కరోనా జన్యుక్రమం నమోదు

9 Apr, 2020 02:27 IST|Sakshi

వైరస్‌ గురించి తెలుసుకుంటున్న సీసీఎంబీ

సాక్షి, హైదరాబాద్‌: ప్రాణాంతక మహమ్మారి కరోనా వైరస్‌కు ముకుతాడు వేసేందుకు అన్నివైపుల నుంచి ప్రయత్నాలు జోరందుకుంటున్నాయి. టీకా, మందుల తయారీలో ఇప్పటికే పలు కంపెనీలు నిమగ్నమై ఉండగా.. ఈ వైరస్‌ను క్షుణ్ణంగా అర్థం చేసుకునేందుకు హైదరాబాద్‌లోని సెంటర్‌ ఫర్‌ సెల్యులార్‌ అండ్‌ మాలిక్యులర్‌ బయాలజీ (సీసీఎంబీ), ఢిల్లీలోని ఇన్‌స్టిట్యూట్‌ ఆప్‌ జినోమిక్స్‌ అండ్‌ ఇంటిగ్రేటివ్‌ బయాలజీ (ఐజీఐబీ)లు జన్యుక్రమ నమోదును దాదాపు పూర్తి చేశాయి. అన్నీ సవ్యంగా సాగితే ఒకట్రెండు వారాల్లోనే కనీసం 5 ఐసోలేట్‌ వైరస్‌ల జన్యుక్రమాల నమోదు పూర్తి చేస్తామని సీసీఎంబీ డైరెక్టర్‌ డాక్టర్‌ రాకేశ్‌ మిశ్రా తెలిపారు. కరోనా బారిన పడ్డ వ్యక్తి నుంచి వేరు చేసిన వైరస్‌ను ఐసోలేట్‌ అంటారు. జన్యుక్రమాన్ని పూర్తిగా అర్థం చేసుకుంటే ఈ వైరస్‌ ఎప్పుడు.. ఎలా పుట్టింది.. ఎలా పరిణమించిందన్న విషయాలు తెలుస్తాయని, తద్వారా భవిష్యత్తులో ఈ రకమైన వైరస్‌లను అడ్డుకోవడం సాధ్యమవుతుందని వివరించారు.

వైరస్‌ పూర్తి జన్యుక్రమాన్ని తెలుసుకోవాలంటే బోలెడన్ని ఐసొలేట్‌ల జన్యుక్రమాలు అవసరమవుతాయి. ఎంత ఎక్కువ సంఖ్యలో ఐసొలేట్‌ జన్యుక్రమాలు ఉంటే.. అంత కచ్చితత్వంతో జన్యుక్రమాన్ని నమోదు చేయొచ్చు. ఆ వైరస్‌ గురించి అధ్యయనం చేయొచ్చు. ఈ కారణంగానే సీసీఎంబీతో పాటు ఐజీఐబీ కూడా ఐసోలేట్‌ జన్యుక్రమాలను నమోదు చేసే పనిలో ఉందని, ఇంకో వారం పది రోజుల్లో కావాల్సినంత సమాచారాన్ని సేకరించగలుగుతామని రాకేశ్‌ మిశ్రా తెలిపారు. వైరస్‌లకు సంబంధించి దేశంలోని ఏకైక పరిశోధన సంస్థ నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ వైరాలజీ నుంచి తాము కరోనా సోకిన వారి నుంచి వేరు చేసిన వైరస్‌లను సేకరిస్తున్నట్లు తెలిపారు. దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లోని వైరస్‌ల జన్యుక్రమాలను నమోదు చేయడం ద్వారా ఎక్కువ ప్రయోజనముంటుందని చెప్పారు.  

మరిన్ని వార్తలు