అక్బరుద్దీన్ ఒవైసీపై కేసు నమోదు

2 Aug, 2019 20:05 IST|Sakshi

సాక్షి,  కరీంనగర్: ఎంఐఎం శాసనసభాపక్ష నేత అక్బరుద్దీన్ ఒవైసీపై కరీంనగర్ త్రీ టౌన్ పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదయింది. కోర్టు ఆదేశాలతో ఆయనపై సీఆర్‌పీసీ 153ఏ, 153బీ, 506, 156(3) సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు కరీంనగర్‌ సీఐ విజయ్ కుమార్ తెలిపారు. కాగా జూలై 24న కరీంనగర్‌లో పార్టీ కార్యకర్తల సమావేశంలో ఒవైసీ మాట్లాడుతూ.. వివాదాస్పద రీతిలో వ్యాఖ్యలు చేశారని ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఆయనపై కేసు నమోదు చేయాలని బీజేపీ నేతలు పలువురు పెద్ద ఎత్తున ఆందోళనలు, డిమాండ్‌ చేశారు. అయితే  అక్బరుద్దీన్ ప్రసంగం రెచ్చగొట్టేలా లేదని వారం రోజుల క్రితం నగర సీపీ కమలాసన్‌ రెడ్డి క్లీన్ చిట్ ఇచ్చారు. 

సీపీ నిర్ణయాన్ని సవాలు చేస్తూ.. బీజేపీ నగర అధ్యక్షుడు, న్యాయవాది  బేతి మహేందర్ రెడ్డి కోర్టును ఆశ్రయించారు. ఒవైసీ వ్యాఖ్యలపై కేసు నమోదు చేయాలని ఆయన కోర్టును కోరారు. దీంతో  ఆయన పిటిషన్‌ను పరిశీలించిన కరీంనగర్ జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ సాయిసుధ ఘటనపై విచారణ జరపాలని పోలీసులను ఆదేశించారు. కోర్టు ఆదేశంతో క్రైమ్ నంబర్ 182/2019 ఎఫ్ఐఆర్ నమోదు చేసి విచారణ చేపట్టినట్టు త్రీటౌన్ పోలీసులు తెలిపారు. కాగా ఒవైసీ వ్యవహారం గతకొంత కాలంగా చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే. బీజేపీని కించపరిచే విధంగా, ముస్లింలను రెచ్చగొట్టేలా ఆయన మాట్లాడారని కమళం పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా  ఆయనపై కేసు నమోదు కావడం ఆసక్తికరంగా మారింది. 

మరిన్ని వార్తలు