ స్పెషాలిటీ వెటర్నరీ హాస్పిటల్‌కు తీసుకెళ్లారు. పెట్‌ని పరీక్షించిన డాక్టర్‌ స్వాతిరెడ్డి ఈ పెట్‌ కెనైన్‌ డిస్టెంపర్‌ వైరస్‌కు గురైనట్లు ధ్రువీకరించారు. కొద్దిరోజుల వ్యవధిలోనే ఈ పెట్‌ నుంచి మరో 19 పెట్స్‌కు వైరస్‌సోకింది. ఇలా ఒక్క రాంనగర్‌ నుంచే ఈ వైరస్‌కు గురైన పెట్స్‌ కేసులు 20 నమోదయ్యాయి. ఒక్క నారాయణగూడ హాస్పిటల్‌లోనే ఫలక్‌నుమా నుంచి 6, రామాంతపూర్‌ నుంచి 2 కేసుల చొప్పున మూడు నెలల వ్యవధిలో నమోదయ్యాయి. నగరవ్యాప్తంగా నెలకు 20–30 కేసులు నమోదవుతున్నట్లు వైద్యులు చెబుతున్నారు.

కొన్ని రోజులకే చచ్చిపోయింది...
మా ‘గోల్డెన్‌ రిట్రీవర్‌’ శునకం 4 నెలల వయసులో అనారోగ్యానికి గురవడంతో నారాయణగూడ హాస్పిటల్‌కు తీసుకెళ్లాం. పరీక్షించిన వైద్యులు కెనైన్‌ డిస్టెంపర్‌ వైరస్‌ సోకినట్లు చెప్పారు. కేవలం 20 రోజుల్లోనే మా పప్పీ చచ్చిపోయింది.
–విక్కీ, రాంనగర్‌

ఇప్పటివరకు 30 కేసులను గుర్తించా...
పలు సమస్యలతో బాధపడుతున్న పెట్స్‌ని హాస్పిటల్‌కు తీసుకురాగా చెక్‌ చేశాను. అవి కెనైన్‌ డిస్టెంపర్‌ వైరస్‌కు గురైనట్లు నిర్ధారించా. వాటికి ప్రత్యేకంగా ట్రీట్‌మెంట్‌ను అందించాల్సిన అవసరం ఉంది. వైరస్‌ వచ్చిన పెట్‌ని వేరే పెట్స్‌ మధ్యలో పెట్టడం కారణంగా మరో 19 పెట్స్‌కి కూడా ఈ వైరస్‌ సోకింది. వ్యాక్సినేషన్‌ సక్రమంగా ఇవ్వగలిగితే కొద్దిరోజులైనా పెట్‌ బతికే అవకాశం ఉంటుంది.
– డాక్టర్‌ స్వాతిరెడ్డి, సూపర్‌ స్పెషాలిటీ వెటర్నరీ హాస్పిటల్, నారాయణగూడ

అవగాహన అవసరం
కెనైన్‌ డిస్టెంపర్‌ వైరస్‌ గురించి పెట్స్‌ యజమానుల్లో సరైన అవగాహన లేదు. కరపత్రాల ద్వారా అవగాహన కల్పించాలనుకుంటున్నాం. స్వచ్ఛంద సంస్థలు మందుకొచ్చి కొన్ని నిధులు సమకూరిస్తే అవగాహన కల్పించే పెట్స్‌ వైరస్‌కు గురి కాకుండా ఉండేందుకు సహకరించవొచ్చు. 
– డాక్టర్‌ ఎ. పరమేశ్వర్‌రెడ్డి, డిస్ట్రిక్ట్‌ వెటర్నరీ అండ్‌ హస్బెండరీ ఆఫీసర్‌

మరిన్ని వార్తలు