రాజధాని గరం గరం..

17 Jun, 2015 02:17 IST|Sakshi
రాజధాని గరం గరం..

* బాబు, ఏపీ నేతలకు నోటీసులు ఇవ్వనున్నారనే ప్రచారం
* హైదరాబాద్‌లో రాజకీయ, అధికార వర్గాల హడావుడి
* కేసీఆర్‌తో రెండుసార్లు ఏసీబీ డీజీ ఏకే ఖాన్ భేటీ
*ఏపీ మంత్రులు, అధికారులతో చంద్రబాబు సుదీర్ఘ భేటీ

 
సాక్షి, హైదరాబాద్: ‘ఓటుకు నోటు’ కేసు దర్యాప్తు కీలకదశకు చేరుకోవడంతో రాజధాని హైదరాబాద్ కేంద్రంగా మంగళవారం రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. ఏపీ సీఎం చంద్రబాబు, కేంద్రమంత్రి సుజనాచౌదరి, మరో ఇద్దరు ఎంపీలకు ఏసీబీ నోటీసులు జారీ చేయనుందన్న వార్తలు, తదనుగుణంగా జరిగిన పరిణామాలు ప్రకంపనలు సృష్టించాయి. ఉదయం ఏసీబీ డీజీ ఏకే ఖాన్ సీఎం కేసీఆర్‌ను క్యాంపు కార్యాలయంలో కలవడంతో మొదలైన టెన్షన్.. రాత్రి వరకు కొనసాగింది. కేసీఆర్‌తో ఏకే ఖాన్ భేటీ అయిన కొద్దిసేపటికే డీజీపీ అనురాగ్‌శర్మ, హైదరాబాద్ పోలీస్ కమిషనర్ మహేందర్‌రెడ్డి రాజ్‌భవన్‌కు వెళ్లి గవర్నర్ నరసింహన్‌ను కలిశారు.

దీంతో టీడీపీ అధినేత బాబు, ఆ పార్టీ నేతల్లో ఏదో కీలక పరిణామం చోటు చేసుకోబోతుందన్న ఉత్కంఠ మొదలైంది. ఈ నేపథ్యంలో ఏపీ డీజీపీ జేవీ రాముడు, సీఎస్ ఐవైఆర్ కృష్ణారావు, ఇంటెలిజెన్స్ చీఫ్ అనురాధ తదితరులతో బాబు సమావేశమై.. తెలంగాణ ప్రభుత్వాన్ని నిలువరించేందుకు గల అవకాశాలను సమీక్షించారు. అనంతరం బాబు సచివాలయంలో ఏపీ మంత్రులతో సుదీర్ఘంగా భేటీ అయి... తెలంగాణ పోలీసులు, ఏసీబీ తీసుకునే చర్యలపై చర్చించారు.
 
 మరోవైపు ఇదే సమయంలో ఏసీబీ డీజీ ఏకే ఖాన్ ‘ఓటుకు నోటు’ కేసును దర్యాప్తు చేస్తున్న అధికారులతో రెండుసార్లు సమావేశమై మరోసారి సీఎం కేసీఆర్‌ను కలిసి తాజా పరిస్థితిని వివరించారు. కాగా ఏపీ మంత్రుల భద్రతను తామే చూసుకుంటామని ఆ రాష్ట్ర డీజీపీ రాముడు గవర్నర్‌ను కలిసి వివరించడం గమనార్హం.

రోజంతా హడావుడి
తాజా పరిణామాల నేపథ్యంలో  ఏసీబీ  హెడ్‌క్వార్టర్స్‌తో పాటు ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీ(ఎఫ్‌ఎస్‌ఎల్), ఏపీ, తెలంగాణ సీఎంల క్యాంపు కార్యాలయాలు, సచివాలయం, ఎన్టీఆర్ ట్రస్ట్‌భవన్‌ల వద్ద ఉదయం నుంచి రాత్రి వరకు హడావుడి కొనసాగింది. ఒకదశలో సచివాలయంతో పాటు ఏసీబీ కార్యాలయం, బాబు నివాసం వద్ద పోలీసులు అదనపు బలగాలను మోహరించారు. ఎన్టీఆర్ ట్రస్ట్‌భవన్ నుంచి వచ్చిన ఆదేశాల మేరకు మంగళవారం మధ్యాహ్నం వందలాది మంది తెలుగు తమ్ముళ్లు ట్రస్ట్‌భవన్ వద్దకు తరలివచ్చారు. ఈ హడావుడిని ప్రత్యక్ష ప్రసారం చేస్తున్న మీడియాను టీడీపీ నాయకులు అడ్డుకోవడంతో గొడవ జరిగింది. ఏపీ పోలీసులు రంగప్రవేశంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.
 

మరిన్ని వార్తలు