క్యాథ్‌ల్యాబ్, ఎంఆర్‌ఐలకు సుస్తీ

30 Apr, 2018 01:42 IST|Sakshi

     ఉస్మానియాలో 20 రోజులుగా పనిచేయని ఎంఆర్‌ఐ 

     వారం రోజులుగా క్యాథ్‌ల్యాబ్‌ మూత 

     పట్టించుకోని నిర్వహణ సంస్థ 

సాక్షి, హైదరాబాద్‌: ‘చిత్రంలో కన్పిస్తున్న ఈమె పేరు తస్లిభాను. ఇటీవల ఈమె మెదడులో రక్తం గడ్డకట్టింది. చికిత్స కోసం ఉస్మానియాకు వచ్చింది. మెదడులో ఏర్పడ్డ రక్తం గడ్డలు ఏ మేరకు ఉన్నాయో నిర్ధారించేందుకు ఎంఆర్‌ఐ తీయించాల్సిందిగా సూచించారు. ఆస్పత్రిలో ఎంఆర్‌ఐ పని చేయడంలేదని, బయట చేయించుకుందామంటే తన వద్ద డబ్బులు లేవని ఆవేదన వ్యక్తం చేసింది. ఎంఆర్‌ఐ రిపోర్టు వచ్చే వరకు మందులు రాయనని వైద్యుడు చెప్పడంతో ఏం చేయాలో పాలుపోని స్థితిలో ఉంది’. 

ఉస్మానియా జనరల్‌ ఆస్పత్రిలో 20 రోజులుగా ఎం ఆర్‌ఐ మిషన్‌ పనిచేయడం లేదు. 2007లో దీన్ని ఏర్పాటు చేశారు. రోజంతా విరామం లేకుండా పనిచేయడంతో మిషన్‌లో తరచూ సాంకేతిక సమస్యలు తలెత్తుతున్నాయి. గతంలో ఆయా ఆస్పత్రులే వార్షిక నిర్వహణ కింద మరమ్మతులు చేయించుకునేవి. 6 మాసాల క్రితం టీఎస్‌ఎంఐడీసీ.. చెన్నైకి చెందిన ఓ సంస్థకు ఈ పనులను అప్పగించింది. పాత బకాయిలు చెల్లిస్తే కానీ యంత్రాలకు మరమ్మతులు చేయమని సదరు సంస్థ భీష్మించుకుని కూర్చుంది. చేసేది లేక చాలామంది రోగులు ప్రైవేటు డయాగ్నస్టిక్‌ సెంటర్లను ఆశ్రయించాల్సి వస్తోంది. ఒక్కో టెస్టుకు రూ.8 వేల నుంచి రూ.12 వేల వరకు చెల్లించుకోవాల్సి వస్తుంది.  

క్యాథ్‌ల్యాబ్‌ అంతే..: ఎంఆర్‌ఐతో పాటు హృద్రోగ విభాగంలో కీలకమైన క్యాథ్‌ ల్యాబ్‌ వారం రోజులుగా పని చేయడం లేదు. హృద్రోగ సమస్యతో బాధపడుతూ అత్యవసర పరిస్థితుల్లో  ఆస్పత్రికి చేరుకుంటున్న రోగులకు కనీస వైద్యసేవలు అందడం లేదు. రోజుకు సగటున 10 మందికి యాంజియోగ్రామ్‌ నిర్వహిస్తుంటారు. ప్రస్తుతం ఇక్కడ క్యాథ్‌ల్యాబ్‌ పనిచేయకపోవడంతో రోగులు ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఎం ఆర్‌ఐ సహా క్యాథ్‌ల్యాబ్‌ నిర్వహణ బాధ్యత కూడా సదరు సంస్థదే. నిజానికి క్యాథ్‌ల్యాబ్‌పై ఎలాంటి బకాయిలు లేవు. కానీ సదరు సంస్థ రిపేరు చేసేందుకు నిరాకరిస్తుంది. అత్యవసర పరిస్థితుల్లో రోగులను ఇతర ఆస్పత్రులకు సిఫార్సు చేసి చేతులు దులుపుకుంటున్నారు.

మరిన్ని వార్తలు