మూడు స్థానాల్లో.. అసమ్మతే

15 Sep, 2018 11:19 IST|Sakshi
ముత్తిరెడ్డికి టిక్కెట్‌ ఇవ్వొద్దని సిద్ధేశ్వరాల యంలో 101 కొబ్బరికాయలతో శ్రీరాములు

సాక్షి, జనగామ: శాసనసభ రద్దు.. అభ్యర్థుల ప్రకటన తర్వాత జోరు మీదున్న టీఆర్‌ఎస్‌ పార్టీకి అసమ్మతి నాయకులు బ్రేకులు వేస్తున్నారు. టీఆర్‌ఎస్‌ తరఫున టికెట్‌ ఆశించి భంగపడిన వారు పార్టీ ప్రకటించిన అభ్యర్థులను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ క్రమంలో గులాబీ పార్టీలో వర్గపోరు ముదురుతోంది.

ఎర్రబెల్లి సీటుకు తక్కళ్లపల్లి ఎసరు..
పాలకుర్తి నియోజకవర్గ టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా ఖరారైన ఎర్రబెల్లి దయాకర్‌రావు సీటుకు టీఆర్‌ఎస్‌ పార్టీ రాష్ట్ర కార్యదర్శి తక్కళ్లపల్లి రవీందర్‌రావు ఎసరు పెడుతున్నారు. 2009, 2014 ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ పార్టీ నుంచి టికెట్‌ ఆశించిన తక్కళ్లపల్లి సమీకరణలతో పోటీ నుంచి విరమించుకున్నారు. 2014 ఎన్నికల్లో టీడీపీ తరఫున పోటీ చేసి గెలుపొందిన ఎర్రబెల్లి దయాకర్‌రావు ఆ తర్వాత టీఆర్‌ఎస్‌లో చేరారు. ఇప్పుడు టీఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థిగా ఆయన ఖరారు కావడంతో రవీందర్‌రావు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈనెల 9వ తేదీన రవీందర్‌రావు జన్మదినాన్ని పురస్కరించుకుని పాలకుర్తిలో భారీ సమావేశం ఏర్పాటు చేశారు. పాలకుర్తి నుంచి పోటీ చేస్తానని ప్రకటించారు. తాజాగా దేవరుప్పుల మండల కేంద్రంలో విలేకరుల సమావేశం పెట్టి దయాకర్‌రావు తూర్పు నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని కోరారు. రవీందర్‌రావు కామెంట్స్‌ నియోజకవర్గంలో రాజకీయ వేడిని పెంచుతున్నాయి.

ప్రచారానికి శ్రీకారం చుట్టిన ప్రతాప్‌..
స్టేషన్‌ ఘన్‌పూర్‌లో మొదటి నుంచి ప్రత్యేకవర్గంగా కొనసాగుతున్న రాజారపు ప్రతాప్‌ ఏకంగా ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు. పార్టీ ప్రకటించిన తాటికొండ రాజయ్య అభ్యర్థిత్వాన్ని తీవ్రంగా వ్యతిరేస్తున్న ఆయన శుక్రవారం జిల్లా కేంద్రం నుంచి స్టేషన్‌ ఘన్‌పూర్‌ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. అవినీతిపరులు, రాసలీలులు నడిపే వ్యక్తి మనకు వద్దంటూ ప్రకటించారు. స్టేషన్‌ ఘన్‌పూర్‌ అభ్యర్థిత్వంపై పార్టీ పునరాలోచన చేయాలని డిమాండ్‌ చేశారు. ప్రతాప్‌ నిర్వహించిన ర్యాలీ స్టేషన్‌ఘన్‌పూర్‌లో రాజకీయ వేడి పెంచింది.

ముత్తిరెడ్డికి అసమ్మతి సెగ..
జనగామ నియోజకవర్గం నుంచి టీఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థిగా ఖరారైన సిట్టింగ్‌ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డికి నియోజకవర్గంలో అసమ్మతి సెగ రాజుకుంటోంది. యువజన విభాగం రాష్ట్ర నాయకుడు గుడి వంశీధర్‌రెడ్డి అనుచరులు ముత్తిరెడ్డికి వ్యతిరేకంగా సమావేశం నిర్వహించి అసమ్మతి గళాన్ని వినిపించారు. నర్మెటకు చెందిన పీఏసీఎస్‌ చైర్మన్‌ ఇమ్మడి శ్రీనివాస్‌రెడ్డి, రాగమళ్ల పరమేష్, మండల శ్రీములు బహిరంగంగానే ముత్తిరెడ్డిని వ్యతిరేకిస్తున్నారు. టీఆర్‌ఎస్వీ ఉమ్మడి వరంగల్‌ జిల్లా అధ్యక్షుడు కందుకూరి ప్రభాకర్, వేముల లక్ష్మణ్‌ గౌడ్‌తోపాటు పలువురు వేరు కుంపటి పెట్టుకున్నారు.

మొదటి తరం తెలంగాణ ఉద్యమకారులను విస్మరించారని, ముత్తిరెడ్డి ఉద్యమకారులను ఎన్నో రకాలుగా ఇబ్బందులు పెట్టారని ఆరో పిస్తున్నారు. జనగామ ఎమ్మెల్యే అభ్యర్థిని మార్చాలని డిమాండ్‌ చేస్తున్నారు. ఇదిలా ఉండగా ముత్తిరెడ్డి అనుచరులు యూత్‌ విభాగం నాయకులు రెట్టింపు మెజార్టీతో గెలిస్తామని సవాల్‌ చేస్తున్నారు. అటు అసమ్మతి ఇటు ముత్తిరెడ్డి అనుచరు ల సవాల్‌ ప్రతిసవాళ్లతో జిల్లా కేంద్రంలో రాజ కీయ వేడి పెరిగింది. మూడు నియోజకవర్గాల్లోనూ టీఆర్‌ఎస్‌లో ఆధిపత్య పోరు సాగుతోంది.

మరిన్ని వార్తలు