పశువుల గణన

20 Aug, 2018 13:03 IST|Sakshi
పశువులు

ఆదిలాబాద్‌టౌన్‌: జనాభా లెక్కల మాదిరిగానే పశుసంవర్ధక శాఖ పశు గణన కార్యక్రమాన్ని చేపడుతోంది. ప్రతీ ఐదేళ్లకోసారి పశువులను లెకిస్తోంది. గతంలో 2012 సంవత్సరంలో గణన చేపట్టగా.. 2017లో నిర్వహించాల్సి ఉంది. కానీ కేంద్రం ఒక సంవత్సరం ఆలస్యంగా నిర్వహిస్తోంది. దేశ వ్యాప్తంగా ఒకేసారి ఈ గణన కార్యక్రమం జరగనుంది. ఇప్పటికే జిల్లాకు చెందిన ఇద్దరు అధికారులకు హైదరాబాద్‌లో శిక్షణ ఇప్పించారు. వారు మండల స్థాయి పశువైద్యాధికారులు, ఎన్యుమరేటర్లకు ఇటీవల రెండు రోజులు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఎప్పటికప్పుడు వివరాలను ఆన్‌లైన్‌లో పొందుపర్చేందుకు ఎన్యుమరేట్లకు ట్యాబ్‌లను అందించనున్నారు. గతంలో మ్యానువల్‌(రికార్డు) పద్ధతిలో గణన జరగగా, ఈసారి డిజిటల్‌ పశుగణన చేపట్టనున్నారు.

20 నుంచి షురూ..
ఈ నెల 20 నుంచి పశు గణన కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. మూడు నెలలపాటు ఈ ప్రక్రియ కొనసాగనుంది. అప్పటిలోగా బాధ్యతలు అప్పగించిన అధికారులు పశువుల వివరాలను సేకరించాల్సి ఉంటుంది. జిల్లాలోని 18 మండలాలకు సంబంధించి ఒక్కో మండలానికి ముగ్గురు ఎన్యుమరేటర్ల చొప్పున 54 మందిని నియమించారు. వీరితోపాటు మండల పశువైద్యాధికారులు ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తారు. ఇంటింటికి వెళ్లి ఆవులు, గేదెలు, కోళ్లు, మేకలు, గొర్రెలు, కుక్కలు, ఇతర పశువుల వివరాలను రైతులు, పశుపోషకులను అడిగి నమోదు చేసుకుంటారు. రైతుల వద్ద వ్యవసాయ పరికరాలు ఎన్ని, ఏవేవనే వాటినీ నమోదు చేసుకుంటారు.


ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌..
డిజిటల్‌ పశు గణన కోసం ఈసారి ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ ఏర్పాటు చేశారు. ఈ సాఫ్ట్‌వేర్‌ ద్వారా ప్రతీ పశువుకు ఒక డిజిటల్‌ నంబర్‌ను ఇచ్చి అందులో యజమానితోపాటు పశువు వివరాలను పొందుపరుస్తారు. పశువులను అమ్మినా, కొనుగోలు చేసినా వెంటనే వివరాలు తెలిసే విధంగా సాఫ్ట్‌వేర్‌ ఉపయోగపడుతుందని అధికారులు పేర్కొంటున్నారు. ఇప్పటికే అడవుల్లో జీవించే వన్యప్రాణుల గణనను అటవీ శాఖాధికారులు చేపట్టారు.

20వ పశుగణన..
ప్రస్తుతం చేపట్టనున్న పశుగణన 20వది కానుంది. దేశంలో తొలిసారిగా 1919 సంవత్సరంలో ఈ గణనను చేపట్టారు. అప్పటినుంచి ఐదేళ్లకోసారి ప్రక్రియ కొనసాగుతూ వస్తోంది. గత సంవత్సరం జరగాల్సి ఉండగా ఒక సంవత్సరం ఆలస్యమైంది. ఇప్పటివరకు 19సార్లు పశుగణన పూర్తయ్యింది. ఈసారి గణన కార్యక్రమాన్ని చేపట్టేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. గత పశుగణనలో జిల్లాలో 9లక్షల 98వేల 609 పశువులు ఉన్నట్లు అధికారులు లెక్కించారు. ఈసారి దాదాపు 14 లక్షల వరకు వాటి సంఖ్య చేరుకోనుందని అంచనా వేస్తున్నారు. 

పకడ్బందీగా చేపడతాం..
జిల్లాలో పశుగణన కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహిస్తాం. ఈ నెల 20 నుంచి నవంబర్‌ మాసం వరకు కొనసాగనుంది. మండలానికి ముగ్గురు చొప్పున ఎన్యుమరేటర్లను నియమించాం. మూడు నెలల్లో పశువులన్నింటి వివరాలను ఆన్‌లైన్‌లో ట్యాబ్‌లా ద్వారా పొందుపర్చాల్సి ఉంటుంది. ఎన్యుమరేటర్లకు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించాం. – సురేష్, జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి  

మరిన్ని వార్తలు