బీసీ హాస్టళ్లలో ‘సీసీ నేత్రం’

17 Mar, 2017 01:22 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: వెనుకబడిన తరగతుల సంక్షేమ వసతిగృహాల్లో నిఘాను కట్టుదిట్టం చేయాలని బీసీ సంక్షేమ శాఖ నిర్ణయించింది. అపరిచితుల రాకపోకలపై ఫిర్యాదులు, విధి నిర్వహణలో వసతిగృహ సంక్షేమాధికారి తీరుపై ఆరోపణలు పెరిగిపోతున్న నేపథ్యంలో చర్యలకు ఉపక్రమించింది. ఇందులో భాగంగా ముం దుగా బాలికల వసతిగృహాల్లో సీసీ(క్లోజ్‌డ్‌ సర్క్యూట్‌) కెమెరాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ప్రస్తుతం రాష్ట్రంలో 705 బీసీ సంక్షేమ హాస్టళ్లు ఉన్నాయి. ఇందులో 250 కాలేజీ విద్యార్థి హాస్టళ్లు కాగా, 455 పాఠశాల విద్యార్థి హాస్టళ్లు.

వీటిలో 325 బాలికల వసతిగృహాలుండగా, ఈ హాస్టళ్లలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసేందుకు ఆ శాఖ అంచనాలు సిద్ధం చేసి ప్రభుత్వానికి నివేదించింది. వసతిగృహ సంక్షేమాధికారి సమయపాలన పటించకపోవడం, అనధికారిక వ్యక్తులు హాస్టళ్లకు పదేపదే రావడంతో ఏర్పడుతున్న ఇబ్బందులను అరికట్టేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వానికి తెలిపింది. ఈ ప్రతిపాదనను ప్రభుత్వం ఆమోదించడంతో టీఎస్‌టీఎస్‌(తెలంగాణ స్టేట్‌ టెక్నికల్‌ సర్వీసెస్‌) ద్వారా కెమెరాలను ఏర్పాటు చేయడానికి చర్యలు తీసుకుంటోంది.

 ప్రతి వసతిగృహంలో బయోమెట్రిక్‌ మిషన్లు ఏర్పాటు చేయాలని ఆ శాఖ తాజాగా నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే ఎస్సీ, ఎస్టీ వసతిగృహాల్లో సత్ఫలితాలు వస్తున్న తరు ణంలో వీటిని బీసీ హాస్టళ్లలో అమలుకు పూనుకుంది. ఇకపై విద్యా ర్థులు, వసతిగృహ సంక్షేమా ధికారి, సిబ్బంది హాజరు కూడా బయోమెట్రిక్‌ మిషన్ల ద్వారా నమోదు చేస్తే పర్యవేక్షణ సులువవుతుందని అధికారులు చెబుతున్నారు. ఇందుకు రాష్ట్ర కార్యాలయంలో ప్రత్యేక సెల్‌ ఏర్పాటు చేస్తున్నారు. ఈ సెల్‌లోని ఉద్యోగులు వసతిగృహాల్లోని పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించి నివేదికలు తయారు చేస్తారు.

మరిన్ని వార్తలు