బెలూన్‌ తెరుచుకున్నా దక్కని ప్రాణం

29 Jun, 2020 09:11 IST|Sakshi
సంఘటనా స్థలంలో ధ్వంసమైన కార్లు

సాక్షి, హైదరాబాద్‌: వేగంగా దూసుకొచ్చిన ఓ బెంజ్‌ కారు ఎదురుగా వస్తున్న మరో కారును ఢీకొట్టడంతో అందులో ఉన్న వ్యక్తి దుర్మరణం చెందాడు. ఈ సంఘటన నార్సింగి పోలీస్‌స్టేషన్‌ పరిధిలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. నగరానికి చెందిన శ్రీనివాస్‌రావు శనివారం రాత్రి 11.30 గంటలకు బెంజ్‌ (ఏపీ 39 సీఎస్‌ 9999) కారులో పుప్పాలగూడ టోల్‌గేట్‌ సర్వీస్‌ రోడ్డు మీదుగా వేగంగా వచ్చాడు. రాజేంద్రనగర్‌ బుద్వేల్‌ ప్రాంతానికి చెందిన నాగేశ్వర్‌రావు(40) తన కారు(ఐ–20)లో నార్సింగి వైపు వస్తున్నాడు. ఇదే సమయంలో అదుపుతప్పిన శ్రీనివాస్‌రావు బెంజ్‌.. నాగేశ్వర్‌రావు కారును బలంగా ఢీకొంది.

ఈ ప్రమాదంలో బెంజ్‌ వేగానికి అతడి కారు పల్టీ కొట్టి రోడ్డు మధ్యలో పడిపోయింది. ఈ ఘటనలో నాగేశ్వర్‌రావు తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందారు. కాగా, కారులోని బెలూన్‌లు తెరుచుకున్నప్పటికీ ఆయన బతకలేదు. బెంజ్‌ కారులోని బెలూన్‌లన్నీ తెరుచుకోవడంతో శ్రీనివాస్‌రావు స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. కేసు నమోదు చేసిన పోలీసులు శ్రీనివాస్‌రావును ఆదివారం సాయంత్రం రిమాండ్‌కు తరలించారు. కాగా, ప్రమాదం జరిగిన సమయంలో శ్రీనివాస్‌రావు మద్యం మత్తులో ఉన్నట్లు స్థానికులు పోలీసులకు తెలిపారు. నిందితుడిని వైద్య పరీక్షలకు పంపించామని పోలీసులు స్పష్టం చేశారు. నివేదిక ఆధారంగా కేసు నమోదు చేస్తామన్నారు. (బంధువులకు కుళ్లిపోయిన అనాధ శవాలు!)

మరిన్ని వార్తలు