నగదు రహితమే స్ఫూర్తి

13 Dec, 2016 01:31 IST|Sakshi
నగదు రహితమే స్ఫూర్తి

- ఈ తరహా లావాదేవీలను ప్రోత్సహించేందుకు చర్యలు
- ప్రజలు డిజిటల్‌ చెల్లింపులను అలవాటు చేసుకోవాలి
- వచ్చే బడ్జెట్లో కొత్త కలెక్టరేట్లకు నిధులు
- అధికారులతో సమీక్షలో ముఖ్యమంత్రి కేసీఆర్‌


సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహించేందుకు చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అధికారులను ఆదేశించారు. సిద్ధిపేట జిల్లాలోని ఇబ్రహీంపూర్‌ నగదు రహిత గ్రామంగా ఆదర్శంగా నిలిచిందని, సిద్ధిపేట అసెంబ్లీ నియోజకవర్గం కూడా త్వరలోనే ఈ ఘనత సాధిస్తుందని ముఖ్యమంత్రి చెప్పారు. ఇదే స్ఫూర్తితో తెలంగాణ అంతటా నగదు రహిత లావాదేవీలు జరగాలని సూచించారు. పెద్దనోట్ల రద్దుతో పాటు ఆర్థిక అంశాలపై కేంద్రం అమలు చేస్తున్న నిర్ణయాలకు అనుగుణంగా రాష్ట్రంలో అనుసరించాల్సిన వ్యూహంపై సోమవారం ప్రగతి భవన్‌లో ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు.

మంత్రి హరీశ్‌రావు, అధికారులు నర్సింగ్‌రావు, రామకృష్ణారావు, నవీన్‌ మిట్టల్‌ తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. పైలెట్‌ ప్రాజెక్టు అమలవుతున్న సిద్ధిపేట నియోజకవర్గంలో అవసరమైనన్ని స్వైపింగ్‌ మిషన్లు, ఏటీఎం కార్డులు అందుబాటులో ఉంచాలని ముఖ్యమంత్రి సూచించారు. నగదు రహిత లావాదేవీలు నిర్వహించే క్రమంలో తలెత్తే ఇబ్బందులు ఎప్పటికప్పుడు తెలుసుకోవాలని, వాటికి పరిష్కారాలు వెతకాలని అధికారులను ఆదేశించారు. ‘కరెన్సీ నిర్వహణ కేంద్రం పరిధిలోని అంశం. నగదు లావాదేవీలను కనిష్ఠ స్థాయికి తీసుకురావటం కేంద్రం ఉద్దేశమనిపిస్తోంది. కరెన్సీ కూడా పెద్ద మొత్తంలో అందుబాటులో లేదు. ఈ పరిస్థితిని ఎదుర్కునేందుకు ప్రజలు కూడా సిద్ధం కావాలి. నగదు రహిత లావాదేవీలు జరపాలి. మొబైల్‌ యాప్‌లు, ఏటీఎం కార్డులు, స్వైపింగ్‌ మిషన్లు వాడాలి.

ఆన్‌లైన్‌ చెల్లింపులు పెరగాలి. ప్రజలకు అవగాహన కల్పించే ప్రచార కార్యక్రమాలను అధికారులు రూపొందించాలి. బ్యాంకులు తమ సేవలను విస్తరించాలి. సర్వర్లను డెవలప్‌ చేసుకోవాలి. అధికారులు బ్యాంకర్లతో ఎప్పటికప్పుడు మాట్లాడి తగిన చర్యలు తీసుకోవాలి. ఇంటర్నెట్‌ సౌకర్యం లేకున్నా లావాదేవీలు నిర్వహించే మొబైల్‌ యాప్‌లు అందుబాటులోకి వచ్చాయి. ఈ సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రజలకు చేరవేయాలి..’ అని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.

రేపు జిల్లా కలెక్టర్ల సదస్సు..
‘అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలులో జిల్లా కలెక్టర్లు క్రియాశీలక పాత్ర పోషించాలి. అన్ని జిల్లా కేంద్రాల్లో ఇంటిగ్రేటేడ్‌ కలెక్టరేట్లు నిర్మించాలి. కొత్త జిల్లా కేంద్రాల్లో కలెక్టరేట్లు, పోలీస్‌ కార్యాలయాలు నిర్మించేందుకు స్థలా లు ఎంపిక చేయాలి. వచ్చే బడ్జెట్‌లో వీటికి నిధులు కేటాయిస్తాం. కొత్త జిల్లాల ఏర్పాటు తో పరిపాలనా విభాగాలు ప్రజలకు అందు బాటులోకి వచ్చాయి. వాటి ఫలితాలు ప్రజల కు దక్కాలి. బుధవారం జరిగే కలెక్టర్ల సదస్సులో కొత్త జిల్లాల ద్వారా ప్రజలకు కలిగే ప్రయోజనాలపై చర్చ జరుగుతుంది. కలెక్టర్లు, ఇతర అధికారులు అన్ని విషయాలపై సమగ్ర సమాచారంతో రావాలి. నగదు రహి త లావాదేవీల నిర్వహణకు తీసుకుంటున్న చర్యలతో పాటు ప్రభుత్వం అమలు చేస్తున్న మిషన్‌ భగీరథ, మిషన్‌ కాకతీయ, నీటి పారుదల ప్రాజెక్టులు, ఆసుపత్రుల నిర్వహణ, రెసిడెన్షియల్‌ స్కూళ్లు, హరితహారం, సాదా బైనామా తదితర అంశాలపై కలెక్టర్ల సమావేశంలో చర్చిద్దాం..’ అని సీఎం కేసీఆర్‌ అధికారులతో చెప్పారు.

మరిన్ని వార్తలు