పశుగ్రాసం లేక పరేషాన్‌!

13 May, 2019 09:11 IST|Sakshi

తాంసి(బోథ్‌): ఆరుగాలం రైతులకు వ్యవసాయంలో తోడ్పడే కాడెద్దులకు మేత కరువైంది. ఇంటా, బయట మేత లేక మూగజీవాలు అంబా అంటున్నాయి. కాడెద్దులకు పశుగ్రాసం దొరకకపోవడంతో రైతులు దిక్కుతోచని స్థితిలో కబేళాలకు అమ్ముకుంటున్నారు. కొందరు ఆర్థికభారమైన వేలకువేలు పెట్టి గడ్డి కొని పశువులను సాకుతున్నారు. జిల్లాలోని పశుసంపదకు సరిపడా పశుగ్రాసం దొరకడం లేదు. ఉన్న కొద్దిపాటి మేత కూడా ప్రియమైంది.

పశువులకు మేత కొనాలంటే రైతులకు తలకు మించిన భారమవుతోంది. వర్షాలు లేకపోవడంతో ఈ పరిస్థితి తలెత్తింది. పలు గ్రామాల్లో నీటిసౌకర్యం ఉన్న రైతులు గడ్డి, మొక్కజొన్న వంటివి సాగుచేసినా ఈ సంవత్సరం వర్షాలు సరిగా లేక పశువుల మేత కోసం వేసిన పంటలు కూడా ఎండిపోయాయి. దీంతో జిల్లాలో పశుగ్రాసం కొరత తీవ్రంగా ఏర్పడింది. రైతులకు ఆర్థిక భారమైనా ఒక్కో గడ్డి కట్టను రూ.15 నుంచి రూ.20 పెట్టి మేత కొనుగోలు చేస్తున్నారు. ఇక ట్రాక్టర్‌ గడ్డి ధర అయితే వేలల్లో ఉంది. దీనికి  రవాణా చార్జీలు అదనం.

దూర’భారం’
జిల్లాలోని తాంసి, తలమడుగు, భీంపూర్, బోథ్, నేరడిగొండ, ఇచ్చోడతోపాటు తదితర మండలాలకు చెందిన గ్రామాల రైతులు దూరభారమైనా నిర్మల్‌ జిల్లాతోపాటు చుట్టు పక్కల గ్రామాల నుంచి వరిగడ్డిని ఒక్కో ట్రాక్టర్‌ రూ.10 వేలు పెట్టి తీసుకొస్తున్నారు. ఈ ఏడాది జిల్లాలో రబీలో రైతులు 8వేల హెక్టార్లలో జొన్న, మొక్కజొన్నతోపాటు, 4 వేల హెక్టార్లలో వరి సాగు చేశారు. దీంతో జిల్లాలోని పశువులకు సరిపడ మేత లేక గడ్డి ధరలు ఆకాశాన్నంటాయి.

సాకలేక సంతకు తరలింపు 
జిల్లాలో ఏర్పడిన తీవ్ర పశుగ్రాసం కొరతతో రైతులు తమకున్న పశువులను సాకలేక సంతకు తరలించి కబేళాలకు అమ్ముకుంటున్నారు. పెంచుకున్న పశువులకు వేలకువేలు పెట్టి పశుగ్రాసం కొనలేకపోతున్నారు. అయినా పశుసంవర్ధక శాఖ ఎలాంటి ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టడం లేదు. రైతులకు సబ్సిడీ ద్వారా గడ్డి విత్తనాలతోపాటు, దాణా వంటివి ముందుగా పంపిణీ చేస్తే ఈ గోస తప్పేది.  

రైతులకు విత్తనాలు అందజేశాం
జిల్లాలో పశుగ్రాసం కొరత లేకుండా పశుసంవర్ధకశాఖ ఆధ్వర్యంలో 10 వేలమెట్రిక్‌ టన్నుల గడ్డి విత్తనాలను రైతులకు 75 శాతం సబ్సిడీపై అందజేశాం. త్వరలోనే రైతులకు అందించడానికి మరో 10 వేల మెట్రిక్‌ టన్నుల గడ్డి విత్తనాలకు ఆర్డర్‌ ఇచ్చాం.  ఇవి రాగానే 50 శాతం సబ్సిడీపై రైతులకు అందజేస్తాం. పశుగ్రాసం కొరత లేకుండా చర్యలు చేపడుతున్నాం. – సురేశ్,  జిల్లా పశుసంవర్ధకశాఖ అధికారి

మేత లేక ఎడ్లను అమ్మేశా..
నాకున్న 8 ఎకరాలను రెండు ఎడ్లతో సాగు చేసుకుంటున్నా. వర్షాలు లేక పశువులకు సరిపడా పశుగ్రాసం లేకపోవడంతో వాటిని పస్తులు ఉంచలేక..డబ్బులు పెట్టి గడ్డి కొనలేక ఆదిలాబాద్‌ సంతలో 15 రోజుల క్రితం రూ.45వేలకు ఎడ్లను అమ్మాల్సి వచ్చింది. – సురేందర్‌రెడ్డి, రైతు తాంసి 

సబ్సిడీపై పశుగ్రాసం అందించాలి
పశుగ్రాసం కొరత తీవ్రంగా ఉన్నందున ప్రభుత్వం రైతులకు సబ్సిడీపై పశుగ్రాసాన్ని అందించాలి. జిల్లాలో గడ్డి దొరకకపోవడంతో పక్కన ఉన్న మహారాష్ట్ర నుంచి తెచ్చుకుంటున్నాం. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో వర్షాకాలం వచ్చేంత వరకు పశుగ్రాసం దొరకని పరిస్థితి నెలకొంది. రైతులకు పశుగ్రాసంతోపాటు దాణా పంపిణీ చేయాలి. – విఠల్, యువరైతు, తాంసి

మరిన్ని వార్తలు