విజయవాడకు షి‘కారు’

22 Feb, 2018 00:38 IST|Sakshi
ఎల్‌బీ నగర్‌ చౌరస్తా వద్ద విజయవాడకు వెళ్లే కారు ఎక్కుతున్న ప్రయాణికులు

     మూడున్నర గంటలు.. రూ.500 చార్జి

     హైదరాబాద్‌–విజయవాడ మధ్య దూసుకుపోతున్న కార్లు 

     ప్రైవేటు బస్సుల తరహాలో స్టేజీ క్యారియర్ల అవతారం 

     దిల్‌సుఖ్‌నగర్, ఎల్‌బీనగర్‌ నుంచి ప్రయాణికుల రవాణా 

     నెల రోజుల నుంచి మొదలైన దందా 

హైదరాబాద్‌ నుంచి విజయవాడ.. 250 కిలోమీటర్ల దూరం.. బస్సులో వెళ్తే 6 గంటల ప్రయాణం. అమరావతి, గరుడ ప్లస్‌ వంటి ఆర్టీసీ ఏసీ బస్సుల్లో అయితే ఐదు గంటల్లో గమ్యం చేరవచ్చు. వీటికి రూ.580 వరకు టికెట్‌ ధర భరించాల్సి ఉంటుంది. మరి అదే ఏసీ ప్రయాణం, కేవలం మూడున్నర గంటల్లోనే గమ్యం చేరే అవకాశం, ప్రయాణ ఖర్చు రూ.500 మాత్రమే అయితే..! 

సాక్షి, హైదరాబాద్‌: ప్రైవేటు బస్సులను మించిన ట్రావెల్‌ దందా మొదలైంది. కార్లు స్టేజీ క్యారియర్లుగా అవతారమెత్తాయి. హైదరాబాద్‌–విజయవాడ మధ్య ప్రయాణికులను తరలిస్తున్నాయి. గరు డ ప్లస్, అమరావతి వంటి ఏసీ బస్సుల కంటే వేగంగా గమ్యం చేరటంతోపాటు, తక్కువ ధర కావటంతో ప్రయాణికులు వాటికే ఎగబడుతున్నారు. దీంతో తవేరా, ఇన్నోవా, ఫార్చునర్‌ వంటి కార్లకు విపరీతమైన డిమాండ్‌ ఏర్పడింది. కొందరు వాహన యజమానులు సిండికేట్‌గా మారి సిబ్బందిని నియమించి ప్రయాణికులను వాటిలోకి ఎక్కేలా చేస్తున్నారు. నెల రోజులుగా ఈ తంతు జరుగుతున్నా రవాణా శాఖ కానీ ఆర్టీసీ కానీ దృష్టి సారించలేదు. 

మూడు గంటల్లోనే.. 
ఎంత తొందరగా ప్రయాణికులను గమ్యానికి చేరిస్తే.. ఆదరణ అంత ఎక్కువగా ఉంటుందన్న ఉద్దేశంతో కార్లలో ప్రయాణికులను ఎక్కించుకుని దూసుకుపోతున్నారు. అర్ధరాత్రి అయితే మూడు గంటల్లోనే గమ్యం చేరుస్తున్నా రు. దీంతో ప్రమాదాలు జరిగే అవకాశం ఉం దన్న ఆందోళన కలుగుతోంది. ఆర్టీసీ బస్సుల కు రావాల్సిన ప్రయాణికులు వీటికి మళ్లుతుండటంతో రవాణా శాఖ భారీగా నష్టపోతోంది. గతంలో ప్రైవేటు బస్సుల వల్ల నష్టం జరుగుతోందని గగ్గోలు పెట్టిన ఆర్టీసీకి ఇప్పుడు వీటి రూపంలో మరో ప్రమాదం ముంచుకొచ్చింది. 

