జూపల్లి వారసులపై సీబీ‘ఐ’

18 Apr, 2018 03:21 IST|Sakshi

     రిజిస్ట్రేషన్‌ విలువ అడ్డగోలుగా పెంచేసి బ్యాంకు నుంచి రుణాలు

     రూ.17 కోట్ల ఆస్తులు తనఖా పెట్టి రూ.86 కోట్ల రుణం

     కోర్టు వివాదాల్లోని భూమి కూడా తాకట్టు

     గతేడాది ఆగస్టులోనే జూపల్లి తనయుడుకి సీబీఐ నోటీసు  

సాక్షి, హైదరాబాద్‌: వారిద్దరూ మంత్రి కుమారులు. కోర్టు వివాదాల్లో ఉన్న భూములను తమ పలుకుబడితో రిజిస్ట్రేషన్లు చేయించుకున్నారు. కంపెనీలను ఏర్పాటు చేసి ఆ భూములను బ్యాంకుల్లో తనకా పెట్టారు. మార్కెట్‌ విలువ కన్నా నాలుగొంతులు అధిక విలువ చూపి నకిలీ డాక్యుమెంట్లు సృష్టించారు. వాటితో స్టేట్‌ ఆఫ్‌ ఇండి యా నుంచి కోట్ల రుణాలు తీసుకొని కంపెనీల్లోకి మళ్లించారు. రుణాలు చెల్లించకపోవడంతో తన ఖా పెట్టిన ఆస్తులను జప్తు చేసుకునేందుకు బ్యాం కు అధికారులు సిద్ధమయ్యారు. అప్పుడే అసలు కథ బయటపడింది. తనఖా పెట్టిన ఆస్తులకు, తీసుకున్న రుణాలకు పొంతన లేకపోవడంతో కుంభకోణం వెలుగులోకి వచ్చింది. మంత్రి జూపల్లి కృష్ణారావు కుమారుల ఈ ‘తనఖా’మాయాజాలంపై సీబీఐ రంగంలోకి దిగింది. 

అసలేం జరిగింది? 
మంత్రి జూపల్లి కుమారులు వరుణ్, అరుణ్‌ ఇద్దరూ వ్యాపార రంగంలో ఉన్నారు. 2011లో వారు శైలి ఇన్‌ఫ్రా లిమిటెడ్‌ పేరుతో ఓ కంపెనీ స్థాపించారు. దాన్ని 2015లో క్రిద్యా ఇన్‌ఫ్రా లిమిటెడ్‌ పేరు మీదకు మార్చారు. ఈ కంపెనీ తీసుకున్న బ్యాంకు రుణాలకు జూపల్లి అరుణ్, వాసిరెడ్డి కిరణ్‌రెడ్డి హమీదారులుగా ఉన్నారు. అరుణ్‌.. అమీర్‌పేట్‌లోని రాయల్‌ పెవిలియన్‌ అపార్ట్‌మెంట్‌లోని మూడు ఫ్లాట్లు, గండిపేట కిస్మత్‌పూర్‌లోని 3.2 ఎకరాల భూమి, గగన్‌పహాడ్‌లోని ఇల్లును తనఖా పెట్టి 2015 నాటికి ఎస్‌బీఐ నుంచి రూ.64.80 కోట్ల రుణం పొందారు.

వీటిని చెల్లించకపోవడంతో ఏడాదిన్నర క్రితం ఎస్‌బీఐ అరుణ్‌కు నోటీసులు ఇచ్చింది. 2016లో తనఖా పెట్టిన ఈ ఆస్తులను స్వాధీనం చేసుకునేందుకు ప్రకటన ఇచ్చింది. తనఖా పెట్టిన ఈ ఆస్తులను బ్యాంకు అధికారులు రిజిస్ట్రేషన్‌ విలువ ప్రకారం పరిశీలించగా రూ.7.75 కోట్లే ఉందని తేలింది. దీంతో బ్యాంకు అధికారులు నోరెళ్లబెట్టాల్సిన వచ్చింది. కంపెనీ కోసం తీసుకున్న రుణాలు వడ్డీతో కలిపి ఈ ఏడాది జనవరికల్లా రూ.86.30 కోట్లకు చేరింది. మార్కెట్‌ విలువలో గోల్‌మాల్‌ చేసి అరుణ్‌ బ్యాంకు రుణం పొందినట్టు అధికారులు ఆలస్యంగా గుర్తించారు. తనఖా పెట్టిన మొత్తం ఆస్తు ల విలువ ప్రస్తుత మార్కెట్‌ ప్రకారం రూ.17.79 కోట్లు ఉన్నట్టు అధికారులు చెబుతున్నారు. అంటే ఆస్తులను స్వాధీనం చేసుకున్నా బ్యాంకుకు రూ.68.50 కోట్ల నష్టం మిగలనుంది. 

గతేడాదే సీబీఐ నోటీసు 
బోగస్‌ పత్రాలతో కోట్లు రుణం పొందిన జూపల్లి వారసులపై సీబీఐ దృష్టి సారించింది. దీనిపై ప్రధాని కార్యాలయానికి ఇప్పటికే ఫిర్యాదు అంది నట్లు తెలిపింది. గత జూలై 28నే జూపల్లి అరుణ్‌కు దర్యాప్తు సంస్థ నోటీసులు జారీచేసింది. విచారణకు హాజరు కావాలంటూ గతేడాది ఆగస్టు 18న సీబీఐ డిప్యూటీ సూపరింటెండెంట్‌ సంజయ్‌ దూబే అరుణ్‌కు జారీ చేసిన నోటీసులో తెలిపారు. ఈ వ్యవహారం ఆలస్యంగా వెలుగులోకి రావడంతో జూపల్లి అనుచరులు, పార్టీ కార్యకర్తల్లో తీవ్ర చర్చ జరుగుతోంది. ప్రస్తుతం కేసు విచారణ దశలో ఉందని, పూర్తి వివరాలను వెల్లడించలేమని ఢిల్లీలోని సీబీఐ వర్గాలు తెలిపాయి.

ఇదీ మాయాజాలం.. 
సాధారణంగా ఎవరైనా భూములు కొన్న సందర్భంలో మార్కెట్‌ విలువ కన్నా రిజిస్ట్రేషన్‌ విలువ తక్కువగా చూపిస్తారు. కానీ జూపల్లి అరుణ్‌ మాత్రం రిజిస్ట్రేషన్‌ విలువను మార్కెట్‌ విలువ కన్నా అధికంగా చూపాడు. అదీగాకుండా తనఖా పెట్టిన ఆ భూమిపై హైకోర్టులో కేసు కూడా నడుస్తోంది. కిస్మత్‌పూర్‌లోని 3.27 ఎకరాల భూమి మార్కెట్‌ విలువ ప్రకారం రూ.78.48 లక్షలుంంటే.. అరుణ్‌ దాని రిజిస్ట్రేషన్‌ విలువను రూ.3.30 కోట్లుగా చూపాడు. అలాగే గగన్‌పహాడ్‌లోని ఇల్లు మార్కెట్‌ విలువ ప్రకారం రూ.1.93 కోట్లు ఉంటే రిజిస్ట్రేషన్‌లో రూ.2.5 కోట్లుగా చూపించారు. 

మరిన్ని వార్తలు