జోరుగా షి'కార్‌'!

18 May, 2019 10:40 IST|Sakshi

గ్రేటర్‌లో గణనీయంగా పెరుగుతున్న కార్ల సంఖ్య

నానాటికీ తగ్గుతున్న ద్విచక్ర వాహనాల శాతం

బైక్‌కు బదులు కారుకు మొగ్గు చూపుతున్న వైనం

ఆందోళనకరంగా వాహనాల పెరుగుదల

ప్రభుత్వం చర్యలు తీసుకోవాలంటున్న అధికారులు

రాజధానిలోని ట్రాఫిక్‌పై క్రమక్రమంగా ‘కారు’మబ్బులు కమ్ముకుంటున్నాయి. నగరంలో కార్లు వంటి తేలికపాటివాహనాల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. ఇతర వాహనాలు, చివరకు టూ వీలర్స్‌ సైతం వీటి‘వేగాన్ని’ అందుకోలేకపోతున్నాయి. మెట్రో రైల్‌ సేవలు అందుబాటులోకి వస్తే రోడ్లపై ట్రాఫిక్‌ గణనీయంగా తగ్గుతుందని భావించారు. రెండు మార్గాల్లో మెట్రో పరుగులు పూర్తిస్థాయిలో మొదలైనాట్రాఫిక్‌ ఉపశమనం ఆశించిన స్థాయిలో లేదు. దీనికి కార్ల సంఖ్య పెరగటమూ ఓ కారణమనిఅధికారులు అంచనా వేస్తున్నారు.

సాక్షి, సిటీబ్యూరో:  2001–19 (మార్చి) మధ్య గణాంకాలకువిశ్లేషిస్తే మొత్తం వాహనాల్లో ద్విచక్ర వాహనాల శాతం నానాటికీ తగ్గుతూ వస్తుండగా... కార్లది మాత్రం పైపైకి పోతోంది. తేలికపాటి వాహనమైన కార్లలో వ్యక్తిగతమైనవే అత్యధికం. ఈ ధోరణి కొనసాగితే భవిష్యత్తులో మరిన్ని ‘జామ్‌’జాటాలు, కాలుష్య కష్టాలు తప్పవని ట్రాఫిక్‌ విభాగంఅధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 

తీసికట్టుగా సిటీ రోడ్ల విస్తీర్ణం...
హైదరాబాద్‌ నగరం విస్తీర్ణంలో కేవలం 8.32 శాతం మాత్రమే రోడ్లు ఉన్నాయి. అంతర్జాతీయ ప్రమాణాల ప్రకారం కనీసం 12 శాతం ఉండాలి. ముంబైలో ఇది 10 శాతంగా, చెన్నైలో ఏకంగా 18 శాతంగా ఉంది. వాహనాలుపెరుగుతున్న స్థాయిలో రోడ్ల విస్తరణ, ఫ్లైఓవర్ల నిర్మాణం వంటి మౌళిక వసతుల కల్పన జరగట్లేదు. గ్రేటర్‌లో వాహనాల సంఖ్య మాత్రం నానాటికీ పెరుగుతూ మార్చి నాటికి 60,34,398కు చేరింది. వీటికి తోడు ప్రతి రోజూ కొత్తగా 600 వాహనాలు రోడ్లపైకి వస్తున్నాయి. గడిచిన పదిహేడేళ్ల కాలంలో రాజధానిలోని వాహనాల సంఖ్య ఐదు రెట్లు అయింది. ఇంతకు మించి ఆందోళన కలిగించే విషయం ఏమిటంటే... ద్విచక్ర వాహనాలకు పోటీగా కార్లు వంటి తేలికపాటి వాహనాలు వచ్చి చేరుతున్నాయి. కారు ఉండటం ఒక ఎత్తయితే... దాన్ని తీసుకుని నిత్యం రోడ్డు పైకి రావడం మరో ఎత్తు. రోడ్డుపై ఒక్క కారు ఆక్రమించే స్థలంలో దాదాపు కనిష్టంగా 4 ద్విచక్ర వాహనాలు ప్రయాణిస్తాయి. అయితే కొత్తగా వస్తున్న తేలికపాటి వాహనాల్లో వ్యక్తిగతమైనవే ఎక్కువగా ఉండటంతో అందులో ఒకరు లేదా ఇద్దరు చొప్పునే ప్రయాణిస్తున్నారు. అంటే రోడ్డుపై 8 మంది వెళ్లాల్సిన ప్రదేశాన్ని ఇద్దరే ఆక్రమిస్తున్నారన్న మాట. ఇదే ట్రాఫిక్‌ పోలీసులకు ఆందోళన కలిగిస్తున్న అంశంగా మారింది. 

