సీఏలను ఫైనాన్స్‌ అడ్వైజర్లుగా పిలవాలి

3 Sep, 2018 02:32 IST|Sakshi

హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ నాగార్జునరెడ్డి  

హైదరాబాద్‌: చార్టెడ్‌ అకౌంటెంట్ల(సీఏ)ను అకౌంటెంట్లుగా కాదు ఫైనాన్స్‌ అడ్వైజర్లుగా పిలవాలని, అందుకు అవసరమైతే చట్టంలో మార్పులు చేయాల్సిన అవసరం ఉందని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ సి.వి.నాగార్జునరెడ్డి అన్నారు.  ఆదివారం హైదరాబాద్‌లోని నానక్‌రాంగూడ ఫైనాన్షియల్‌ డిస్ట్రిక్ట్‌ ప్రాంతంలోని ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ చార్టెడ్‌ అకౌంటెంట్స్‌ ఆఫ్‌ ఇండియా ఎక్స్‌లెన్స్‌ సెంటర్‌లో ఐసీఏఐ 2018–19 స్నాతకోత్సవాన్ని ఆయన ప్రారంభించారు. అనంతరం సీఏ కోర్సులు పూర్తి చేసిన 1,026 మంది విద్యార్థులకు సర్టిఫికెట్లను ప్రదానం చేశారు.

ఈ సందర్భంగా నాగార్జునరెడ్డి మాట్లాడుతూ.. 1949 చట్టంలోని సెక్షన్‌ 7లో సీఏలను ఫైనాన్షియల్‌ అడ్వైజర్లుగా మార్చేందుకు ఐసీఏఐ కృషి చేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. విలువలు, చట్టానికి అనుబంధం ఉంటుందని, విలువలతో కూడిన వృత్తిలో కొనసాగాలని విద్యార్థులకు సూచించారు. కష్టపడేతత్వం అలవర్చుకుని ముందుకు సాగితే ఎలాంటి విజయాన్ని అయినా సాధించగలరని చెప్పారు.

దేశహితం, భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకొని సూచనలు, సలహాలు సీఏలు ఇవ్వాల్సిన అవసరాన్ని గుర్తించాలన్నారు. ఐసీఏఐ మాజీ అధ్యక్షుడు ఎం.దేవరాజ్‌రెడ్డి మాట్లాడుతూ ప్రతీ సీఏ 50 శాతం విలువలకు ప్రాధాన్యత ఇస్తూ, మరో 50 శాతం నైపుణ్యాన్ని అప్‌డేట్‌ చేసుకుంటేనే బంగారు భవిష్యత్‌ ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఐఆర్‌సీ మాజీ అధ్యక్షుడు వెంకటేశ్వరరావు, ఫల్గుణకుమార్, సీఎస్‌.శ్రీనివాస్, ఐసీఏఐ ప్రతినిధులు చెంగల్‌రెడ్డి, మస్తాన్, లక్ష్మీనాథ్‌ శర్మ, రితేష్, రాంచంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు