మహిళా ఎంపీపీ వివాదం: ఎమ్మెల్యేపై కేసు నమోదు

23 May, 2020 19:28 IST|Sakshi

సాక్షి, రంగారెడ్డి : మండల పరిధిలోని నందివనపర్తిలో నిర్వహించిన ఫార్మాసిటీ రోడ్డు విస్తరణ భూమిపూజ కార్యక్రమంలో ప్రొటోకాల్‌ రగడ వివాదంగా మారింది. రూ.77 కోట్లతో యాచారం– మీరాఖాన్‌పేట, నందివనపర్తి– నక్కర్తమేడిపల్లి గ్రామాల మధ్యన చేపట్టే ఈ పనులకు గురువారం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి భూమిపూజ చేస్తుండగా, తనకు అధికారులు ముందస్తు సమాచారం ఇవ్వలేదని స్థానిక ఎంపీపీ కొప్పు సుకన్య పనులను అడ్డుకోబోయారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే, ఎంపీపీల మధ్యన మాటల యుద్ధం జరుగుతుండగా పోలీసులు కలగజేసుకొని ఎంపీపీని అక్కడి నుంచి లాగేశారు.
ఈ క్రమంలోనే ఏసీపీ యాదగిరిరెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు వారిని అడ్డుకోగా, తోపులాటలో ఎంపీపీ తీవ్రంగా గాయపడ్డారు. దీంతో తనపై దురుసుగా వ్యవహరించారని, దళితులంటూ దూషించారని ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆమె ఫిర్యాదు మేరకు ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డిపై యాచారం పోలీసులు శనివారం కేసు నమోదు చేశారు. ఐపీసీ సెక్షన్‌ 509, 323, ఎస్సీ, ఎస్టీ యాక్ట్‌ కింద పోలీసులు కేసు రిజిస్టర్‌ చేశారు. కాగా మంచిరెడ్డి తీరును నిరశిస్తూ.. యాచారంలోని అంబేడ్కర్‌ చౌరస్తాలో బీజేపీ, కాంగ్రెస్‌ శ్రేణులతో కలిసి ఎంపీపీ సుకన్య నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడుతూ.. ప్రొటోకాల్‌ విషయంలో స్పష్టత ఇవ్వాలని అడిగినందుకు ఎమ్మెల్యే మంచిరెడ్డి దళిత ఎంపీపీ అని అవమానపర్చే విధంగా వ్యవహరించడం సరికాదని ఆవేదన వ్యక్తం చేశారు. మండుటెండలో నిరసన తెలపడంతో సొమ్మసిల్లి పడిపోయిన ఎంపీపీని నగరంలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించారు.

ఎంపీపీని పరామర్శించిన బండి సంజయ్‌ 
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ గురువారం రాత్రి బీఎన్‌రెడ్డి నగర్‌లోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న యాచారం ఎంపీపీ కొప్పు సుకన్యను పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజలకు మద్దతుగా పోరాటాలు చేయాలని సూచించారు. ప్రొటోకాల్‌పె స్పష్టత అడిగితే దళిత ఎంపీపీని అవమానించి, పోలీసులచే దాడులు చేయిస్తారా అని ప్రశ్నించారు. మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన మంచిరెడ్డి కిషన్‌రెడ్డి ఇదేనా నీ సంస్కారం అని ప్రశ్నించారు. అభివృద్ధికి బీజేపీ అడ్డుకాదని, ప్రజా వ్యతిరేక విధానాలు అవలంభిస్తే చూస్తూ ఊరుకోమన్నారు. 

మరిన్ని వార్తలు