శనిగరంలో ‘కులం వెలి’

21 Jul, 2019 12:08 IST|Sakshi
కుటుంబ సభ్యులతో నీలం సమ్మాలు

సభ్యత్వానికి రూ.50వేలు చెల్లించలేనని చెప్పడంతో పెద్దల తీర్పు

తహసీల్దార్‌ను ఆశ్రయించిన బాధిత కుటుంబ సభ్యులు

సాక్షి, నల్లబెల్లి (వరంగల్‌): కుల సంఘం పెద్దలు చెప్పిన తీర్పుకు కట్టుబడి ఉండకపోవడంతో ఆ కుటుంబాన్ని వెలివేశారు. మండలంలోని శనిగరం గ్రామంలో శనివారం ఇది వెలుగులోకి వచ్చింది. శనిగరం గ్రామానికి చెందిన నీలం సమ్మాలుకు గత మార్చిలో మత్స్య పారిశ్రామిక సహకారం సంఘం నుంచి టాటా ఎస్‌ వాహనాన్ని మంజూరు చేసింది. ఈ మేరకు ముదిరాజ్‌ కుల సంఘం పెద్ద మనుషులు బోయిని రాజు, నీలం సుధాకర్, డ్యాగల రమేష్, నీలం రవి, బోళ్ల రమేష్, దండు శ్రీనులు కుల సంఘానికి రూ.లక్ష ఇవ్వాలని డిమాండ్‌ చేయగా సమ్మాలు తిరస్కరించాడు.

దీంతో కొందరు వ్యక్తులు టాటా ఎస్‌ వాహనం టైర్లు ఎత్తుకపోయారు. ఈ మేరకు గత మార్చి 29వ తేదీన పోలీసులను ఆశ్రయించగా విచారణ చేశారు. గ్రామంలో మాట్లాడుకుంటామని ఇరువురు అంగీకరిస్తూ పోలీస్‌ స్టేషన్‌లోనే రాజీ కుదుర్చుకున్నారు. గ్రామంలో పంచాయతీ చేసిన కుల పెద్దలు సంఘానికి రూ.90 వేలు చెల్లించాలని తీర్మాణించారు. వారి తీర్మాణం మేరకు సమ్మాలు సంఘానికి రూ.90 వేలు చెల్లించారు. అయినా పోలీసులకు ఫిర్యాదు చేశాడనే కోపంతో ఏప్రిల్‌ 14వ తేదీన మరో సారి సమ్మాలు కుటుంబాన్ని కుల సంఘం సమావేశానికి పిలిపించి సంఘంలోని సభ్యత్వం రద్దు చేసినందున మళ్లీ కావాలంటే రూ.50 వేలు చెల్లించి, కుల భోజనం పెట్టాలని తీర్పునిచ్చారు.

అయితే బాధిత కుటుంబ సభ్యులు అంగకరించకపోవడంతో పెద్దలు సాంఘిక బహిష్కరణ చేశారని బాధిత కుటుంబ సభ్యులు ఆరోపించారు. ఈ విషయమై ఆయన శనివారం తహసీల్దార్‌ను ఆశ్రయించారు. ఇదే విషయమై మత్స్య పారిశ్రామిక సహకారం సంఘం అధ్యక్షుడు నీలం రవి మాట్లాడుతూ సబ్సిడీ వాహనాల కోసం చాలా మంది పోటీ పడడంతో సంఘానికి రూ.లక్ష ఇచ్చిన వారి దరఖాస్తునే సబ్సిడీ కోసం పంపించాలని తీర్మాణించామే తప్ప ఎవరి సభ్యత్వాలు రద్దు చేయలేదని తెలిపారు. 

మరిన్ని వార్తలు