గురుకులాల్లో నిఘా నేత్రాలు

5 Aug, 2018 00:56 IST|Sakshi

సీసీ కెమెరాల ఏర్పాటుకు సొసైటీల నిర్ణయం

సాక్షి, హైదరాబాద్‌: గురుకుల పాఠశాలల్లో నిఘా వ్యవస్థను మరింత బలోపేతం చేసేందుకు గురుకుల సొసైటీలు చర్యలు చేపట్టాయి. ప్రతి గురుకులంలో అధునాతన పద్ధతిలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించాయి. గురుకులాల సంఖ్య పెరగటంతో అక్కడక్కడా అవకతవకలు చోటుచేసుకుంటున్నాయి. దీంతో వాటిని నియంత్రించేందుకు నిఘా వ్యవస్థను త్వరలో అందుబాటులోకి తేనున్నాయి.

ఒక్కో గురుకుల పాఠశాలలో కనిష్టంగా రూ.1.5 లక్షలతో డిజిటల్‌ సీసీ కెమెరాలు, స్టోరేజీ సిస్టం ఏర్పాటు కు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 565 గురుకుల పాఠశాలలున్నాయి. వీటిలో సీసీ కెమెరాల వ్యవస్థను ఏర్పాటు చేయనున్నారు.

ఈ వ్యవస్థను పాఠశాల స్థాయిలో ఆపరేటింగ్‌ చేసేలా వెసులుబాటు ఉన్నప్పటికీ.. నిర్వహణ తీరును పరిశీలించేందుకు గురుకుల సొసైటీలో ప్రత్యేకంగా కమాండ్‌ సెంటర్‌ను ఏర్పాటు చేయనున్నారు. అన్ని గురుకుల పాఠశాలలు, జూనియర్, డిగ్రీ కాలేజీల్లో వీటి ఏర్పాటుకు రూ.15 కోట్లు ఖర్చు చేసేలా సొసైటీలు సుముఖత వ్యక్తం చేయడంతో అధికారులు ప్రతిపాదనలు తయారు చేస్తున్నారు.  

మరిన్ని వార్తలు