పెళ్లి చేసుకోలేనన్న ఎస్‌ఐపై 420 కేసు

3 Mar, 2017 20:37 IST|Sakshi
పెళ్లి చేసుకోలేనన్న ఎస్‌ఐపై 420 కేసు

చౌటుప్పల్‌ : అతనో ఎస్‌ఐ.. పెళ్లి చేసుకుంటానని సంబంధం కుదుర్చుకున్నాడు. ఎస్‌ఐగా విధులు నిర్వహిస్తున్నానని చెప్పి రూ.20లక్షల కట్నం మాట్లాడుకున్నాడు. నిశ్చితార్థం కూడా చేసుకున్నాడు. ఇంతవరకు బాగానే ఉన్నా పెళ్లికి ముహుర్తాలు పెట్టుకుందామని అమ్మాయి తరఫున కుటుంబ సభ్యులు అడిగితే ఒక్కసారిగా మాట మార్చాడు. ఎన్నిసార్లు చెప్పిచూసినా తీరు మార్చుకోలేదు. విసిగివేసారిన అమ్మాయి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

ఈమేరకు చౌటుప్పల్‌ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. సీఐ నవీన్‌కుమార్‌ శుక్రవారం రాత్రి వివరాలు వెల్లడించారు. నల్లగొండ జిల్లా నాగార్జునసాగర్‌కు చెందిన మహంకాళి ప్రకాశ్‌(30) సికిందరాబాద్‌ పరిధిలోని అల్వాల్‌ ట్రాఫిక్‌ పోలీస్‌స్టేషన్‌లో ఎస్‌ఐగా విధులు నిర్వహిస్తున్నాడు. అవివాహితుడైన ఇతను గత ఏడాది డిసెంబర్‌ 1న మండలంలోని తాళ్లసింగారం గ్రామానికి చెందిన సుక్క ముత్యాలు కుమార్తె స్వప్న (22)తో పెళ్లిచూపులు ఏర్పాటుచేశారు. అమ్మాయిని నచ్చి అంగీకారం తెలపడంతో రెండు కుటుంబాలవారు కట్న కానుకలు మాట్లాడుకున్నారు. రూ.20లక్షల నగదు ఇచ్చేందుకు అమ్మాయి తండ్రి ఒప్పుకున్నాడు.

ఫిబ్రవరి లేదా మార్చి నెలలో పెళ్లి జరిపించేందుకు ఇరువైపులా పెద్దలు నిర్ణయించారు. అంతా సాఫీగా జరుగుతుందని భావించిన సమయంలో ఎస్‌ఐ ఒక్కసారిగా ప్లేటు ఫిరాయించాడు. తాను ఆమెను పెళ్లి చేసుకోలేనని కబురు పంపాడు. ఎందుకని వివరణ కోరగా పొంతనలేని సమాధానాలు చెప్పసాగాడు. తన అక్కచెల్లెల్లకు నచ్చలేదని కొద్దిరోజులపాటు, అమ్మాయి ప్రవర్తన సరిగా లేదనే సాకుతో మరికొన్ని రోజులపాటు కాలం గడిపాడు. బంధువులతో సర్ధి చెప్పించే ప్రయత్నం చేసినా బుద్ది మార్చుకోలేదు. అదేక్రమంలో ఇటీవల పోలీసులతో కౌన్సిలింగ్‌ ఇప్పించాలని ప్రయత్నించారు. అయినా ఆ ఎస్‌ఐ అదేతీరుగా వ్యవరించడంతో విసిగివేసాగిన ఆ తండ్రి మరోమారు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు అతనిపై పోలీసులు 420 సెక్షన్‌ కింద కేసు నమోదు చేశారు.

మరిన్ని వార్తలు