నీట్‌లో గురుకుల విద్యార్థుల సత్తా

6 Jun, 2018 01:35 IST|Sakshi

 సాక్షి, హైదరాబాద్‌: నీట్‌–2018లో సాంఘిక, గిరిజన సంక్షేమ గురుకులాల విద్యార్థులు సత్తా చాటారు. పేద కుటుంబానికి చెందిన జుబిలాంట్‌ జత్రోత్‌ నవీన్‌ జాతీయస్థాయిలో ఎస్టీ కేటగిరీలో 210 ర్యాంకు సాధించారు. ఎస్సీ కేటగిరీలో సాయి కిషోర్‌ 767వ ర్యాంకు కైవసం చేసుకున్నారు. మొత్తంగా 87 మంది నీట్‌లో ర్యాంకులు సాధించారని, వీరిలో 63 మందికి మెడిసిన్, 24 మందికి బీడీఎస్‌లో సీటు లభించే అవకాశముందని సాంఘిక సంక్షేమ గురుకులాల కార్యదర్శి ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ వెల్లడించారు.

బయట కోచింగ్‌లకు వెళ్లలేని పేద విద్యార్థుల కోసం ప్రారంభించిన ఆపరేషన్‌ బ్లూ క్రిస్టల్, ఆపరేషన్‌ ఎమరాల్డ్‌ కార్యక్రమాలతో మంచి ర్యాంకులు వచ్చాయన్నారు. ఆర్థిక స్తోమత లేక ఇబ్బంది పడుతున్న తనకు ఆపరేషన్‌ ఎమరాల్డ్‌ ఎంతో ఉపయోగపడిందని నవీన్‌ అన్నారు. కార్డియాలజిస్ట్‌ అవుతానని.. గ్రామాలు, గిరిజన ప్రాంతాల్లోని పేదలకు సేవ చేస్తానని చెప్పారు. ఆపరేషన్‌ బ్లూ క్రిస్టల్‌ తనకు చాలా ఉపయోగపడిందని, దీని సహాయంతోనే మంచి ర్యాంకు సాధించానని సాయి కిషోర్‌ తెలిపారు. ఇన్‌ఫెక్షన్‌తో ఒకరి నుంచి ఒకరికి సంక్రమించే వ్యాధుల నిర్మూలనలో స్పెషలిస్టు కావాలన్నదే తన లక్ష్యమన్నారు.  

మరిన్ని వార్తలు