34 కిలోల గంజాయి పట్టివేత

27 Jul, 2017 01:03 IST|Sakshi
34 కిలోల గంజాయి పట్టివేత
- ఏడుగురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
‘సాక్షి’ కథనాలతో వేగంగా కదిలిన యంత్రాంగం
 
నిర్మల్‌ రూరల్‌: గంజాయిపై ‘సాక్షి’దినపత్రికలో వచ్చిన కథనాలతో నిర్మల్‌ జిల్లా పోలీసులు వేగంగా స్పందించారు. బుధవారం నాలుగు ప్రాంతాల్లో దాడులు నిర్వహించి, 34కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. మొత్తం ఏడుగురిని అదుపులోకి తీసుకున్నారు. ఈ వివరాలను జిల్లా ఎస్పీ విష్ణు ఎస్‌ వారియర్‌ వెల్లడించారు. జిల్లాకేంద్రంలో గంజాయి విక్రయాలు జరుగుతున్నాయన్న సమాచారం మేరకు కొన్నిరోజులుగా నిఘా పెట్టినట్లు చెప్పారు.

ఈ క్రమంలో బుధవారం జిల్లా కేంద్రంలోని వైఎస్‌ఆర్‌ కాలనీలో ఇద్దరిని అదుపులోకి తీసుకుని విచారించామన్నారు. వారు ఇచ్చిన వివరాలతో దిలావర్‌పూర్‌ మండలం గుండంపల్లిలో ఇద్దరిని, నిర్మల్‌లో ఒకరిని, ఆదిలాబాద్‌ జిల్లా నేరేడిగొండ మండలం కొరిటికల్‌(బి)లో ఒకరిని, ధార్మిక్‌నగర్‌లో ఒకరిని అదుపులోకి తీసుకున్నామని చెప్పారు. వీరి వద్ద నుంచి మొత్తం 34కిలోల గంజాయిని సాగు చేసుకున్నామన్నారు. కాగా, నిర్మల్‌ జిల్లాలో గంజాయి సాగు, విక్రయాలు జోరుగా జరుగుతున్న విషయాన్ని ‘సాక్షి’ముందే చెప్పింది. ఈనెల 18న జిల్లా టాబ్లాయిడ్‌లో ‘మత్తు’గ గంజాయి సాగు!.. శీర్షికన కథనాన్ని ప్రచురించింది. అలాగే బుధవారం సాక్షి మెయిన్‌లో ‘గంజాయి ‘సాగు’తోంది!.. శీర్షిక నెట్‌వర్క్‌ కథనాలను ప్రచురించింది. ఈనేపథ్యంలో పోలీస్‌శాఖ వేగంగా స్పందించింది.
 
నిజామాబాద్‌లో 17 కిలోలు... ముగ్గురు అరెస్టు, పరారీలో ఇద్దరు
నిజామాబాద్‌ క్రైం: నిజామాబాద్‌ జిల్లా కేంద్రంలోని ఆటోనగర్‌లో బుధవారం 17 కిలోల గంజాయిను ఎక్సైజ్‌ అధికారులు పట్టుకున్నారు. గంజాయి రవాణా చేస్తున్న ముగ్గురిని అరెస్టు చేయగా, మరో ఇద్దరి పరారీలో ఉన్నారు. బుధవారం ఎక్సైజ్‌శాఖ డిప్యూటీ కమిషనర్‌ డేవిడ్‌ రవికాంత్‌ విలేకరులకు వివరాలు వెల్లడించారు. మంగళవారం నిజామాబాద్‌ మండలం గాంధీనగర్‌కు చెందిన దువ్వాడ మహేశ్, ఆటోనగర్‌కు చెందిన ఫరిదాబేగం అలియాస్‌ ఫరాలు గంజాయితో ఆటోనగర్‌కు వచ్చినట్లు ఎక్సైజ్‌ పోలీసులకు సమాచారం అందింది. దీంతో తనిఖీలు నిర్వహించి మహేష్, ఫరాల వద్దనుంచి నాలుగు కిలోల గంజాయిను స్వాధీనం చేసుకున్నారు.

వారి సమాచారం మేరకు అఖిలా బీ ఇంటిపై దాడులు చేసి 13 కిలోల గంజాయిను స్వాధీనం చేసుకున్నారు. గంజాయి రవాణాలో సయ్యద్‌ బషీర్‌ అల్లుడు సయ్యద్‌ కరీంకు సంబంధం ఉండటంతో ఆయనను అదుపులోకి తీసుకుని అరెస్టు చేసినట్లు డీసీ తెలిపారు. ఎక్సైజ్‌ పోలీసులు తమ ఇంటిపై దాడులు చేస్తున్న విషయాన్ని తెలుసుకున్న భార్యభర్తలు అంతకు ముందే పారిపోయారు. వీరికి కోసం గాలిస్తున్నట్లు డీసీ తెలిపారు. 

 

మరిన్ని వార్తలు