19 ఏళ్ళల్లో పెరుగుదల ఇలా...
2001–19 (మార్చ్‌) మధ్య వాహనాల పెరుగుదల గణనీయంగా కనిపించింది. 2001లో నగరంలోని వాహనాల సంఖ్య 10,91,734గా ఉండగా... 2019 మార్చ్‌  నాటికి 60,34,398కు చేరింది. తేలికపాటి వాహనాల విషయానికి వస్తే 2001లో మొత్తం వాహనాల్లో 11.58 శాతం కార్లు, 78.44 శాతం ద్విచక్ర వాహనాలు ఉండేవి. 2019 మార్చ్‌ నాటికి ఈ పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ద్విచక్ర వాహనాల శాతం తగ్గగా... తేలికపాటి వాహనాల వాటా పెరిగింది. క్యాబ్‌ల రాక సైతం ఈ మార్పునకు ఓ ప్రధాన కారణంగా నిపుణులు చెప్తున్నారు. మరోపక్క కార్లకు సంబంధించి సెకండ్‌ హ్యాండ్‌ మార్కెట్, రుణ సౌకర్యాలు పెరగడం, ద్విచక్ర వాహనం ఖరీదు చేసే వారు నేరుగా సెకండ్‌హ్యాండ్‌ కారుకు ప్రాధాన్యం ఇవ్వడం కూడా కారణాలేనని విశ్లేషిస్తున్నారు. 2019 మార్చ్‌ నాటికి మొత్తం వాహనాల్లో కార్ల శాతం 17.16కు చేరగా... ద్విచక్ర వాహనాల వాటా 72.99 శాతానికి తగ్గింది. వ్యక్తిగత వాహనాల సంఖ్యను తగ్గించడానికి ప్రభుత్వం ఒకే పేరుతో రెండో వాహనం కొంటే అధిక పన్ను అంశాన్ని అమలు చేస్తోంది. అయితే ఇది కేవలం కొత్త వాహనాలకు మాత్రమే వర్తించడం, పేర్ల మార్పిడి, వేరే వ్యక్తుల పేర్లతో ఖరీదు చేయడం వంటి లోపాల కారణంగా ఇది ఫలితాలు ఇవ్వలేదు. 

ఇలా కొనసాగితే తిప్పలే...
రాజధానిలో వాహనాలు పెరుగుతున్న స్థాయిలో కాకపోయినా కనీస స్థాయిలోనూ రోడ్ల విస్తీర్ణం పెరగట్లేదు. ఫ్లైఓవర్లు వంటి కొత్త మార్గాల ఏర్పాటు, ఉన్న వాటి విస్తరణ జరగట్లేదు. మరోపక్క మెట్రోరైల్‌ అందుబాటులోకి వచ్చినా లాస్ట్‌ మైల్‌ కనెక్టివిటీ లేని కారణంగా పూర్తి స్థాయిలో ఫలితాలు అందట్లేదు. ఈ పరిణామాల నేపథ్యంలో తేలికపాటి వాహనాల పెరుగుదలలో ఇదే ధోరణి కొనసాగితే భవిష్యత్తులో మరిన్ని ట్రాఫిక్‌ ఇబ్బందులు తప్పవని ట్రాఫిక్‌ విభాగం అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇదే విషయాన్ని గతంలో శాసనసభ ఎస్టిమేట్స్‌ కమిటీకి నివేదించామని వివరిస్తున్నారు. దీనికి అడ్డుకట్ట వేయడానికి ప్రభుత్వమే అవసరమైన చర్యలు తీసుకోవాలని అప్పట్లో కోరామంటున్నారు.

ప్రజారవాణా వ్యవస్థ సక్రమంగా లేకపోవడమే ఈ ధోరణికి కారణమని నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. నగర జనాభాకు చాలినంత స్థాయిలో ఆర్టీసీ బస్సులు లేకపోవడం, మెట్రోరైల్‌ వంటివి ఇంకా పూర్తిస్థాయిలో రాకపోవడం వంటి కారణాల వల్లే అనేక మంది వ్యక్తిగత వాహనాలపై ఆధారపడుతున్నారని చెప్తున్నారు. వీటిని అభివృద్ధి చేస్తే ఈ స్థాయిలో పెరుగుదల ఉండదని స్పష్టం చేస్తున్నారు. సింగపూర్‌ సహా మరికొన్ని దేశాల్లో ప్రస్తుతం కార్ల రీ–ప్లేస్‌మెంట్‌ విధానం అమలులో ఉంది. దీని ప్రకారం కొత్త ప్రత్యేక పరిస్థితుల్లో మినహా ఎవరైనా కారు కొనాలంటే పాతది స్కాప్ర్‌ చేయాల్సి ఉంటుంది. ఇలాంటి వాటితో పాటు కార్‌ పూలింగ్‌ వంటివి పక్కాగా అమలైతేనే ఈ సమస్యకు ఓ పరిష్కారం ఉంటుందని చెప్తున్నారు. కుటుంబానికి ఒకే కారు వంటి కఠిన విధానాలు అమలు చేయాల్సి ఉంటుందని సూచిస్తున్నారు. 

మరిన్ని వార్తలు