అయ్యో దేవుడా..!     

12 Nov, 2018 10:59 IST|Sakshi

రోడ్డు ప్రమాదంలో నలుగురి మృతి

దైవదర్శనానికి వెళ్లొస్తూ అనంతలోకాలకు.. 

మరో నలుగురికి తీవ్రగాయాలు ప్రమాదవశాత్తు 

గొర్రెల కాపరిపైకి దూసుకెళ్లి..చెట్టును ఢీకొట్టిన కారు 

ఇటిక్యాల మండలం వేముల వద్ద దుర్ఘటన 

నిద్రమత్తు, అతివేగమే ప్రమాదానికి కారణం 


సాక్షి,ఇటిక్యాల (అలంపూర్‌): కుటుంబ సభ్యులు, బంధువులంతా కలిసి కారులో వెళ్లి.. తిరుమల వెంకన్నను దర్శనం చేసుకున్నారు.. సంతోషంగా తిరుగు ప్రయాణమైన వారిని అతివేగం, నిద్రమత్తు రూపంలో మృత్యువు వెంటాడింది.. వేగంగా దూసుకొచ్చిన కారు.. డ్రైవర్‌ నిద్రమత్తులోకి జారుకోవడంతో ప్రమాదవశాత్తు రోడ్డు పక్కనున్న ఓ గొర్రెల కాపరిపైకి దూసుకెళ్లి చెట్టును ఢీకొట్టింది.. ఈ ప్రమాదంలో గొర్రెల కాపరితోపాటు మరో ముగ్గురు అక్కడికక్కడే మృత్యువాత పడగా.. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ సంఘటన ఆదివారం ఉదయం మండలంలోని వేముల గ్రామ స్టేజీ వద్ద జాతీయ రహదారిపై చోటుచేసుకుంది. సంఘటనకు సంబంధించిన వివరాలు పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. 
ఆయువు తీసిన అతివేగం 
సికింద్రాబాద్‌లోని లాలపేటకు చెందిన అక్కాచెల్లెళ్లు స్వాతి, స్వప్న, వారి భర్తలు మహేష్, యాదగిరి, పిల్లలు స్వీటి, వైష్ణవి, నితిన్‌లతో కలిసి తిరుపతికి వెళ్లారు. దైవదర్శనం అనంతరం ఆదివారం తెల్లవారుజామున కారులో సికింద్రాబాద్‌కు బయలుదేరారు. ఈ క్రమంలో మండలంలోని వేముల స్టేజీ వద్ద జాతీయ రహదారిపై యాదగిరి వేగంగా కారు నడుపుతూ.. నిద్రమత్తులోకి జారుకున్నాడు. వెంటనే కారు రోడ్డు పక్కన గొర్రెలు మేపుతున్న రాధాకృష్ణ పైకి దూసుకెళ్లి చెట్టును బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో గొర్రెల కాపరి రాధాకృష్ణ(46)తోపాటు కారులో ప్రయాణిస్తున్న మహేష్‌(52), ఆయన కుమార్తె వైష్ణవి(14), యాదగిరి కుమార్తె స్వీటి(8) మృతి చెందారు.

యాదగిరి, స్వప్న, స్వాతి, నితిన్‌లకు తీవ్రగాయాలయ్యాయి. సమాచారం అందుకుని సంఘటనా స్థలానికి చేరుకున్న అలంపూర్‌ సీఐ రజితారెడ్డి, ఇటిక్యాల ఎస్‌ఐ జగదీశ్వర్, పోలీసు లు హైవే అంబులెన్స్‌లో క్షతగాత్రులను కర్నూలులోని ఆస్పత్రికి తరలించారు. గాయపడిన వారి ఆర్తనాదాలతో ఆ ప్రాంతమంతా దద్దరిల్లింది. రాధాకృష్ణది ఇటిక్యాల మండలంలోని కోదండాపురం స్వగ్రామం. రాధాకృష్ణకు భార్య, ఇద్దరు చిన్నపిల్లలు ఉన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.  

మరిన్ని వార్తలు