వీడని ‘ సీటు’ముడి

13 Nov, 2018 08:43 IST|Sakshi

మెదక్‌ టికెట్‌పై కూటమి కొత్త వ్యూహం!

టీజేఎస్‌ ముందు స్నేహపూర్వక పోటీకి ప్రతిపాదన!

కొనసాగుతున్న ఇరు పార్టీల చర్చలు

కాంగ్రెస్‌ నుంచి నామినేషన్‌ వేస్తానంటున్న శశిధర్‌రెడ్డి 

ఒప్పుకోమంటున్న టీజేఎస్‌ నాయకులు

ఒక పక్క సోమవారం నుంచి నామినేషన్ల దాఖలు పర్వం ప్రారంభమైంది. ఇంకా మెదక్‌ నియోజవర్గ టికెట్‌పై కూటమిలో చిక్కుముడి వీడటం లేదు. కాంగ్రెస్, టీజేఎస్‌ ఈ టికెట్‌ తమదంటే తమదని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ సమస్యను తొలగించడానికి స్నేహ పూర్వక పోటీ చేద్దామనే కొత్త ప్రతిపాదనను కాంగ్రెస్‌ పార్టీ, టీజేఎస్‌ ముందు ఉంచినట్లు తెలుస్తోంది. దీంతో కాంగ్రెస్‌ ఆశావహులు నామినేషన్‌కు ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు సమాచారం. టీజేఎస్‌ నాయకులు మాత్రం ఈ ప్రతిపాదనపై ఆసక్తి లేదన్నట్లు చెబుతున్నారు. దీంతో ఎవరికి ఈ టికెట్‌ వస్తుం దోనని ప్రజలు ఆసక్తిగా గమనిస్తున్నారు.    

సాక్షి, మెదక్‌:  ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదలైనా మెదక్‌ నియోజకవర్గ కాంగ్రెస్‌ టికెట్‌పై ప్రతిష్టంభన తొలగడంలేదు. ఈ  టికెట్‌ కోసం మొదటి నుంచి పట్టుబడుతున్న టీజేఎస్‌ సైతం మెట్టు దిగడం లేదు. దీంతో మధ్యేమార్గంగా మెదక్‌ అసెంబ్లీ నుంచి స్నేహ పూర్వక పోటీచేద్దామని కాంగ్రెస్‌ ప్రతిపాదిస్తున్నట్లు తెలుస్తోంది. దీనిపై ఇరు పార్టీలు చర్చలు సాగిస్తున్నట్లు సమాచారం. పొత్తులో భాగంగా కాంగ్రెస్‌ పార్టీ టీజేఎస్‌కు ఎనిమిది అసెంబ్లీ స్థానాలు ఇవ్వనుంది. టీజేఎస్‌కు కేటాయించిన 8 స్థానాల్లో  మెదక్‌ అసెంబ్లీ స్థానాన్ని కావాలని వారు కోరుతున్నారు. అయితే మెదక్‌ అసెంబ్లీ పరిధిలో కాంగ్రెస్‌ పార్టీకి బలమైన కేడర్‌ ఉండటం, ఇటీవల నిర్వహించిన వేర్వేరు సర్వేల్లో కాంగ్రెస్‌కు సానుకూల ఫలితాలు వచ్చినట్లు తెలుస్తోంది.

సర్వే ఫలితాలను దృష్టిలో ఉంచుకుని మెదక్‌ సీటు తమకు వదిలేయాని కాంగ్రెస్‌ పార్టీ టీజేఎస్‌ను కోరుతున్నట్లు సమాచారం. దీనికితోడు మెదక్‌ టికెట్‌పై కాంగ్రెస్‌ నేతలు భారీగా ఆశలు పెట్టుకున్న విషయం తెలిసిందే. మాజీ ఎమ్మెల్యే శశిధర్‌రెడ్డితోపాటు కాంగ్రెస్‌ నాయకులు  బట్టి జగపతి, సుప్రభాతరావు, బాలకృష్ణ తదితరులు పోటీచేసేందుకు ఆసక్తిగా ఉన్నారు. అయితే పొత్తులో భాగంగా మెదక్‌ స్థానం టీజేఎస్‌కు కేటాయిస్తున్నట్లు ప్రచారం సాగుతుండటంతో ఆశావహులంతా మాజీ ఎంపీ విజయశాంతిని ఆశ్రయించారు. మెదక్‌ సీటు ఎట్టిపరిస్థితుల్లో కాంగ్రెస్‌కు దక్కేలా చూడాలని, తమలో ఎవరికి టికెట్‌ ఇప్పించినా కలిసికట్టుగా పనిచేసి పార్టీ గెలుపుకోసం కృషి చేస్తామని వారు విజయశాంతిపై వత్తిడి తీసుకువస్తున్నారు. దీంతో విజయశాంతి చొరవ తీసుకుని స్నేహ పూర్వక పోటీ అంశాన్ని తెరపైకి తీసుకువచ్చినట్లు తెలుస్తోంది. 

14న నామినేషన్‌..
మెదక్‌ నియోజకవర్గంలో కాంగ్రెస్‌ గెలిచే అవకాశం ఉన్నందున కాంగ్రెస్, టీజేఎస్‌ స్నేహ పూర్వకపోటీ చేసేలా చూడాలని అధిష్టానం నేతలకు చెప్పినట్లు తెలుస్తోంది. స్నేహ పూర్వక పోటీ అంశంపై హైదరాబాద్‌లో కాంగ్రెస్‌ నేతలు, టీజేఎస్‌ నేతలు సోమవారం చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. స్నేహపూర్వక పోటీ అంశం తెరపైకి రావడంతో కాంగ్రెస్‌ నేతల్లో మెదక్‌ టికెట్‌పై మళ్లీ ఆశలు చిగురిస్తున్నాయి. టీజేఎస్‌ ఈ పోటీకి అంగీకరిస్తే బరిలో దిగేందుకు ఆశావహులు ఎవరికివారే సిద్ధం అవుతున్నారు. మాజీ ఎమ్మెల్యే శశిధర్‌రెడ్డి ఏకంగా ఈనెల 14న కాంగ్రెస్‌ పార్టీ నుంచి నామినేషన్‌ వేయనున్నట్లు ప్రకటించారు.

సోమవారం మెదక్‌లో కాంగ్రెస్‌ పార్టీ కార్యకర్తలు, మద్దతుదారులతో సమావేశమైన ఆయన 14న నామినేషన్‌ వేయనున్నట్లు తెలిపారు. కాంగ్రెస్‌ బీ ఫామ్‌ తనకే దక్కుతుందని ధీమా సైతం వ్యక్తం చేశారు. మెదక్‌లో కాంగ్రెస్, టీజేఎస్‌ మధ్య స్నేహ పూర్వక పోటీ దిశగా అడుగులు పడుతున్నాయని, తాను స్వతంత్ర అభ్యర్థిగా కాకుండా కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థిగా బరిలో ఉండటం ఖామయని చెప్పారు. కాగా టీజేఎస్‌ జిల్లా అధ్యక్షుడు జనార్దన్‌రెడ్డి మాత్రం స్నేహపూర్వక పోటీ ఉండే అవకాశం లేదని చెబుతున్నారు. స్నేహపూర్వక పోటీ ప్రతిపాదనను కాంగ్రెస్‌ తీసుకువచ్చిందని, అయితే తమ పార్టీ ఆసక్తిచూపడం లేదన్నారు.    

మరిన్ని వార్తలు