ఆ అధికారం కలెక్టర్‌దే!

5 Mar, 2019 02:03 IST|Sakshi

కుల ధ్రువీకరణ పత్రం రద్దు 

అధికారం తహసీల్దార్‌కు లేదు: హైకోర్టు

సాక్షి, హైదరాబాద్‌: కుల ధ్రువీకరణ పత్రాన్ని రద్దు చేసే అధికారం తహసీల్దార్‌కు లేదని హైకోర్టు స్పష్టం చేసింది. జిల్లా కలెక్టర్‌కే ఆ అధికారం ఉం టుందని తేల్చిచెప్పింది. ఇదే సమయంలో తప్పు డు కుల ధ్రువీకరణ పత్రం ద్వారా కానిస్టేబుల్‌ ఉద్యోగం పొందిన వ్యక్తిపై చట్టప్రకారం క్రమశిక్షణ చర్యలు తీసుకోవచ్చని పోలీసులకు తెలిపింది. అయితే ఆ వ్యక్తి తప్పుడు కుల ధ్రువీకరణ పత్రాన్ని కలెక్టర్‌ రద్దు చేశాకే అతనిపై చర్యలు తీసుకోవచ్చని చెప్పింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్‌ అభినంద్‌ కుమార్‌ షావిలి ఇటీవల ఉత్తర్వులు జారీ చేశారు. మంచిర్యాల జిల్లా, శ్రీరాంపూర్‌ గ్రామానికి చెందిన ఎస్‌.అజయ్‌ చందర్‌ తాను బీసీ–బీ (గాండ్ల) కులానికి చెందిన వ్యక్తినంటూ 2013లో కానిస్టేబుల్‌ ఉద్యోగం సంపాదించాడు. దీనికి సంబంధించి కుల ధ్రువీకరణ పత్రం కూడా సమర్పించారు. అయితే అజయ్‌ గాండ్ల కులానికి చెందిన వ్యక్తి కాదని, అతను తప్పుడు కుల ధృవీకరణ పత్రం సమర్పించారంటూ స్పెషల్‌ బెటాలియన్‌ అధికారులకు ఫిర్యాదు అందింది. దీంతో ఆ అధికారులు అజయ్‌ చందర్‌ సమర్పించిన కుల ధ్రువీకరణ పత్రం అసలైందో.. కాదో.. తేల్చాలని నిర్మల్‌ మండల తహసీల్దార్‌ను ఆదేశించారు.

ఈ ఆదేశాల మేరకు విచారణ జరిపిన తహసీల్దార్, అజయ్‌ చందర్‌ గాండ్ల కులస్తుడు కాదని, అతను రెడ్డి గాండ్లకు చెందిన వ్యక్తిని తేల్చారు. రెడ్డి గాండ్ల కులం బీసీ–బీ కిందకు రాదని స్పష్టం చేశారు. ఆ మేరకు అధికారులకు తహసీల్దార్‌ ఈ జనవరి 9న నివేదిక సమర్పించారు. ఈ నివేదికను సవాల్‌ చేస్తూ అజయ్‌ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. పిటిషనర్‌ తరఫు న్యాయవాది కరుణాకర్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ, చట్ట నిబంధనల ప్రకా రం కుల ధ్రువీకరణ పత్రాన్ని రద్దు చేసే అధికారం జిల్లా కలెక్టర్‌కే ఉందన్నారు. పిటిషనర్‌ కుల ధ్రువీకరణ పత్రాన్ని కలెక్టర్‌ రద్దు చేయలేదని, అందువల్ల అతనిపై పోలీసు అధికారులు ఎటువంటి చర్యలు తీసుకోజాలరన్నారు. ప్రభుత్వ న్యాయ వాది వాదనలు వినిపిస్తూ, కుల ధ్రువీకరణ పత్రం రద్దు చేసే అధికారం కలెక్టర్‌కే ఉందన్న విషయాన్ని అంగీకరించారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి, తహసీల్దార్‌ ఇచ్చిన నివేదిక చెల్లదంటూ రద్దు చేశారు. అయితే జిల్లా కలెక్టర్‌ చట్ట ప్రకారం వ్యవహరించి, కుల ధ్రువీకరణ పత్రాన్ని రద్దు చేస్తే, తర్వాత పిటిషనర్‌పై క్రమశిక్షణ చర్యలు తీసుకోవచ్చని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు