ఇంటింటికీ సీసీ కెమెరాలు అవసరం

27 Feb, 2019 09:45 IST|Sakshi
సీసీ కెమెరాలను ప్రారంభిస్తున్న సీసీ మహేష్‌భగవత్, ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి, కార్పొరేటర్‌ కొప్పుల విఠల్‌రెడ్డి

మన్సూరాబాద్‌: నల్లా మాదిరిగానే ప్రతి ఇంటికీ సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని, తద్వారా నేరాలను నియంత్రించవచ్చునని రాచకొండ కమిషనర్‌ మహేష్‌ భగవత్‌ అన్నారు. ఎల్‌బీనగర్‌ చంద్రపురికాలనీలో రూ. 8.5 లక్షల వ్యయంతో కాలనీవాసులు ఏర్పాటు చేసుకున్న 82 సీసీ కెమెరాలను ఎల్‌బీనగర్‌ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి, మన్సూరాబాద్‌ కార్పొరేటర్‌ కొప్పుల విఠల్‌రెడ్డితో కలిసి మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు సహకారంతో సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.  సమస్యత్మాక ప్రాంతాలు, మురికివాడల్లో స్వచ్ఛందసంస్థలు, కార్పొరేటర్‌ సంస్థల సహకారంతో సీసీ కెమెరాల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఉప్పల్‌ నుంచి ఘట్‌కేసర్‌ వరకు ప్రధాన రాహదారిపై ఇన్ఫోసిస్‌ సహకరంతో 182 సీసీ కెమెరాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కాలనీ సంక్షేమ సంఘాల ప్రతినిధులు ముందుకు వచ్చి సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. దీని వల్ల నేరాలు తగ్గుతాయని, నేరస్తులను త్వరగా పట్టుకునేందుకు అవకాశం ఉంటుందన్నారు.  

ప్రారంభంలో రాచకొండ కమిషనరేట్‌ పరిధిలో 8వేల సీసీ కెమెరాలుండగా నేడు వాటి సంఖ్య 65వేలకు చేరుకుందని తెలిపారు. చంద్రపురికాలనీలో అక్రమపార్కింగ్‌ల సమస్యను పరిష్కరించాలని సిబ్బందికి సూచించారు. ఎల్‌బీనగర్‌ రింగ్‌రోడ్డులోని బస్‌టెర్మినల్‌ను వనస్థలిపురంలోని హరణి వనస్థలి జాతీయ పార్కు సమీపంలోకి మార్చేందుకు ఆర్టీసీ అధికారులతో చర్చిస్తామన్నారు., దీంతో ఎల్‌బీనగర్‌లో ట్రాఫిక్‌ సమస్య తీరుతుందని తెలిపారు. కార్యక్రమంలో కాలనీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు రుద్రయాదగిరి, ఎల్‌బీనగర్‌ ఏసీపీ పృథ్వీధర్‌రావు, ఇన్‌స్పెక్టర్‌ అశోక్‌రెడ్డి, శ్రీధర్‌రెడ్డి, నాయకులు కొప్పుల నర్సింహారెడ్డి, జక్కిడి మల్లారెడ్డి, రఘువీర్‌రెడ్డి, శ్రీకాంత్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

>
మరిన్ని వార్తలు