సీసీ కెమెరాకు చిక్కిన చిరుత

2 Mar, 2019 02:40 IST|Sakshi

లేగదూడను తింటున్న చిరుత దృశ్యాల రికార్డు   

8 ఏళ్ల వయసు ఉంటుందని అటవీ అధికారుల వెల్లడి  

కడ్తాల్‌ (కల్వకుర్తి), యాచారం (ఇబ్రహీంపట్నం): ఏడాది కాలంగా రంగారెడ్డి జిల్లా పరిధిలోని 4 మండలాల ప్రజలు, అటవీ శాఖ అధికారులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న చిరుత పులి గురువారం రాత్రి కనిపించింది. అటవీ శాఖ ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల్లో చిరుత లేగదూడను తింటున్న దృశ్యాలు రికార్డయ్యాయి. యాచారం, మాడ్గుల, కడ్తాల్, ఆమనగల్లు మండలాల పరిధిలో చిరుత రాత్రి పూట పశువులు, గొర్రెలు, మేకలపై దాడి చేసి చంపేసింది. అధికారులు పలు చోట్ల బోనులు ఏర్పాటు చేసినా చిక్కలేదు. అయితే, ఇన్నాళ్లు పశువులపై దాడులు చేస్తున్నది చిరుతనా లేక హైనా జంతువా అనేది తెలియలేదు. పాదముద్రలను బట్టి చిరుత పులేనని అటవీ శాఖ అధికారులు ప్రాథమికంగా గుర్తించి అప్రమత్తం చేశారు.

బుధవారం రాత్రి కడ్తాల్‌ మండల పరిధిలోని గోవిందాయిపల్లిలో లేగదూడలపై చిరుతపులి దాడి చేసి చంపేసింది. అటవీ శాఖ అధికారులు అటవీ ప్రాంతంలో బోన్లు ఏర్పాటు చేసి సీసీ కెమెరాలు బిగించారు. గురువారం రాత్రి మరోమారు లేగదూడపై దాడి చేసి మాంసం తింటున్న చిరుత సీసీ కెమెరాల్లో కనిపించింది. సీసీ కెమెరాల్లో కనిపించిన చిరుతపులిని గుర్తించిన అటవీ శాఖ అధికారులు ఈ అటవీ ప్రాంతంలో సంచరిస్తున్నది చిరుత పులేనని నిర్ధారణకు వచ్చారు. శుక్రవారం అటవీ శాఖ రేంజ్‌ అధికారి సత్యనారాయణ తన బృందంతో కలసి కడ్తాల్, యాచారం మండలాల అటవీ ప్రాంతంలో పర్యటించారు.

చిరుత నిత్యం 25 కిలోమీటర్లు సంచరిస్తూ వ్యవసాయ బావుల వద్ద పశువులపై దాడులు చేసి చంపుతోందని గుర్తించారు. గురువారం రాత్రి సీసీ కెమెరాలో కనిపించిన చిరుత 8 ఏళ్ల వయసుఉంటుందని అధికారులు నిర్ధారణకు వచ్చారు. చిరుతపులి ఉన్నట్లు గుర్తించిన అటవీ శాఖ అధికారులు శుక్రవారం ఆయా మండలాల అటవీ ప్రాంతంలో 3 బోన్లు, 3 సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. త్వరలో చిరుతను పట్టుకుంటామని రేంజ్‌ అధికారి సత్యనారాయణ పేర్కొన్నారు. చిరుతపులి ఉన్నట్టు తేలడంతో ఆయా మండలాల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.  

మరిన్ని వార్తలు