ఉదయం అటు.. మధ్యాహ్నం ఇటు
ఉదయం ఏడు గంటల నుంచి కార్ల హవా మొదలవుతోంది. ఉదయం వేళ ఎక్కువగా హైదరాబాద్‌ నుంచి విజయవాడకు వెళ్లే వాహనాలు, మధ్యాహ్నం తర్వాత తిరిగి విజయవాడ నుంచి బయలుదేరుతున్నాయి. మూడు వరసల సీట్లు ఉండే ఈ కార్లలో ఏడు నుంచి ఎనిమిది మందిని ఎక్కించుకుంటున్నారు. దిల్‌ సుఖ్‌నగర్, ఎల్‌బీ నగర్ల నుంచి ఇవి మొదలవుతున్నాయి. ముందస్తు సీటు రిజర్వు చేసుకునే అవసరం లేకపోవటం, రోడ్డు మీదకు రాగానే సిద్ధంగా ఉంటుండటంతో ప్రీమియం కేటగిరీ బస్సుల్లో ఎక్కే ప్రయాణికులు వీటివైపు మొగ్గు చూపుతున్నారు. ఉదయం విజయవాడకు వెళ్లి పని చూసుకుని తిరిగి సాయంత్రం హైదరాబాద్‌కు వచ్చేవారు ముందే వాహనంలో సీటు రిజర్వు చేసుకునే వెసులుబాటు కూడా వీటిలో కల్పిస్తున్నారు. గతంలో హైదరాబాద్‌లో ట్రావెల్స్‌లో తమ వాహనాన్ని ఉంచిన కొంతమంది సిండికేట్‌గా మారి ఈ దందా ప్రారంభించారు. దీంతో వారి మధ్య మంచి అవగాహన ఉంది. ఏ కారు ఎక్కడుందనే సమాచారం వారి మధ్య ఉంటోంది. ఉదయం తన కారులో వచ్చిన వారు తిరిగి విజయవాడలో బయలుదేరేప్పు డు ఏ కారులో వెళ్లవచ్చో ఆ డ్రైవరే చెబుతు న్నాడు. సంబంధిత కారు డ్రైవర్‌ ఫోన్‌ నంబర్‌ కూడా ఇస్తుండటంతో పని సులువవుతోంది. 

దృష్టి సారించని రవాణా శాఖ 
ఆర్టీసీ మినహా మిగతా ప్రైవేటు వాహనాలేవీ స్టేజీ క్యారియర్లుగా తిరగకూడదని పేర్కొనే రవాణా శాఖ అధికారులు ఇప్పటి వరకు వీటిపై దృష్టి సారించలేదు. నిబంధనలకు విరుద్ధంగా తిరుగుతున్న అరుణాచల్‌ప్రదేశ్‌ బస్సులను ఇటీవల నియంత్రించి చివరకు ప్రభుత్వ ఆదేశంతో వాటికి స్వేచ్ఛనివ్వటం తెలిసిందే. ఇప్పుడు వాటికి తోడుగా నిబంధనలకు విరుద్ధంగా తిరుగుతున్న కార్లు కొత్త సమస్యను తెచ్చిపెట్టాయి. వేగంగా దూసుకుపోతుండటంతో ప్రమాదాలు జరిగే అవకాశమే ఎక్కువ ఆందోళన కలిగిస్తోంది. వీటి వల్ల ఆర్టీసీ భారీగా నష్టపోతుందని, దీనిపై ఉన్నతాధికారులు దృష్టి సారించాల్సిన అవసరం ఉందని ఓ డిపో మేనేజర్‌ వ్యాఖ్యానించారు. ‘నెల రోజులుగా ఈ కార్ల హవా పెరిగిందని సిబ్బంది నుంచి సమాచారం అం దింది. వాటిని నియంత్రించేందుకు చర్యలు తీసుకోవాల్సి ఉంది. ఈ విషయాన్ని ఉన్నతాధికారులకు విన్నవిస్తున్నాం’ అని విజయవాడకు ఎక్కువగా ప్రీమియం కేటగిరీ బస్సులు తిప్పే డిపో మేనేజర్‌ తెలిపారు.  

గంటకు 12 నుంచి 15 కార్లు 
దిల్‌సుఖ్‌నగర్, ఎల్‌బీనగర్, అటు విజయవాడలోని ప్రధాన ప్రాంతాల్లో ఈ కార్లను వరుస ప్రకారం నియంత్రించేందుకు కొందరు సిబ్బందిని కూడా నియోగించారు. ఆ సిబ్బంది ముందు వచ్చిన కారులో ప్రయాణికులను ఎక్కించిన తర్వాత వెనక కారుకు మళ్లిస్తారు. బస్సు కోసం వేచి చూసే ప్రయాణికుల వద్దకు వెళ్లి ఏసీ కార్లు అందుబాటులో ఉన్నాయని, ఆర్టీసీ బస్‌ చార్జి కంటే తక్కువ ధరకే సిద్ధమని, గంటన్నర ముందే గమ్యం చేరుకోవచ్చంటూ ప్రయాణికులను మళ్లిస్తున్నారు. గంటకు 12 నుంచి 15 వరకు కార్లు వరస కడుతున్నాయి. 

మరిన్ని వార్తలు