వర్గీకరణపై ఢిల్లీకి అఖిలపక్షాన్ని తీసుకెళ్లాలి

30 Nov, 2014 03:07 IST|Sakshi
ఆస్పత్రిలో పొందుతున్న శ్రీనివాస్

* సీఎం కేసీఆర్‌కు ఎమ్మార్పీఎస్ విజ్ఞప్తి   
* మాదిగల ద్రోహి చంద్రబాబు   
* మంద కృష్ణను అరెస్టు చేయాలని డిమాండ్

 
 సాక్షి, హైదరాబాద్: ఎస్సీ వర్గీకరణపై అఖిలపక్షాన్ని ఢిల్లీ తీసుకెళ్లి పార్లమెంటులో బిల్లును ఆమోదింప చేయాలని ఎమ్మార్పీఎస్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు యాతాకుల భాస్కర్ సీఎం కేసీఆర్‌కు విజ్ఞప్తి చేశారు.  సచివాలయంలో శనివారం భాస్కర్ విలేకరులతో మాట్లాడారు. వర్గీకరణపై అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మా నంచేయడం అమోఘమన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా అక్కడి అసెంబ్లీలో ఇలాగే ఏకగ్రీవ తీర్మా నం చేయాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు మాది గలను వాడుకుని, మోసం చేశారని, ఆయన నమ్మక ద్రోహి అని విమర్శించారు. ఈ సమావేశంలో విద్యార్థి నాయకుడు వంగపల్లి శ్రీనివాస్, ఎమ్మార్పీఎస్ గౌరవాధ్యక్షుడు సండ్రపల్లి వెంకటయ్య, డాక్టర్ ఆదాం, దేవయ్య తదితరులు పాల్గొన్నారు.
 
 తీర్మానం.. తీర్పు ఉల్లంఘనే: మాలమహానాడు
 ఎస్సీలను వర్గీకరించాలంటూ తెలంగాణ ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేయడం సుప్రీంకోర్టు తీర్పును ఉల్లంఘించడమేనని మాలమహానాడు జాతీయ అధ్యక్షుడు కారెం శివాజీ ధ్వజమెత్తారు. ఈ అంశంపై చర్చించి రాష్ట్రవ్యాప్త ఉద్యమానికి శ్రీకారం చుట్టేం దుకు డిసెంబర్ 4న హైదరాబాద్‌లో మాలమహానా డు అత్యవసర రాష్ట్ర కార్యవర్గ సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు.
 
 దాడి పిరికి పందల చర్య: బీఎస్‌ఎఫ్
 మాదిగల హక్కుల కోసం పోరాడుతున్న ఎంఆర్‌పీఎస్ కో-ఆర్డీనేటర్ వంగపల్లి శ్రీనివాస్‌పై దాడి పిరికి పంద చర్య అని బీఎస్‌ఎఫ్ నేత వేల్పుల సంజయ్, విజయలు శనివారం అన్నారు.  దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. హబ్సిగూడ జయకృష్ణ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వంగపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ మాదిగల పేరు చెప్పుకుని ఎదిగిన మందకృష్ణ నేడు మాదిగలపై దాడి చేయించే స్థాయికి చేరడం ఆయన అంతిమ దశకు నిదర్శనమన్నారు.
 
 మందకృష్ణకు అంతిమ దశ...
 మాదిగల హక్కుల కోసం పోరాటాలు చేస్తున్న నాయకులపై దాడి చేయించడం కృష్ణ మాదిగ అంతిమ దశకు చేరుకున్నాడని అనడానికి నిదర్శనమని మేధావుల ఫోరం కన్వీనర్ డా.ఆడం హెచ్చరించారు.  
 
 మందకృష్ణపై హత్యా నేరం కేసు
 జడ్చర్ల: మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల హౌసింగ్ బోర్డు సమీపంలో శుక్రవారం రాత్రి వంగపల్లి శ్రీనివాస్‌పై జరిగిన హత్యాయత్నం ఘటనకు సంబంధించి మంద కృష్ణమాదిగపై హత్యానేరం కింద కేసు నమోదు చేసినట్లు సీఐ జంగయ్య తెలిపారు. ఘటనకు సంబంధించి మందకృష్ణతో పాటు ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షుడు జంగయ్య, నాయకులు కోళ్ల వెంకటేశ్, కోళ్ల శివ తదితరులపై కూడా ఈ కేసు నమోదు చేసినట్లు వివరించారు.

మరిన్ని వార్తలు