టీడీపీ ఎంపీ కంభంపాటిపై కేసు

17 Jul, 2018 01:18 IST|Sakshi

అనుమతుల్లేకుండా కార్ల సర్వీసింగ్‌ సెంటర్‌ నిర్వహణ

శబ్ద, వాయు కాలుష్యంతో స్థానికులు ఇబ్బంది

హైదరాబాద్‌: కాలుష్య నియంత్రణ మండలి(పీసీబీ), జీహెచ్‌ఎంసీ నుంచి ఎలాంటి అనుమతులు లేకుండా నివాస ప్రాంతాల్లో కార్ల సర్వీస్‌ సెంటర్‌ నిర్వహిస్తూ స్థానికులకు తీవ్ర అసౌకర్యాన్ని కలిగిస్తున్న తెలుగుదేశం పార్టీ ఎంపీ, శ్రీజయలక్ష్మి ఆటోమోటివ్స్‌ ఎండీ కంభంపాటి రామ్మోహన్‌రావుపై బంజారాహిల్స్‌ పోలీసు స్టేషన్‌లో కేసు నమోదైంది.

అక్రమ పార్కింగ్‌లు, అక్రమ డీజిల్‌ నిల్వలతో కంభంపాటి రామ్మోహన్‌రావు తమకు న్యూసెన్స్‌ను కలిగిస్తున్నారంటూ బంజారాహిల్స్‌ రోడ్‌ నంబర్‌ 14లోని తోటంబంజారా అపార్ట్‌మెంట్‌ వాసులతో పాటుగా స్థానికులు చేసిన ఫిర్యాదు మేరకు ఆయనపై ఐపీసీ సెక్షన్‌ 278, 336 కింద పోలీసులు కేసు నమోదు చేశారు.  

ఐస్‌ ఫ్రూట్‌ ఫ్యాక్టరీ పేరుతో అనుమతులు
బంజారాహిల్స్‌ రోడ్‌ నంబర్‌ 14లోని భాగ్యనగర్‌ స్టూడియోస్‌ ఆవరణలో రామ్మోహన్‌రావు ఐస్‌ఫ్రూట్‌ ఫ్యాక్టరీ అండ్‌ మిషిన్‌ పేరుతో జీహెచ్‌ఎంసీ నుంచి ట్రేడ్‌ లైసెన్స్‌ తీసుకుని లక్ష్మీ హుందయ్‌ పేరుతో నిబంధనలకు విరుద్ధంగా కార్‌ షెడ్, వర్క్‌షాప్, సర్వీస్‌ సెంటర్‌ను నడిపిస్తున్నట్లు స్థానికులు ఫిర్యాదులో పేర్కొన్నారు. కార్లకు డెంటింగ్, పెయింటింగ్‌తో పాటు ఇతర మిషనరీ పనులు చేస్తుండటంతో వాయు, శబ్ద కాలుష్యంతో తామంతా ఇబ్బందులు పడుతున్నట్లు తెలిపారు.

వృద్ధులు బ్రాంకైటిస్, ఆస్తమా వ్యాధులకు గురవుతున్నారన్నారు. ఇక్కడ ఖాళీ స్థలాన్ని వినియోగించుకుంటూ రోడ్డు పక్కన అక్రమ పార్కింగ్‌లు కూడా చేస్తున్నారని తెలిపారు. ఇక్కడే డీఏవీ స్కూల్‌ కూడా ఉందని, తరచూ కార్ల రాకపోకలు, అక్రమ పార్కింగ్‌లతో విద్యార్థులు కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. సర్వీస్‌ సెంటర్‌ నిర్వహణకు కాలుష్య నియంత్రణ మండలి అనుమతి ఉండాలని, ఈ మేరకు పీసీబీకి కూడా ఫిర్యాదు చేశామన్నారు.

ఐస్‌ఫ్రూట్‌ ఫ్యాక్టరీ పేరుతో ట్రేడ్‌ లైసెన్స్‌ మాత్రమే కలిగి ఉన్న ఆయన కారు షెడ్, సర్వీస్‌ సెంటర్‌కు మాత్రం ఎలాంటి పన్నులు చెల్లించడం లేదని, దీనివల్ల ప్రభుత్వం ఖజానాకు భారీగా నష్టం వస్తోందన్నారు. ఇక్కడి గోడౌన్‌లో 40 వరకు ఇంజిన్‌ ఆయిల్‌ డ్రమ్ములు నిల్వ చేయడంతో పాటుగా పెద్ద ఎత్తున సామగ్రి నింపారని, దీనివల్ల నివాసిత ప్రాంతంలో ప్రశాంతత కరువైందన్నారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని వార్తలు